Site icon NTV Telugu

Top Headlines @9AM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

నేడు చివరి విడత ఎన్నికల పోలింగ్.. పూర్తి వివరాలు ఇవే..!

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోరుకు నేటితో తెరపడనుంది. ఇప్పటికే రెండు విడతల ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. నేడు మూడో దశ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 1 గంట వరకు ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం కల్పించారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. నేడు సాయంత్రానికి అభ్యర్థులు భవితవ్యం తేలనుంది. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల్లో ముమ్మర ఏర్పాట్లు చేశారు. ఎన్నికల కోసం 43,856 బ్యాలెట్‌ బాక్సులను సిద్ధం చేశారు.

బన్నీ-అట్లీ సినిమాకు ఇంటర్నేషనల్ టచ్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం నేషనల్ వైడ్ ఫేమ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ‘పుష్ప 2’ తర్వాత ఆయన తన తదుపరి చిత్రాన్ని కోలీవుడ్ బాక్సాఫీస్ డైరెక్టర్ అట్లీ తో కలిసి చేస్తున్నారు. భారీ అంచనాలు నెలకొన్న ఈ ఇంటర్నేషనల్ లెవెల్ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉంది. ఈ సినిమా గురించి తాజాగా వినిపిస్తున్న ఒక హాట్ అండ్ క్రేజీ అప్‌డేట్ అభిమానులలో ఉత్సాహాన్ని పెంచుతోంది. సమాచారం ప్రకారం, అట్లీ ఈ సినిమా కోసం ఒక అసాధారణమైన ‘అండర్ వాటర్’ (నీటి అడుగున) యాక్షన్ సీక్వెన్స్‌ను ప్లాన్ చేశారట. ఈ ఇంట్రెస్టింగ్ ఘట్టంలో అల్లు అర్జున్ పాల్గొంటున్నారని, దీని షూటింగ్‌ను గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది.

S.I.R ఎఫెక్ట్.. సీఎం మమతా బెనర్జీ సొంత నియోజకవర్గంలో 45,000 ఓట్ల తొలగింపు!

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నియోజకవర్గమైన భవానీపూర్‌లో దాదాపు 45,000 మంది ఓటర్ల పేర్లను ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రాతినిధ్యం వహిస్తున్న భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్ల జాబితా నుంచి పెద్ద సంఖ్యలో పేర్లు తొలగించబడటంపై టీఎంసీ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. తాజాగా నిర్వహించిన ప్రత్యేక సమీక్ష (SIR) ప్రక్రియలో డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా నుంచి దాదాపు 45 వేల మంది ఓటర్ల పేర్లు తొలగించడంతో ఆ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న పార్టీ నాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తొలగించిన ప్రతి ఓటర్ పేరును ఇంటింటికి వెళ్లి మళ్లీ పరిశీలించాలని పార్టీ బూత్ లెవల్ ఏజెంట్లకు (BLAలు) ఆదేశాలు ఇవ్వాలని నిర్ణయించింది. మంగళవారం భవానీపూర్ ప్రాంతంలో స్థానిక పార్టీ నాయకులతో టీఎంసీ సమావేశం నిర్వహించింది.

ఆగ్రాలో మాయమైన తాజ్ మహాల్.. షాకైన పర్యాటకులు

ఆగ్రాలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన ప్రేమ చిహ్నం తాజ్ మహల్ ఒక్కసారిగా మాయమైందన్న వార్త కలకలం రేపింది. తాజ్ మహల్‌ను చూడటానికి వచ్చిన పర్యాటకులు అక్కడికి చేరుకున్న వెంటనే అది కనిపించకపోవడంతో తీవ్ర ఆశ్చర్యానికి గురయ్యారు. కొంతసేపు అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొనగా, తాజ్ మహల్ నిజంగా మాయమవలేదని అధికారులు స్పష్టం చేశారు. దట్టమైన పొగమంచు వాతావరణ పరిస్థితుల కారణంగా తాజ్ మహల్ పూర్తిగా కనబడకపోయిందని తెలిపారు. కొద్దిసేపటి తర్వాత పొగమంచు తగ్గడంతో తాజ్ మహల్ మళ్లీ స్పష్టంగా దర్శనమిచ్చింది. ఉత్తర భారతాన్ని ప్రస్తుతం తీవ్రమైన చలి కమ్మేసింది. చలితో పాటు దట్టమైన పొగమంచు అనేక నగరాలను ఆవరిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఆగ్రా, చండీగఢ్, హర్యానా రాష్ట్రాలు పొగమంచు ముప్పును ఎదుర్కొంటున్నాయి. గత నాలుగు రోజులుగా ఆగ్రా నగరాన్ని దట్టమైన పొగమంచు దుప్పటి కప్పేసింది. ఉదయం 10 గంటల తర్వాత కూడా 10 మీటర్ల దూరంలో ఉన్నవారు కనిపించనంత తీవ్రంగా పొగమంచు పేరుకుపోయింది. ఈ కారణంగా ఉదయపు వేళ తాజ్ మహల్ పూర్తిగా కనబడకుండా పోయింది.

ఎన్నికలకు దూరంగా పాలమూరు జిల్లాలో గ్రామాలు

తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సందడి నెలకొన్నప్పటికీ, పాలమూరు (నాగర్‌కర్నూల్) జిల్లాలోని ఆరు గ్రామాల్లో మాత్రం ఎన్నికల హడావుడి కనిపించడం లేదు. ఈ గ్రామాలు తమ సమస్యల పరిష్కారం కోసం ఎన్నికలను బహిష్కరిస్తున్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లా, చారకొండ మండలం పరిధిలోని ఎర్రవల్లి, ఎర్రవల్లి తండా ప్రజలు డిండీ నార్లాపూర్ ఎత్తిపోతల పథకం కింద నిర్మించ తలపెట్టిన జలాశయం వల్ల తమ గ్రామాలు ముంపునకు గురవుతాయనే భయంతో ఎన్నికలను బహిష్కరించారు. ఈ నిర్మాణ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని లేదా ముంపునకు గురికాకుండా తమ గ్రామాలను మినహాయించాలని డిమాండ్ చేస్తూ, డిసెంబర్ 2వ తేదీ నుండి వారు అంబేద్కర్ విగ్రహం ఎదుట రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. మరోవైపు, నల్లమల అటవీ ప్రాంతంలో ఏజెన్సీ పంచాయతీలుగా గుర్తించిన అమరాబాద్ మండలం పరిధిలోని కుమ్మరోనిపల్లి, లక్ష్మాపూర్, కల్ములోనిపల్లి, వంగరోనిపల్లి, ప్రశాంత్ నగర్ గ్రామాలు కూడా ఎన్నికలకు దూరంగా ఉన్నాయి.

30కి పైగా దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించిన ట్రంప్!

ప్రభుత్వం ప్రయాణ నిషేధాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరింత కఠినతరం చేశారు. తాజాగా మరో ఐదు దేశాల పౌరులపై పూర్తిస్థాయి ప్రయాణ నిషేధాన్ని అమలు చేయడంతో.. పాలస్తీనా అథారిటీ జారీ చేసిన పత్రాలతో ప్రయాణించే వారికి పూర్తిగా ప్రవేశంపై బ్యాన్ విధించింది. అలాగే, మరో 15 దేశాల పౌరులపై పాక్షిక పరిమితులు విధించింది. ఇప్పటి వరకు మొత్తం 30కి పైగా దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించినట్లు మంగళవారం వైట్ హౌస్ అధికారికంగా ప్రకటించింది.

నేడే నాల్గవ టీ20.. టీమిండియా సిరీస్ గెలుస్తుందా..?

నేడు లక్నో వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య నిర్ణయాత్మకమైన నాల్గవ టీ20 మ్యాచ్ జరగనుంది. 5 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో టీమిండియా ఇప్పటికే 2-1 ఆధిక్యంలో ఉండగా.. ఈరోజు గెలిస్తే మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. మరోవైపు దక్షిణాఫ్రికాకు ఇది ‘డూ ఆర్ డై’ (గెలవాల్సిన) మ్యాచ్. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు గత మ్యాచ్‌లో ఘనవిజయం సాధించి మంచి ఊపులో ఉంది. అయితే జట్టులో కొందరు కీలక ఆటగాళ్ల ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా సూర్య, గిల్ ఫామ్ టీమిండియాను కలవర పెడుతోంది.

నేడు ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ తీర్పు

బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై కీలక నిర్ణయం వెలువడనుంది. ఈ అంశంపై స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ బుధవారం తొలి దశ తీర్పును ప్రకటించనున్నారు. మొదటగా ఐదుగురు ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై స్పష్టత ఇవ్వనున్నట్లు స్పీకర్‌ కార్యాలయం తెలిపింది. తొలిదశలో ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్‌, గూడెం మహిపాల్‌రెడ్డి, అరికెపూడి గాంధీపై దాఖలైన పిటిషన్లపై తీర్పు వెలువరించనున్నారు. ఈ పిటిషన్లపై నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు విధించిన గడువు గురువారంతో ముగియనుంది. దీంతో గడువు ముగిసేలోగా స్పీకర్‌ తీర్పు ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మైలార్‌దేవ్‌పల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్లిన కారు

మైలార్‌దేవ్‌పల్లి ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అతి వేగంతో దూసుకొచ్చిన ఇన్నోవా కారు ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిని బలిగొంది. శంషాబాద్ నుంచి సంతోష్ నగర్ వైపు వెళ్తున్న ఓ ఇన్నోవా కారు, మైలార్‌దేవ్‌పల్లి వద్ద నియంత్రణ కోల్పోయి బీభత్సం సృష్టించింది. ఓవర్ స్పీడ్ కారణంగా కారు అదుపుతప్పి నేరుగా ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లింది. రోడ్డు పక్కన దుప్పట్లు, రగ్గులు విక్రయించుకుంటూ అక్కడే నిద్రిస్తున్న ఓ దుకాణంలోకి కారు దూసుకొని పోయింది.

 

Exit mobile version