మా విజయానికి కారణం ప్రేక్షకులే.. ఎమోషనల్ అయిన మోహన్ బాబు
విష్ణు మంచు ప్రధాన పాత్రలో నటించిన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ శుక్రవారం విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. శక్తివంతమైన కథ, గొప్ప తారాగణం, సాంకేతికంగా ఉన్నతంగా తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతుంది. ఈ సందర్భంగా శనివారం చిత్ర బృందం హైదరాబాద్‌లో ఓ థ్యాంక్స్ మీట్ నిర్వహించింది.ఈ ఈవెంట్‌లో డిస్ట్రిబ్యూటర్ మైత్రి శశి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వినయ్ మహేశ్వరి, నటులు శివ బాలాజీ, కౌశల్, అర్పిత్ రంకా తదితరులు పాల్గొని ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇందులో భాగంగా ముందుగా నిర్మాత డా. ఎం. మోహన్ బాబు మాట్లాడుతూ..
“భగవంతుని ఆశీస్సులతో ‘కన్నప్ప’ చిత్రానికి ఈ స్థాయిలో అద్భుతమైన విజయం లభించింది. నేను 50 ఏళ్లుగా సినీ రంగంలో ఉన్న, అభిమానుల ప్రేమ ఎప్పుడూ మారలేదు. ఈ సినిమా కోసం ప్రతీ ఒక్కరూ ఎంతో కష్టపడ్డారు. వారి అంకితభావంతో ఈ విజయం సాధ్యమైంది. దాదాపు మూడు దశాబ్దాల కల నిజమైంది.ఈ విజయాన్ని మన అభిమానులకు అంకితం ఇస్తున్నాను’ అని అన్నారు. తర్వాత విష్ణు మాట్లాడుతూ.. ‘కన్నప్ప’ సినిమాపై ప్రేక్షకుల స్పందన ఆశ్చర్యకరం. ఇది ఆధ్యాత్మికంగా జరిగిన శివలీల అనిపిస్తుంది. మా వంటి ఆర్టిస్టులకు దేవుళ్లు ప్రేక్షకులే. వాళ్ల ప్రేమతోనే మేం ఎదుగుతున్నాం. అందరికీ ధన్యవాదాలు’ అని తెలిపారు. దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. ‘మోహన్ బాబు గారు, విష్ణు గారు గత పదేళ్లుగా ఈ సినిమాపై పట్టుదలతో పనిచేస్తున్నారు. అన్ని విభాగాల్లో పని చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఇంకా ఈ సినిమాను చూడాల్సిన వారు చాలామంది ఉన్నారు. తప్పకుండా థియేటర్‌లో చూసి ఆనందించండి’ అన్నారు.
నేడు టీడీపీ కీలక భేటీ.. ఇంటింటి ప్రచారంపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం..
ఈరోజు ఉదయం 11గంటలకి టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ కన్వీనర్లు హాజరుకానున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా జులై 2వ తేదీ నుంచి కూటమి పార్టీ నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు సీఎం. సుమారు నెల రోజుల పాటు కూటమి పార్టీ నేతల ప్రచారం కొనసాగనుంది.. ఈ ఏడాది పాలనలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్లేలా దీని ద్వారా ప్రచారం చేయనున్నారు..
ఓటీటీ స్ట్రీమింగ్ కొచ్చిన చరిత్రలో నిలిచిపోయిన కథ ’23’
తెలుగు సినిమా ప్రేక్షకులకు ఒక గట్టి దెబ్బ కొట్టే విధంగా, జీవితం, ప్రేమ, బాధ్యత, మరియు నైతికతల మధ్య జరుగే హృదయ విదారక కథను “ఇరవై మూడు” సినిమాలో కళ్ళకు కట్టినట్టు చూపించాడు దర్శకుడు రాజ్ రాచకొండ. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమా, ఒక చిన్న గ్రామం చిలకలూరిపేట అనే పల్లెటూరులో ప్రారంభమవుతుంది. అక్కడి యువజంట ప్రేమలో పడతారు. వారి ప్రేమ, సమాజపు ఒడిదుడుకుల మధ్య, పెల్లి కంటే ముందే ఒక పొరపాటు జరుగుతుంది. ఆమె గర్భవతిగా మారిన తరవాత ఆ యువకుడు తన బాధ్యతను గుర్తుంచుకుంటాడు. ఆమెను పోషించడానికి ప్రయత్నిస్తాడు, కానీ సాధారణ పనులతో వచ్చే ఆదాయం సరిపోదు. “ఇంకా ఏదైనా చేయాలి పుట్టబోయే బిడ్డకు మంచి జీవితం ఇవ్వాలి” అన్న ఆశతో తన స్నేహితుడితో కలిసి ఒక దొంగతనానికిపాల్పడతాడు.
విశాఖ ఎక్స్ప్రెస్లో దోపిడీకి యత్నం.. పోలీసుల కాల్పులతో దొంగలు పరార్
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం తుమ్మల చెరువు దగ్గర విశాఖ ఎక్స్ ప్రెస్ లో దుండగులు చోరీకి యత్నించారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు మూడు రౌండ్లు గాల్లో కాల్పులు జరిపారు. ఒక్కసారిగా భయపడిన దొంగలు అక్కడి నుంచి పారిపోయారు. అయితే, పిడుగురాళ్ల సమీపంలో వరుసగా రైళ్ళలో చోరీకి బీహార్, మహారాష్ట్ర గ్యాంగులు పాల్పడుతున్నాయి. ఈ ముఠాలో ఏడుగురు సభ్యులున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారం రోజుల్లో రెండు సార్లు చోరీకి యత్నించినట్లు పేర్కొన్నారు. తెల్లవారుజామున చోరీకి పాల్పడటంతో పోలీసులు కాల్పులు జరిపారు. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దొంగల బెడద నుంచి ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు వెళ్లే విధంగా చూస్తామని తెలిపారు.
నేడు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నోటిఫికేషన్.. కొత్త ప్రెసిడెంట్ ఎవరో..?
ప్రతి మూడేళ్లకు ఒకసారి జరిగే పార్టీ సంస్థగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా జులై 1వ తేదీన బీజేపీ రాష్ట్ర కొత్త అధ్యక్ష ఎన్నిక జరగనుంది. ఈ మేరకు పార్టీ సంస్థగత ఎన్నికల అధికారి, రాజ్యసభ సభ్యుడు పాకా వెంకట సత్యనారాయణ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. ఈరోజు ( జూన్ 29న) ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక నోటిఫికేషన్ జారీతో పాటు అధ్యక్ష ఎన్నిక ఓటర్లను కూడా ప్రకటిస్తామన్నారు. ఇక, జూన్ 30వ (సోమవారం) తేదీన ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నామినేషన్‌లు స్వీకరణ.. ఆ తర్వాత ఒక గంట పాటు నామినేషన్ల స్క్రూటినీ.. సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్ల విత్ డ్రాకు అవకాశం ఇవ్వనున్నారు. జులై ఒకటో తేదీన పోలింగ్, రాష్ట్ర అధ్యక్ష పేరు ఖరారు ప్రక్రియ జరగనుంది. అయితే, కర్ణాటక ఎంపీ పీసీ మోహన్ ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరించనున్నారు.
ఆదిలాబాద్‌లో ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు బోల్తా.. 25 మందికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం రాత్రి హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని అమరావతికి వెళ్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు గుడిహత్నూర్ సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 25 మంది ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నారు. రాత్రి వేళ వంకరగా ఉన్న రహదారిపై బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న గట్టిపై ఢీకొంది. దీంతో బస్సు బోల్తా పడటంతో ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, అత్యవసర సేవల బృందాలు స్పందించాయి. గాయపడినవారిని సమీప ఆస్పత్రికి తరలించగా, తీవ్రమైన గాయాలున్న ఒకరిని ఆదిలాబాద్ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. డ్రైవర్ నిర్లక్ష్యం, అధిక వేగం లేదా రోడ్డు పరిస్థితులే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని అనుమానిస్తున్నారు. బస్సులో యాంత్రిక లోపాలు ఉన్నాయా అనే కోణంలోనూ విచారణ కొనసాగుతోంది. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
హైదరాబాద్‌లో ఏనుగు దంతాల కేసు.. కొనసాగుతున్న విచారణ
హైదరాబాద్ నగరంలో పట్టుబడిన ఏనుగు దంతాల కేసులో విచారణను వేగవంతం చేశారు. 2023లో భాకరాపేట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసులో చోరికి గురైన ఏనుగు దంతాలుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అన్నమయ్య జిల్లాకు చెందిన రేకులగుంట ప్రసాద్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు.. మరో నిందితుడు లోకేశ్వర్ రెడ్డి కోసం గాలింపు కొనసాగుతుంది. కాగా, 2013లో తలకోన అటవీ ప్రాంతంలో ప్రమాదవశాత్తు రెండు ఏనుగులు మృతి చెందాయి. ఆ ఏనుగుల దంతాలు తొలగించి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసులో అధికారులు భద్రపరిచారు. అయితే, 2023లో భాకరాపేట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసులో రెండు ఏనుగు దంతాలు, ఒక 12 బోర్ పంప్ యాక్షన్ గన్ చోరీకి గురి అయ్యాయి. 2023 నవంబర్ 20వ తేదీన భాకరాపేట పోలీస్ స్టేషన్ లో (క్రైం నెంబర్ 87/2023) కింద కేసు నమోదు అయింది. ఇ, ఈ రెండు ఏనుగు దంతాల విలువ సుమారు 70 వేల రూపాయలుగా ఉంటుందని ఎఫ్ఐఆర్ కాపీలో చూపించారు ఫారెస్ట్ అధికారులు.
ఒడిశా పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట.. ముగ్గురు మృతి
ఒడిశా రాష్ట్రంలోని పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట జరిగింది. గుండిచా ఆలయం దగ్గర జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మరణించగా.. సుమారు 50 మందికి పైగా గాయపడ్డారు. చనిపోయిన వారు ప్రేమకాంత మొహంతి, బసంతి సాహూ, ప్రభాతి దాస్ గా అధికారులు గుర్తించారు. అయితే, శనివారం రథయాత్ర ముగిసిన తర్వాత జగన్నాథ ఆలయం నుంచి రథాలు శారద బలి దగ్గరకు చేరుకున్నాయి. ఇవాళ (ఆదివారం) తెల్లవారుజామున 4.20 గంటల సమయంలో రథాలపై ఉన్న దేవతలను చూసేందుకు భక్తులు గుండిచా టెంపుల్ వద్దకు భారీగా చేరుకున్నారు. అదే సమయంలో చెక్క దుంగలను మోసుకెళ్లే రెండు ట్రక్కులు రద్దీగా ఉన్న ఏరియాలోకి ప్రవేశించడంతో తొక్కిసలాట జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.
