ప్రజాగళం సభ అట్టర్ ఫ్లాప్.. ఆ కూటమికి ఓటేస్తే 4శాతం రిజర్వేషన్ పోయినట్లే
టీడీపీ- బీజేపీ- జనసేన పార్టీలు చిలకలూరుపేటలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభ అట్టర్ ఫ్లాప్ అయిందని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఇక, బీజేపీతో పొత్తు ఉన్న టీడీపీకి ఓటు వేస్తే ముస్లింల 4 శాతం పర్సెంట్ రిజర్వేషన్ పోయినట్లే అని తెలిపారు. 2014లో అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో గందరగోళం చేశారు.. ఒకరిపై ఒకరు దుష్ప్రచారాలు చేసుకొని నీచంగా మాట్లాడుకున్నారు అని ఆయన చెప్పుకొచ్చారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వీరి కుమ్ములాటను చూశారు.. వీరి కూటమికి ప్రజలు ఓట్లు వేయడానికి సిద్ధంగా లేరు.. చిలకలూరిపేట సభ నుంచి వీరు ప్రజలకు ఏ సందేశం ఇచ్చారు.. చంద్రబాబు అభద్రతాభావంతో ఉన్నాడు.. దేశ ప్రధాని వస్తే మైక్ కూడా సరిగ్గా పని చేయలేదు అంటూ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చామన్నది కాదు అన్నయ్యా.. బుల్లెట్ దిగిందా లేదా..!
నంద్యాల జిల్లాలోని డోన్ నియోజకవర్గంలో యువత కోసం రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక యువతతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. ఇక, మంత్రి బుగ్గన మాట్లాడుతూ.. యువతకు పెద్దపీట వేసేందుకే మన పార్టీ స్థాపించబడిందన్నారు. మహిళలు ఆడ పిల్లలు స్వేచ్ఛగా జీవించేందు కోసం దిశ యాప్ తీసుకువచ్చామన్నారు. యువత ఉపాధి కోసం 20 కోట్లతో ఐడిటిఆర్ ప్రాజెక్టును నిర్మించాం.. ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలు అని తేడా లేకుండా అమ్మ ఒడిని అందించామని ఆయన చెప్పుకొచ్చారు. నియోజకవర్గం, రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందాలంటే యువత భాగస్వామ్యంతోనే సాధ్యం.. మేము రాజకీయాల్లో ఉండి ఏ అభివృద్ధి చేసినా మీకోసమే.. మీరు రాజకీయాల్లోకి వచ్చి ఏమి చేసినా మీ అభివృద్ధి కోసమే అని మంత్రి బుగ్గన పేర్కొన్నారు.
ఈసీకి కాంగ్రెస్ లేఖ.. 2 రాష్ట్రాల్లో పోలింగ్ తేదీ మార్చాలని వినతి
రెండు రాష్ట్రాల్లో ఎన్నికల తేదీలను మార్చాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కాంగ్రెస్, ముస్లిం సంఘాలు కోరాయి. ఈ మేరకు సీఈసీకి కాంగ్రెస్ లేఖ రాసింది. ఏడు విడతల్లో పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. తొలి విడత ఏప్రిల్ 19న ప్రారంభమవుతోంది. అయితే రెండో విడత ఏప్రిల్ 26న జరగనుంది. అయితే ఏప్రిల్ 26 శుక్రవారం వచ్చింది. ఇది ముస్లింలకు ప్రత్యేక మైన రోజు. ఆ రోజున ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేసుకుంటారు. ఈ కారణంగా తేదీలను మార్చాలని ఈసీని కేరళ కాంగ్రెస్ కోరింది.
ఏప్రిల్ 26 ముస్లింలకు ప్రత్యేక మైన రోజు అని.. ఓటు వేసేందుకు ఇబ్బందులు తలెత్తకుండా ఎన్నికల తేదీని మార్చాలని కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ MM హసన్, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత VD సతీశన్.. ఎన్నికల సంఘాన్ని కోరారు. అలాగే కేరళతో పాటు తమిళనాడులో కూడా పోలింగ్ తేదీలను మార్చాలని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కోరింది.
జగన్ను ఎదుర్కోలేక 2014లాగా మళ్ళీ ముగ్గురూ జత కట్టారు
నెల్లూరు జిల్లాలో పోదలకూరులో వైసీపీ కార్యాలయాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా ప్రచార సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి జగన్ చెప్పిన సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ అమలు చేశారు.. జగన్ ను ఎదుర్కోలేక 2014 లాగా మళ్ళీ ముగ్గురూ జత కట్టారు అని ఆయన విమర్శలు గుప్పించారు. కేంద్రంలో ఉన్న ప్రభుత్వంతో స్నేహ పూర్వకంగా ఉంటామే తప్పా.. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టం అని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి తెలిపారు.
గడ్చిరోలి జిల్లాలో ఎదురు కాల్పులు.. నలుగురు మావోయిస్టులు మృతి
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మంగళవారం ఉదయం భద్రతా బలగాలతో జరిగిన కాల్పుల్లో కనీసం నలుగురు అనుమానిత మావోయిస్టులు, వారిలో ఇద్దరు నిషేధిత సీపీఐ (మావోయిస్ట్) సభ్యులు మరణించారని పోలీసులు తెలిపారు. గడ్చిరోలి జిల్లాకు 400 కిలోమీటర్ల దూరంలో తెలంగాణ సరిహద్దులో ఉన్న కొలమార్క పర్వతాలలో దాదాపు రెండు గంటలపాటు జరిగిన ఎన్‌కౌంటర్ జరిగింది. మృతి చెందిన మావోయిస్టులపై రూ. 36 లక్షల సామూహిక రివార్డు ఉందని గడ్చిరోలి, నీలోత్పాల్ పోలీసు సూపరింటెండెంట్ (SP) తెలిపారు. గడ్చిరోలిలో అనుమానిత మావోయిస్టులు ఉన్నట్లు సోమవారం మధ్యాహ్నం తమకు సమాచారం అందిందని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ తెలిపారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో విధ్వంసక కార్యకలాపాలకు పాల్పడే లక్ష్యంతో వారు పొరుగున ఉన్న తెలంగాణ నుంచి ప్రాణహిత నదిని దాటి ప్రవేశించారు. “సమాచారాన్ని ధృవీకరించిన తర్వాత, మేము వెంటనే పోరాట కార్యకలాపాలలో నైపుణ్యం కలిగిన బహుళ పోలీసు బృందాలను మరియు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) త్వరిత చర్య బృందాన్ని ఏర్పాటు చేసాము. వారిని ఆ ప్రాంతంలో అన్వేషణ కోసం పంపారు” అని నీలోత్పాల్ తెలియజేశాడు.
సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష వాయిదా.. కొత్త తేదీలివే!
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల జరగనున్నాయి. ఇందుకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఈ నేపథ్యంలో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్, ఫారెస్ట్ సర్వీస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కీలక సూచనలు చేసింది.
అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించే యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష, ఫారెస్ట్ సర్వీస్ స్క్రీనింగ్ పరీక్షలు వాయిదా వేసింది. గతంలో వేర్వేరుగా ప్రకటించిన రెండు నోటిఫికేషన్ల ప్రకారం.. ప్రిలిమినరీ పరీక్ష మే 26న జరగాల్సి ఉంది. అయితే లోక్‌సభ ఎన్నికల కారణంగా ఈ పరీక్షల్ని రీషెడ్యూల్ చేస్తూ యూపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. అలాగే ఈ రెండు పరీక్షలను జూన్ 16న ఈ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు యూపీఎస్సీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది.
జనసేన లేకపోతే ఈ పొత్తులు లేవు..
కాకినాడ ఎంపీ కూడా మనదే.. అందరూ కలిసి పని చేయాలి అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కాకినాడ పార్లమెంట్ జనసేన లక్ష ఓట్ల మెజారిటీతో గెలవాలి.. చలమల శెట్టి సునీల్, వంగా గీత మన ద్వారానే వచ్చారు.. సునీల్ ఇటీవల ఎక్కడో పెళ్లిలో కూడా నాకు కనిపించారు.. సునీల్ మంచి వారే గానీ.. తప్పు పార్టీని ఎంచుకున్నారు.. లేదా సరైన సమయంలో ఆ పార్టీని ఎంచుకోలేదని భావిస్తున్నాను అని ఆయన చెప్పుకొచ్చారు. వైసీపీకి సుస్థిరత ఇవ్వాలని మనసులో లేదు.. అందుకే రాష్ట్రం ఇలా తయారైంది.. నా క్యాడర్ ను నేను రక్షించుకుంటా.. నేను వదలను.. కాకినాడ పెన్షనర్ల ప్యారడైజ్ అని అందరూ అంటారు.. నేడు కాకినాడ గంజాయికి కేంద్రంగా, క్రైం పట్టణంగా మారింది.. వీటిని నిలువరించాలంటే బలమైన వ్యక్తులు ప్రజాప్రతినిధులుగా ఉండాలి అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
రిజర్వాయర్లలో సరిపడా నీరు ఉంది.. తాగునీటి అవసరాలకు ఏవిధమైన ఇబ్బందులు లేవు
రాష్ట్రంలోని రిజర్వాయర్లలో సరిపడా నీరు ఉన్నందున ప్రస్తుత వేసవికాలంలో తాగునీటి అవసరాలకు ఏవిధమైన ఇబ్బందులు లేవని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి స్పష్టం చేశారు. రాష్ట్రంలో తాగునీటి సరఫరా పరిస్థితులపై సంబంధిత శాఖల అధికారులతో నేడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా సి.ఎస్ మాట్లాడుతూ, యుద్ధప్రాతిపదికన మరమత్తులు చేపట్టి తాగునీటి సరఫరాను నిర్విరామంగా కొనసాగించాలని ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ లోనూ సరిపడా నీటిని అందిస్తున్నామని, ఎవరైనా అదనపు వాటర్ ట్యాంకులు కోరితే వాటిని కూడా అందిస్తున్నామని స్పష్టం చేశారు. మంచినీటి సరఫరా విషయంలో ఏవిధమైన ఆందోళనలు అవసరం లేదని అన్నారు. ఈ సందర్బంగా రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లలో నీటి లభ్యత, వేసవి కాలంలో తాగునీటి సరఫరాకు తీసుకున్నచర్యలపై సంబంధిత శాఖల కార్యదర్శులతో సమీక్షించారు.
ప్రజాగళం సభకు అడ్డుకునే ప్రయత్నం చేశారు..
మంత్రి అంబటి రాంబాబుకి సత్తెనపల్లి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ కౌంటర్ ఇచ్చారు. ఓటమి భయంతో వైసీపీ నేతలు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు అని విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది.. బొప్పూడిలో జరిగిన ప్రజాగళం సభ జన ప్రభంజనంలా చారిత్రాత్మకమైన సభలా జరిగింది అని పేర్కొన్నారు. బొప్పూడి సభకు 12 కిలో మీటర్ల దూరంలో నేనే ట్రాఫిక్‍లో ఇరుక్కుపోయాను అని ఆయన చెప్పుకొచ్చారు. సభకు ఎటూ సూచినా 15 కిలోమీటర్లు ట్రాఫిక్ ఆగిపోయింది.. సభలో ఒక భాగం ప్రజలుంటే.. మూడు భాగాలు సభ బయట ట్రాఫిక్‍లోనే ఉన్నారు.. ట్రాఫిక్‍ను క్లియర్ చేయడంలో, జనాన్ని కంట్రోల్ చేయడంలో పోలీస్ వ్యవస్థ వైఫల్యం చెందింది.. పోలీస్ వ్యవస్థ కావాలనే ట్రాఫిక్ సమస్యను సృష్టించారు అని కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు.
