NTV Telugu Site icon

Traffic Restrictions: హైదరాబాద్‌లో రేపు, ఎల్లుండి ట్రాఫిక్‌ ఆంక్షలు..

Joint Cp Ranganath

Joint Cp Ranganath

హైదరాబాద్‌ మహా నగరంలో గణేష్‌ నిమజ్జనానికి ప్రత్యేక స్థానం ఉంది.. తొమ్మిదిరోజుల పాటు గణపయ్యను భక్తి శ్రద్ధలతో.. భజన కీర్తనలు, ఆటాపాటలతో కొలిచిన భక్తులు.. ఆయన్ని గంగమ్మ ఒడికి చేర్చేందుకు సమయం దగ్గర పడింది.. సాధారణంగా.. గణేష్‌ చవితి మలి రోజు నుంచే.. చిన్ని చిన్న వినాయకులు మొదలు… కొన్ని పెద్ద విగ్రహాలను కూడా నిమజ్జనం చేస్తూ వస్తుంటారు.. కానీ, హైదరాబాద్‌ లోని మహా నిమజ్జన కార్యక్రమం మాత్రం రెండు రోజుల పాటు సాగుతోంది.. బాలాపూర్‌ గణపతి శోభయాత్రతో ప్రారంభమై.. మహానగరంలోని నలువైపుల నుంచి ట్యాంక్‌బండ్‌కు తరలివస్తున్నారు గణపయ్యలు.. రేపు హైదరాబాద్‌లో గణేష్‌ నిమజ్జన కార్యక్రమం సాగనుంది.. ఈ సందర్భంగా ట్యాంక్‌ బండ్‌ పరిసరాలు సహా.. చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు పోలీసులు… రేపు ఉదయం నుండి ఎల్లుండి ఉదయం వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయని వెల్లడించారు ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ రంగనాథ్..

Read Also: Heavy Rains: కుండపోత ఆగలేదు.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు..

గణేష్‌ నిమజ్జనం, హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలపై ప్రత్యేకంగా ఎన్టీవీతో మాట్లాడారు ట్రాఫిక్‌ జాయింట్ సీపీ రంగనాథ్.. రేపు (శుక్రవారం) ఉదయం నుండి ఎల్లుండి (శనివారం) ఉదయం 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు.. బాలాపూర్ వినాయకుడు నుండి ఉదయం 10 గంటలకు శోభాయాత్ర మొదలవుతుందన్న ఆయన.. బాలాపూర్ నుండి సౌత్ జోన్ మీదుగా చార్మినార్ , ఎంజే మార్కెట్, తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా ట్యాంక్ బండ్ లో నిమజ్జనం జరుగుతుందన్నారు.. ఈ సందర్భంగా మూడు వేల మంది ట్రాఫిక్ పోలీసులు విధుల్లో ఉంటారు.. శోభాయాత్ర జరిగే ప్రధాన రహదారుల్లో సాధారణ వాహనాలు అనుమతి లేదని స్పష్టం చేశారు. ట్యాంక్ బండ్, తెలుగు తల్లి ఫ్లై ఓవర్, హుస్సేన్‌సాగర్‌, హుస్సేన్‌ సాగర్‌ దగ్గర ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు.

ఈ ఏడాది హుస్సేన్‌ సాగర్‌లో 20 వేల విగ్రహాలు నిమజ్జనం జరిగే అవకాశం ఉందన్నారు జాయింట్‌ సీపీ రంగనాథ్.. సెంట్రల్ జోన్ లోనే ఎక్కువ ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయి జాగ్రతలు తీసుకోవాలని సూచించారు.. ఖైరతాబాద్ వినాయకుడు ఉదయం నుంచి ర్యాలీ ప్రారంభం అవుతుంది.. ఖైరతాబాద్ నుండి ఎన్టీఆర్ మార్గ్ రూట్ లో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశామన్నారు.. వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచిస్తున్నాం.. నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా పోలీసులకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.. సొంత వాహనాల్లో వచ్చి వారు.. కేటాయించిన ప్రాంతాల్లో వాహనాలు పార్క్‌ చేసుకోవాలని సూచించారు హైదరాబాద్‌ ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ రంగనాథ్.