తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఇటీవల వరుసగా జాతీయ నాయకులు తెలంగాణలో పర్యటిస్తున్నారు. తెలంగాణ వచ్చిన నాటి నుంచి అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ పార్టీ తన పట్టును మరింత బిగించేందుకు ప్రయత్నాలు చేస్తుండగా.. ఆ పార్టీలోని విభేదాలు బయట పడుతున్నాయి. వర్గ పోరు, అధిపత్య పోరుతో టీఆర్‌ఎస్‌లో లుకలుకలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే తాజాగా.. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని గులాబీ నేతల మధ్య అధిపత్య పోరుతో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు కాంగ్రెస్‌లోకి వెళ్లనున్నట్లు నియోజకవర్గంలో విసృత స్థాయి ప్రచారం సాగుతోంది. అయితే దీనికి బలం చేకూర్చుస్తూ.. ఢిల్లీలో నల్లాల ఓదెలు, ఆయన భార్య మంచిర్యాల జడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మితో పాటు కుటుంబసభ్యులు, మరో ప్రజాప్రతినిధి ఉన్నట్లు సమాచారం.
అయితే.. ఓదెలు కారు దిగి కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. నేడో, రేపో.. కాంగ్రెస్ అగ్రనాయకుల సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. చెన్నూరు నియోజకవర్గంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు నల్లా ఓదెల మధ్య అధిపత్య పోరు ఉందని బాహాటంగా గులాబీ దళంలో చర్చలు నడుస్తున్నాయి. టీఆర్‌ఎస్ పార్టీని క్రిందిస్థాయి నుంచి బలోపేతం చేసే దిశగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ వ్యూహాలు రచిస్తుంటే.. పార్టీలోని నేతల మధ్య సంధి కూదరడం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.