టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి తారాస్థాయికి చేరిందని టిపిసిసి అధికార ప్రతినిధి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. వరంగల్ అభివృద్ధికి ఔటర్ రింగ్ రోడ్డు పేరుతో 27 గ్రామాల పంటలు ద్వంసం చేసే విధంగా వున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో ఇన్సైడర్ ట్రేడింగ్ జరుగుతుందని విమర్శించారు. ప్రభుత్వ నిర్ణయంపై రైతులు ఆగ్రహంగా ఉన్నారని అన్నారు. రైతుల పక్షాన కాంగ్రెస్ అండగా నిలబడడంతో ల్యాండ్ పూలింగ్ ని తాత్కాలికంగా నిలిపివేశారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో 27 గ్రామాలు 5 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ప్రభావం ఉంటుందనే తాత్కాలికంగా నిలిపివేశారని అన్నారు.
దీనిని మళ్ళీ చేపట్టే అవకాశం ఉందని, ల్యాండ్ పూలింగ్ వల్ల ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని తెలిపారు. దీనిని మళ్ళీ పైవేటు వ్యక్తులకు అమ్ముకుంటారని విమర్శించారు. అసైన్డ్ భూములు తీసుకున్న దానికి తగిన పారితోషకం ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పిన పట్టించుకోవడం లేదని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలే గద్దె దించే సమయం దగ్గరలోనే వుందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిని ప్రజలు గమనిస్తున్నారని టిపిసిసి అధికార ప్రతినిధి రామచంద్రారెడ్డి ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పై మండిపడ్డారు.
