ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణలో బతుకమ్మ సంబరాలు జరుగుతాయి.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫ్లవర్ ఫెస్టివల్‌ను గ్రాండ్‌గా నిర్వహిస్తూ వస్తోంది ప్రభుత్వం… ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభయ్యే ఈ వేడుకలు.. ఇవాళ సద్దుల బతుకమ్మతో ముగియనున్నాయి.. ఇప్పటికే ఎంగిలిపూల బతకమ్మ, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానే బియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, వెన్నముద్దల బతుకమ్మ అంటూ వివిధ పేర్లతో నిర్వహించగా.. చివరి రోజు సద్దుల బతుకమ్మ ఉత్సవాలను పెద్దస్థాయిలో నిర్వహించేందుకు సిద్ధం అయ్యింది తెలంగాణ ప్రభుత్వం.. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో సద్దుల బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తున్నారు.. దీంతో ఎల్వీ స్టేడియం పరిసరాల్లో ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు..
Read Also: Heavy Rains: మళ్లీ వర్షాలు.. మూడు రోజులు దంచికొట్టనున్న వానలు..
ఎల్బీ స్టేడియం వేదికగా సాయంత్రం సద్దుల బతుకమ్మ ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో… ఆ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు.. బషీర్‌బాగ్, పీసీఆర్ జంక్షన్, రవీంద్రభారతి, లిబర్టీ, ట్యాంక్‌బండ్, ఖైరతాబాద్, తెలుగుతల్లి, మోజంజాహి మార్కెట్, నాంపల్లి, అబిడ్స్, నారాయణగూడ, హిమాయత్‌నగర్, కవాడిగూడ, కర్బాలమైదాన్, బైబిల్ హౌస్, రాణిగంజ్, నల్లగుట్ట తదితర కూడళ్లలో ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు.. ఆయా రూట్లలో కాకుండా ప్రత్యామ్నాయ మార్గులు ఎంచుకోవాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.. ఎల్బీ స్టేడియం, లిబర్టీ జంక్షన్‌తో పాటు అప్పర్ ట్యాంక్‌బండ్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ రద్దీ ఉండే అవకాశం ఉందని.. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకొని సహకరించాల్సిందిగా సూచించారు ట్రాఫిక్ పోలీసులు.
ట్యాంక్ బండ్ దగ్గర ట్రాఫిక్ మళ్లింపు.. సికింద్రాబాద్ నుండి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చే ట్రాఫిక్ కర్బలా మైదాన్ వద్ద బైబిల్ హౌస్-జబ్బార్ కాంప్లెక్స్- కవాడిగూడ-లోయర్ ట్యాంక్ బండ్-కట్ట మైసమ్మ మరియు తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వైపు మళ్లించబడుతుంది. ఇక్బాల్ మినార్ నుండి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చే ట్రాఫిక్ ఓల్డ్ గేట్ సెక్రటేరియట్ వద్ద తెలుగు తల్లి ఫ్లైఓవర్-కట్టమైసమ్మ-ఇందిరా పార్క్-గాంధీ నగర్-ఆర్టీసి ఎక్స్ రోడ్ మీదుగా మళ్లించబడుతుంది. పంజాగుట్ట, రాజ్ భవన్ రోడ్డు నుంచి ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వైపు వెళ్లే వాహనాలను ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ప్రసాద్స్ ఐమాక్స్, మింట్ లేన్ వైపు మళ్లిస్తారు, నల్లగుట్ట జంక్షన్ నుంచి బుధభవన్ వైపు వాహనాలను నల్లగుట్ట ఎక్స్ రోడ్స్ నుంచి రాణిగంజ్, నెక్లెస్ రోడ్డు వైపు మళ్లిస్తారు. హిమాయత్ నగర్ మరియు బషీర్‌బాగ్ నుండి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చే ట్రాఫిక్ అంబేద్కర్ విగ్రహం వద్ద తెలుగుతల్లి జంక్షన్-ఎన్టీఆర్ మార్గ్ వైపు మళ్లించబడుతుంది. ముషీర్‌బాద్ మరియు కవాడిగూడ నుండి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను కవాడిగూడ ఎక్స్ రోడ్ వద్ద లోయర్ ట్యాంక్ బండ్-కట్టమైసమ్మ వైపు మళ్లిస్తారు.
ఆర్టీసీ బస్సు మళ్లింపులు: సికింద్రాబాద్ నుండి ఎంజీబీఎస్ వైపు వచ్చే అన్ని అంతర్-జిల్లా ఆర్టీసీ బస్సులు స్వీకర్-ఉప్కార్ జంక్షన్ వద్ద వైడబ్ల్యూసీఏ-సంగీత్-మెట్టుగూడ-తార్నాక-నల్లకుంట-ఫీవర్ హాస్పిటల్ X రోడ్స్-బర్కత్‌పురా-టూరిస్ట్ హోటల్-నింబోలియాద్ద-చాదర్‌ఘాట్-రంగమహల్ మరియు ఎంజీబీఎస్ వైపు మళ్లించబడతాయి. సిటీ బస్సులు కర్బలా మైదాన్‌లో బైబిల్ హౌస్-జబ్బార్ కాంప్లెక్స్-కవాడిగూడ ఎక్స్ రోడ్స్-లోయర్ ట్యాంక్ బండ్-కట్టమైసమ్మ మరియు తెలుగు తల్లి ఫ్లైఓవర్ వైపు మళ్లించబడతాయి… ఇక, బషీర్‌బాగ్, రవీంద్రభారతి, లిబర్టీ, ట్యాంక్ బండ్, ఖైరతాబాద్, నిజాం కళాశాల, తెలుగు తల్లి జంక్షన్/ సెక్రటేరియట్ జంక్షన్, నాంపల్లి, అబిడ్స్, నారాయణగూడ, హిమాయత్ నగర్, కవాడిగూడ ఎక్స్ రోడ్లు కట్టమైసమ్మ, కర్బలా మైదాన్, నల్లా రాణిగుంటజ్ ప్రాంతాలకు వాహనదారులు వెళ్లకుంటే మంచిదని పోలీసులు సూచిస్తున్నారు.. మరోవైపు, బతుకమ్మ ఉత్సవాలకు వచ్చేవారి కోసం పార్కింగ్‌కు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు టెన్నిస్ గ్రౌండ్, ఎల్బీ స్టేడియంలో వీఐపీలు మరియు అధికారుల కోసం పార్కింగ్ రిజర్వ్ చేయబడింది. ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా వాహనాలను బీజేఆర్ సర్కిల్ సమీపంలోని ఎస్‌సిఇఆర్‌టి కార్యాలయం వద్ద పార్క్ చేయాల్సి ఉంటుంది. ఆహ్వానితులతో కూడిన బస్సులన్నీ బుద్ధ భవన్ వెనుక ఉన్న నెక్లెస్ రోడ్డుకు వెళ్తాయి. నిజాం కాలేజీ గ్రౌండ్‌లో రిజర్వ్ పార్కింగ్ ఏర్పాటు చేశారు.
