Site icon NTV Telugu

TSERC Chairman Sriranga Rao : రఘునందన్‌రావు అన్ని తెలుసుకొని మాట్లాడాలి

Sriranga Rao

Sriranga Rao

ఇటీవల బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగించాలని కమిషన్‌ అంటోందని ఆరోపించారు. దీనిపై తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ టి. రంగరావు స్పందిస్తూ.. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుకు నేను విద్యుత్ సంస్థలకు చేసిన సలహాలు, సూచనల కాపీని పంపిస్తాను. ఆయన చదువుకుని మాట్లాడాలని ఆయన అన్నారు. రఘునందన్ రావు విద్యుత్ మీటర్ల బిగింపు పై ఎలాంటి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు.

గత నెలలో విద్యుత్ టారిఫ్ ఆర్డర్ ఇవ్వడం జరిగిందని, ఈ టారిఫ్ ఆర్డర్ తోపాటు కొన్ని సలహాలు సూచనలు కూడా డిస్కంలకు ఇవ్వడం జరిగిందన్నారు. విద్యుత్ సంస్థలకు కొన్ని కీలకమైన డైరెక్షన్‌లు ఇవ్వడం జరిగిందని, అందులో భాగంగానే వ్యవసాయ రంగంకు విద్యుత్ సరఫరా సంబంధించి కొన్ని డైరెక్షన్ లు ఇవ్వడం జరిగిందని ఆయన వెల్లడించారు. వ్యవసాయ బావులకు సంబంధించి ట్రాన్స్ఫార్మర్స్ కు మీటర్లు పెట్టాలని డైరెక్షన్ ఇవ్వడం జరిగిందని, ఆ మీటర్లు కూడా స్మార్ట్ మీటర్లు పెట్టాలని ఆదేశించామన్నారు. కమిషనే మోటర్లకు మీటర్లు పెట్టాలని అంటుంది అని ఆయన ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని ఆయన హితవు పలికారు.

కమిషన్ పై మాట్లాడేటప్పుడు అన్ని తెలుసుకొని మాట్లాడాలని, బావుల వద్ద మీటర్లు పెట్టాలని ఈఆర్సీ వల్లే పెట్టాలని ఇచ్చారు అని బీజేపీ ఎమ్మెల్యే అంటున్నాడు అయితే ఆయన సరిగ్గా అర్థం చేసుకోలేకనో, అర్థం కాకనో ఇలా మాట్లాడి ఉంటాడని ఆయన మండిపడ్డారు. ట్రాన్స్ఫార్మర్స్ కు మాత్రమే మీటర్లు పెట్టాలని చెప్పాము తప్ప ఎక్కడ కూడా బావుల దగ్గర మీటర్లు పెట్టాలని చెప్పలేదని ఆయన స్పష్టం చేశారు. వ్యవసాయ రంగం సంబంధించి ఎలాంటి మీటర్లు పెట్టాలని చూపించలేదని, రేపు కామారెడ్డి జిల్లాలో మా ఈఆర్సీ బృందం వెళ్తుందని, దీనితో విద్యుత్ సరఫరా, సమస్యలు తెలుసుకునేందుకు మేము వెళ్తున్నామన్నారు.

Exit mobile version