Site icon NTV Telugu

Top Headlines @9AM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

ఎలాన్ మస్క్ మరో సంచలన నిర్ణయం.. కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన

అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య దెబ్బతిన్న సంబంధం మరో వివాదాస్పద మలుపు తిరిగింది. బిలియనీర్, ట్రంప్ సన్నిహితుడు ఎలాన్ మస్క్ కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటును ప్రకటించారు. గతంలో, వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు ఆమోదం పొందితే, అమెరికాలో కొత్త పార్టీ ఏర్పడుతుందని మస్క్ ట్రంప్‌ను హెచ్చరించారు. అమెరికా 249వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్చనీయాంశమైన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ పై సంతకం చేశారు. దీంతో ఆ బిల్లు చట్ట రూపం దాల్చింది. ఈ పరిణామం అనంతరం పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ ‘అమెరికా పార్టీ’ అనే కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ పార్టీ అమెరికా ప్రజలను వన్ పార్టీ వ్యవస్థ నుంచి విముక్తి చేస్తుందని ఆయన తెలిపారు. మస్క్ ప్రకటన తర్వాత, అమెరికన్ రాజకీయాల్లో సంచలనం క్రియేట్ అయ్యింది.

బ్రెజిల్ చేరుకున్న ప్రధాని మోడీ.. 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి హాజరకానున్నారు

17వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్రెజిల్‌లోని రియో ​​డి జనీరో చేరుకున్నారు. గలేయో అంతర్జాతీయ విమానాశ్రయంలో మోడీకి ఘన స్వాగతం లభించింది. బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి బ్రెజిల్‌కు రెండు దశల పర్యటన ఇది. ఈ పర్యటనలో, రియోలో జరిగే బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్న తర్వాత ప్రధాని రాజధాని బ్రెసిలియాకు రాష్ట్ర పర్యటన చేస్తారు. రియో డి జనీరో చేరుకున్న తర్వాత, ప్రధాని తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా పోస్ట్ చేశారు, ‘నేను బ్రెజిల్‌లోని రియో ​​డి జనీరో చేరుకున్నాను. అక్కడ నేను బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటాను. అధ్యక్షుడు లూలా ఆహ్వానం మేరకు దాని రాజధాని బ్రెసిలియాకు రాష్ట్ర పర్యటనకు వెళ్తాను. ఈ పర్యటన సందర్భంగా ఫలవంతమైన సమావేశాలు, చర్చలు జరుగుతాయని ఆశిస్తున్నాము.’ అని వెల్లడించారు.

విజయం ముంగిట భారత్.. లాంఛనమే మిగిలిందా..?

బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న రెండవ టెస్టు మ్యాచ్‌ లో భారత్ విజయానికి చాలా దగ్గరలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌ లో అద్భుత ప్రదర్శన చేసిన టీమిండియా 587 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్ లో కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ (269), యశస్వి జైస్వాల్ (87), జడేజా (89), వాషింగ్టన్ సుందర్ (42) ఆకట్టుకున్నారు. గిల్ డబుల్ సెంచరీతో రికార్డులను బద్దలు కొట్టాడు. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో బషీర్ 3, టంగ్ 2, వోక్స్ 2 వికెట్లు తీశారు. ఇక ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 407 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో మొహమ్మద్ సిరాజ్ 6 వికెట్లు, ఆకాష్ దీప్ 4 వికెట్లు తీసి ఇంగ్లండ్ బ్యాటింగ్‌ను నేలకూల్చారు. ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ లో మొత్తం ఆరుగురు డకౌట్ అయినా హ్యారీ బ్రుక్ (158), జేమీ స్మిత్ (184 నాటౌట్) లతో మాత్రమే ఆ మాత్రం స్కోరును అందుకుంది. ఇక ఆ తర్వాత భారత్ రెండో ఇన్నింగ్స్‌ ను బీస్ట్ మోడ్ లో మొదలు పెట్టింది. అది ఎంతలా అంటే 83 ఓవర్లలో 427/6 వద్ద డిక్లేర్ ఇచ్చేంతలా.

రైల్వే ట్రాక్ పై ఆటో పరుగులు.. వేగంగా దూసుకొచ్చిన రైలు.. చివరకు

ఇటీవల శంకర్ పల్లిలో ఓ యువతి రైల్వే ట్రాక్ పై కారు నడిపి హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. అటుగా వెళ్తున్న స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందజేయడంతో రైల్వే పోలీసులు అక్కడికి చేరుకుని యువతిని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే బీహార్ లో చోటుచేసుకుంది. ఓ ఆటో డ్రైవర్ మద్యం మత్తులో ఆటోను రైల్వే ట్రాక్ పైకి తీసుకొచ్చి నడిపాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. బీహార్‌లోని సీతామర్హి-దర్భంగా రైల్వే సెక్షన్‌లోని మెహసౌల్ గుమ్టి సమీపంలో లోకో పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో శనివారం పెద్ద ప్రమాదం తప్పింది. ఓ ఆటో డ్రైవర్ మద్యం మత్తులో రైల్వే ట్రాక్‌పై తన ఆటోను నడిపాడు. ఆ సమయంలో ఎదురుగా రైలు దూసుకొస్తోంది. ఇది గమనించిన లోకో పైలట్ వెంటనే రైలును ఆపాడు. దీని కారణంగా పెద్ద ప్రమాదం తప్పింది. సమాచారం అందిన వెంటనే, GRP పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆటో డ్రైవర్‌ను అరెస్టు చేశారు.

ఐదేళ్ల పసిపాప దారుణ హత్య.. బాత్రూంలో రక్తపు మడుగులో శవమై కనిపించిన హితిక్ష

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో హృదయాన్ని కలిచివేసే సంఘటన చోటుచేసుకుంది. ఐదేళ్ల పసిపాప హితిక్షను గుర్తు తెలియని దుండగులు గొంతు కోసి హత్య చేశారు. ఆడుకుంటూ బయటకు వెళ్లిన చిన్నారి కొద్ది గంటల్లోనే అదే కాలనీలోని ఓ ఇంటి బాత్రూంలో రక్తపు మడుగులో పడి మృతదేహంగా కనిపించడంతో కలకలం రేగింది. ఆదర్శనగర్‌లో నివాసముండే ఆకుల రాములు, నవీన దంపతులకు వేదాస్‌, హితిక్ష అనే ఇద్దరు సంతానం ఉన్నారు. ఉపాధి కోసం రాములు గల్ఫ్ వెళ్లగా, నవీన అత్తామామల వద్ద ఉంటోంది. శనివారం సాయంత్రం కాలనీలోని ఇతర పిల్లలతో ఆడుకుంటున్న హితిక్ష ఆ తరువాత కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. ఆమె ఆచూకీ లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. తద్వారా పోలీసులు స్థానికులతో కలిసి గాలింపు చేపట్టగా, అదే కాలనీలోని కొడుపల్లి విజయ్‌ ఇంటి బాత్రూంలో చిన్నారి రక్తపు మడుగులో పడి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. బాలిక విజయ్ ఇంట్లోనే మృతదేహంగా కనిపించడంతో అతడిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

నాకు అంత అత్యాశ లేదు.. ఇంగ్లండ్ ప్లేయర్‌కు ‘పంత్’ పంచ్!

ఎడ్జ్‌బాస్టన్‌ టెస్టులో భారత్ దుమ్మురేపుతోంది. బ్యాటింగ్‌లో ఇరగదీసిన టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 427/6 వద్ద డిక్లేర్‌ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగుల ఆధిక్యం కలుపుకుని 608 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ ముందుంచింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 3 వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది. ఇక ఆట చివరి రోజు భారత బౌలర్లు ఎలా బౌలింగ్‌ చేస్తారన్నది మ్యాచ్‌లో కీలకంగా మారింది. ఐదవ రోజు ఏడు వికెట్స్ తీస్తే.. మ్యాచ్ భారత్ సొంతమవుతుంది. అయితే ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది.

రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. ఈ సమయంలో వికెట్స్ వెనకాల ఉన్న ఇంగ్లండ్ ప్లేయర్ హరీ బ్రూక్‌.. పంత్‌ను కవ్వించే ప్రయత్నం చేశాడు. టెస్ట్‌లలో అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డు 55 బంతులు అని, ఈరోజు నువ్ ఆ రికార్డ్ అందుకోవాలని పంత్‌తో అన్నాడు. దీనికి పంత్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. ‘రికార్డులపై నాకు అంత అత్యాశ లేదు. నా ఆట నేను ఆడుతా. రికార్డ్‌లు వాటంతట అవే వస్తాయి’ అని బ్రూక్‌కు బదులిచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో స్టంప్ మైక్‌లో రికార్డు అయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

గ్రౌండ్ ఏదైనా సరే వీరబాదుడే.. U19లో సంచలనం సృష్టించిన 14 ఏళ్ల డైనమైట్..!

ప్రస్తుతం ఇంగ్లాండ్ టూర్ లో ఉన్న భారత్ అండర్-19 జట్టు సంచలనాలను సృష్టిస్తోంది. తాజాగా ఇంగ్లండ్ అండర్-19 జట్టుతో జరిగిన నాలుగవ వన్డేలో భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. వర్సెస్టర్‌ లోని న్యూ రోడ్ మైదానంలో జరిగిన మ్యాచ్ లో అతను కేవలం 52 బంతుల్లో శతకం చేసి అండర్-19 వన్డే క్రికెట్‌లో వేగవంతమైన సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డ్ సాధించాడు. 14 ఏళ్ల వయసులోనే ఓపెనింగ్ బ్యాటర్‌గా ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ.. తనలోని అసాధారణమైన ఆత్మవిశ్వాసం, దూకుడు, టైమింగ్‌తో అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

వికారాబాద్‌లో బోటు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి, ఒకరి పరిస్థితి విషమం

వికారాబాద్ జిల్లాలోని సర్పన్‌పల్లి ప్రాజెక్ట్‌ వద్ద వీకెండ్ విహారయాత్ర విషాదంగా మారింది. బోటు ప్రమాదంలో ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోగా, మరొకరిని తీవ్రమైన గాయాలతో ఆస్పత్రిలో చేర్పించారు. బీహార్‌కు చెందిన ఓ కుటుంబం హైదరాబాద్‌లోని మియాపూర్‌లో నివాసముంటున్న బంధువులను కలుసుకునేందుకు వచ్చారు. వారితో పాటు మరో మూడు కుటుంబాలు కలిసి వికారాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలోని సర్పన్‌పల్లి ప్రాజెక్టు వద్ద ఉన్న వెల్డర్ నేస్ రిసార్ట్‌కి విహారయాత్రకు వెళ్లారు. సాయంత్రం సమయంలో రిసార్ట్ నిర్వాహకులు బోటింగ్‌కి తీసుకెళ్లగా, తిరుగు ప్రయాణంలో వర్షం ప్రారంభమైంది. అప్రమత్తం కాకుండా హడావుడిగా తిరిగే సమయంలో బోటు తొండం విరిగిపోవడంతో ఒక్కసారిగా నీటిలో మునిగింది. ఈ ప్రమాదంలో రీతికా, పూనమ్ అనే ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చింతాజనక విషయం ఏమిటంటే, ఈ రిసార్ట్‌కు బోటింగ్ నిర్వహించేందుకు అధికారిక అనుమతులు లేవన్న విషయం వెలుగు చూసింది. గతంలోనూ అనేక ఫిర్యాదులు ఉన్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 శుభ్‌మన్ గిల్ సెంచరీల మోత.. రికార్డులే రికార్డులు!

ఇంగ్లండ్‌ గడ్డ మీద టీమిండియా యువ కెప్టెన్‌ శుభ్‌మన్ గిల్‌ దుమ్మురేపుతున్నాడు. మొదటి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ (147) చేసిన గిల్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 8 రన్స్ చేశాడు. రెండో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో ద్విశతకం (269) చేసిన గిల్.. రెండో ఇన్నింగ్స్‌లో భారీ శతకం (161) బాదాడు. గిల్‌ భీకర ఫామ్‌లో ఉన్న వేళ.. రెండో టెస్టులో భారత్ గెలుపు ముంగిట నిలిచింది. వరుస సెంచరీలు బాదిన గిల్ పలు రికార్డులు ఖాతాలో వేసుకున్నాడు. అవేంటో ఓసారి చూద్దాం.

రెండో టెస్ట్ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్‌ 430 పరుగులు చేశాడు. దాంతో ఓ టెస్టులో అత్యధిక స్కోరు చేసిన బ్యాటర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. గ్రాహం గూచ్‌ (456) మొదటి స్థానంలో ఉన్నాడు. ఓ టెస్టు మ్యాచ్‌లో రెండు 150 ప్లస్ స్కోర్లు సాధించిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. ఈ ఘనత సాధించిన మొదటి బ్యాటర్‌ అలెన్ బోర్డర్‌. బోర్డర్‌ 1980లో పాకిస్థాన్‌పై 150, 153 రన్స్ చేశాడు. ఓ టెస్టు మ్యాచ్‌లో సెంచరీ, డబుల్‌ సాధించిన తొమ్మిదో బ్యాటర్‌గా కూడా నిలిచాడు. ఈ జాబితాలో భారత్‌ నుంచి సునీల్ గవాస్కర్ ఉన్నారు.

Exit mobile version