Uday Krishna Reddy : నేషనల్ పోలీస్ అకాడమీలో తోటి ట్రైనీ ఐపీఎస్ అధికారిణి ఇచ్చిన ఫిర్యాదుతో నమోదు అయిన ఎఫ్‌ఐఆర్ (FIR) లో దిగ్భ్రాంతికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. బాధితురాలు అందించిన వివరాల ప్రకారం నిందితుడు ఉదయ్ కృష్ణారెడ్డి ఆమెపై మానసికంగా, శారీరకంగా తీవ్ర స్థాయిలో వేధింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఎన్టీవీ (NTV) ఎక్స్‌క్లూసివ్‌గా సేకరించిన ఎఫ్‌ఐఆర్ కాపీలో ప్రధానాంశాలు ఇవే.
వాట్సాప్ వేధింపులు , ప్రచారం
బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్న దాని ప్రకారం ఉదయ్ కృష్ణారెడ్డి ఆమెను వాట్సాప్ ద్వారా లైంగికంగా వేధించడమే కాకుండా, వారిద్దరి మధ్య రిలేషన్ షిప్ ఉందంటూ తోటి ట్రైనీ ఐపీఎస్ అధికారుల వద్ద అసత్య ప్రచారాలు చేశాడు. అంతటితో ఆగకుండా, మరో ట్రైనీ అధికారితో ఆమెకు అక్రమ సంబంధం ఉందంటూ నిరాధారమైన ఆరోపణలు చేస్తూ అవమానించాడు. బాధితురాలిని “Bitch”, “Shameless” వంటి అత్యంత అసభ్యకరమైన పదాలతో దూషిస్తూ మానసిక క్షోభకు గురిచేశాడు.
వ్యక్తిగత వీడియోల చిత్రీకరణ.. భర్తకు పంపి బ్లాక్‌మెయిల్
బాధితురాలికి తెలియకుండానే ఆమె వ్యక్తిగత వీడియోలను రికార్డు చేసిన ఉదయ్, వాటి ఆధారంగా ఆమెను బ్లాక్‌మెయిల్ చేయడానికి యత్నించాడు. ఆ వీడియోలను ఆమె భర్తకు పంపించి తీవ్ర మనోవేదన కలిగించాడు. అంతేకాకుండా ఆమె మొబైల్ ఫోన్‌ను బలవంతంగా తన గదికి తీసుకెళ్లి, పాస్‌వర్డ్ చెప్పాలంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. అదే సమయంలో ఆమెను అసభ్యకరంగా తాకుతూ, తీవ్రంగా వేధించినట్లు ఫిర్యాదులో నమోదైంది.
గదిలో బంధించి కత్తితో బెదిరింపులు
ఈ నెల 9వ తేదీ రాత్రి బాధితురాలిని బలవంతంగా తన గదికి తీసుకెళ్లి బంధించిన ఉదయ్ కృష్ణారెడ్డి, ఆమె జుట్టు పట్టుకుని లాగి, గొంతు నులిమేందుకు ప్రయత్నించాడు. గది నుంచి బయటకు వెళ్లకుండా మెడపై కత్తి పెట్టి భయభ్రాంతులకు గురిచేశాడు. ఆమెను అవమానించే ఉద్దేశంతో మూడు కండోమ్ ప్యాకెట్లను ఆమెపైకి విసిరాడు. అనంతరం ఈ నెల 10వ తేదీ ఉదయం కూడా ఆమెపై తీవ్రంగా శారీరక దాడికి పాల్పడ్డాడు. అకాడమీలో ఇతరుల సమక్షంలోనూ అసభ్యకరంగా మాట్లాడి ఆమె పరువుకు భంగం కలిగించాడని బాధితురాలు తెలిపింది. ఈ ఘటనలపై సమగ్ర విచారణ జరిపి నిందితుడిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.

