Site icon NTV Telugu

Top Headlines @5PM : టాప్‌న్యూస్‌

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

కిషన్‌రెడ్డి అమావాస్య పౌర్ణమికి హైదరాబాద్‌ వస్తున్నాడు : మంత్రి తలసాని

కిషన్ రెడ్డి అమావాస్య పౌర్ణమి కి హైదరాబాద్‌ వస్తున్నాడంటూ విమర్శలు చేశారు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నేను ఉన్నా అని అనవసర మాటలు మాట్లాడుతున్నారని, కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి.. కేంద్రము నుండి ఏం తేచ్చావో చెప్పు అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రానికి అవసరం లేదు…సికింద్రాబాద్ పార్లమెంట్ కైనా ఏం తెచ్చావో చెప్పు అని ఆయన సవాల్‌ విసిరారు. కనిపించినప్పుడల్లా కిషన్‌రెడ్డి రాజకీయాలే మాట్లాడతారా..? అని ఆయన ఫైర్‌ అయ్యారు. ఫామ్‌హౌస్‌ ఫైల్స్‌ ఫెయిల్‌ అంటున్నారని, దర్యాప్తు సంస్థలపై మీకున్న చిన్నచూపు అర్థమవుతోందని ఆయన మండిపడ్డారు. కిషన్‌రెడ్డి విమర్శల్లో కాదు. అభివృద్ధిపై పోటీ పడాలని మంత్రి తలసాని హితవు పలికారు. హైకోర్టు కేసు లేదు అన్నదా అని ఆయన అన్నారు. బాధితులు సీఎం కేసీఆర్ కి చెప్పారని, నాది అంబర్‌పేట అంటావు కదా.. అంబర్ పేట కి ఏం చేశావో చెప్పు అని ఆయన అన్నారు. ఎమ్మెల్యే కొనుగోలు కేసులో బీజేపీ ఓ వైపు సబంధం లేదు అంటారు.. ఇంకో వైపు కోర్టుకు వెళ్లారు.. ఇంకో వైపు సంబరాలు చేసుకుంటారు అంటూ ఆయన విమర్శించారు. కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందా.. సంబరాలు చేసుకోవడానికి అని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్‌పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము మాట్లాడలేమా.. పరిధి దాటి మాట్లాడొద్దని ఆయన అన్నారు. బీజేపీ శక్తి ఏందో మాకు తెలియదా..? ఎట్లా వస్తది అధికారంలోకి బీజేపీ.. ఒక వ్యవస్థ నుండి.. ఇంకో వ్యవస్థకు కేసు బదిలీ చేస్తే ఫెయిల్ అయిపోతుందా..? కేంద్ర మంత్రులు ఇలా మాట్లాడటంతోనే వ్యవస్థలపై అనుమానం వస్తాయి. దొరికిన వాళ్ళ ఆడియో..వీడియో అబద్దమా..? ఎవరు ఎవరి మీద బురద జల్లినా ప్రజా కోర్టు నిర్ణయిస్తుంది. ఎప్పుడు కాలం ఒకలా ఉండదు అని మంత్రి తలసాని అన్నారు.

గన్‎లో బుల్లెట్ ఎక్కడ పెట్టాలో తెలియదు.. ఇతనో ఎస్ఐ

రైఫిల్ లోడ్ చేయడంలో యూపీ పోలీసు విఫలమయ్యాడు. సబ్-ఇన్‌స్పెక్టర్ రైఫిల్ లోడ్ చేయలేకపోయిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది ఉత్తరప్రదేశ్ పోలీసులను తీవ్ర ఇబ్బందికి గురిచేసింది. యూపీ సంత్ కబీర్ నగర్‌లోని పలు పోలీస్ట్ స్టేషన్‌లను ఐజీ ఆర్కే భరద్వాజ్ ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఖలీలాబాద్ పోలీస్ స్టేషన్ సందర్శించారు. అక్కడ పోలీసుల పనితీరును గమనించే క్రమంలో వారికి గన్ ఫైరింగ్ పరీక్ష పెట్టారు. ఈ సమయంలో ఓ ఎస్సై ఐజీ ముందు అడ్డంగా బుక్కయ్యాడు. బుల్లెట్ లోడు చేసి పైకి గన్ కాల్చమని ఐజీ చెప్పగా అతడు అయోమయంలో పడ్డాడు. బుల్లెట్ ఎలా లోడు చేయాలో కూడా కనీసం తెలియక ఇబ్బంది పడ్డాడు. చివరికి రైఫిల్ గొట్టం ద్వారా బుల్లెట్ లోపలికి తోసేశాడు. ఇది చూసిన ఐజీ ఆ ఎస్ఐపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సబ్ ఇన్‌స్పెక్టర్ తో పాటు మరికొందరు పోలీసు అధికారులు తనిఖీల్లో కాల్పులు జరపలేకపోయారు. ఔట్ పోస్ట్ ఇన్ ఛార్జి కూడా పదేపదే ప్రయత్నించిన తర్వాత కూడా టియర్ గన్‌ని ఆపరేట్ చేయడంలో ఇబ్బంది పడ్డారు. దీనిపై ఐజి భరద్వాజ్ స్పందిస్తూ, అత్యవసర పరిస్థితుల్లో సాధన, శిక్షణ ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఎలాంటి అనూహ్యమైన మోహరింపులకు సిద్ధంగా ఉండేందుకు శిక్షణను కొనసాగించాలని ఆయన పోలీసు సిబ్బందిని ఆదేశించారు.

పవన్ బుద్ధి, జ్ఞానం లేని రాజకీయాలు చేస్తున్నాడు : అంబటి

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌పై మంత్రి అంబటి రాంబాబు మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్ బుద్ధి, జ్ఞానం లేని రాజకీయాలు చేస్తున్నాడని.. చంద్రబాబుకి ఊడిగం చేస్తున్నాడంటూ ధ్వజమెత్తారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్‌ కళ్యాణ్, చంద్రబాబు కలిసి కాపులని మోసం చేస్తున్నారని ఆరోపించారు. పవన్‌కి బుద్ధి, జ్ఞానం లేదని.. అసలు అతనికి రాజకీయాలేంటో తెలుసా? అని ప్రశ్నించారు. తాను ఒక్క పైసా కూడా ఆశించనని, ఒక్క చోట కూడా గెలవని పవన్ తనపైనే ఆరోపణలు చేస్తాడా? అంటూ ఫైర్ అయ్యారు. వైసీపీకి అధికారం రానివ్వను, ఓట్లు చీలనివ్వనని చెప్తున్న పవన్ అంత పెద్ద మగాడా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మా పవన్.. మా పవన్’ అంటూ కాపులంతా పవన్‌ని గోక్కుంటున్నారని.. ఆ కాపులంతా పవన్‌తో కలిసి చంద్రబాబుకి ఊడిగం చేయండంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను విమర్శినంత ఘాటుగా ఎవరూ విమర్శించరని, అందుకే పవన్ తనని టార్గెట్ చేశాడని అంబటి రాంబాబు వెల్లడించారు.

కాగా.. తన కొడుకు చనిపోయాక ప్రభుత్వం తనకు రూ. 5 లక్షల సాయం చేసిందని, అయితే అందులో మంత్రి అంబటి రాంబాబు వాటా అడిగారని ఇటీవల ఓ మహిళ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే! అప్పుడు ఓ బహిరంగ సభలో భాగంగా అంబటిని ఉద్దేశించి పవన్ పరోక్షంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆ సమయంలోనే అంబటి ఆ వ్యాఖ్యలపై స్పందించారు. ఆ మహిళ చేసిన వ్యాఖ్యల్లో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. వైసీపీ అధికారంలో వచ్చిన తర్వాత.. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో 12 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని గుర్తించి, వారి కుటుంబాలకు రూ.7 లక్షల చొప్పున పరిహారం ఇచ్చామన్నారు. ప్యాకేజీ తీసుకునే సన్నాసి రాజకీయాలు తాను చేయనని, రూ. 2 లక్షల తీసుకునే దౌర్భగ్యం ఉంటే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కూడా చెప్పారు.

గడ్డకట్టిన నయాగారా.. ఔరా అనిపిస్తున్న అద్భుత దృశ్యం

అమెరికాలో మంచు తుపాను(Bomb cyclone) బీభత్సం కొనసాగుతూనే ఉంది. ఈ శతాబ్దంలోనే ఎన్నడూ లేనంతగా కురుస్తున్న మంచుకు దేశమంతా అతలాకుతలం అవుతోంది. ఇప్పటికే మంచుగాలుల దాటికి నాలుగు వేలకు పైగా దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 60 మందికిపైగా మరణించినట్లు తెలుస్తోంది. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రజలంతా నానావస్థలు పడుతున్నారు. న్యూయార్క్‌, బఫెలో కౌంటీలో నెలకొన్న దుర్భర పరిస్థితులు ప్రస్తుతం సోషల్ మీడిలో చక్కర్లు కొడుతున్నాయి.

అమెరికాలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మైనస్లో నమోదవుతున్నాయి. వీటి కారణంగా ప్రపంచంలోనే అతిపెద్దదైన నాయాగారా జలపాతం గడ్డకట్టుకుపోయింది. ఎన్నడూ జరుగని వింతను చూసేందుకు పర్యాటకులు తండోపతండాలుగా విచ్చేస్తున్నారు. ఈ అద్భుత దృశ్యాన్ని చూసి ముగ్ధులైపోతున్నారు. నయాగరాకు 25 మైళ్ల దూరంలో బఫెలో ఉంటుంది. అయితే, నయాగరాలో కొన్ని ప్రదేశాల్లో నీరు గడ్డకట్టినా.. ప్రవాహం కారణంగా కొన్ని చోట్ల మాత్రం జలపాతం పరవళ్లు తొక్కుతోంది. గట్టకట్టుకుపోయిన నయాగరా జలపాతం ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

‘బాహుబలి-2’ రిలీజ్ డేట్ న ‘పొన్నియిన్ సెల్వన్ 2’!

మణిరత్నం దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ‘పొన్నియిన్ సెల్వన్’ మొదటి భాగం ఈ ఏడాది సెప్టెంబర్ 30న విడుదలైన సంగతి తెలిసిందే. విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్యారాయ్, త్రిష వంటి భారీ తారాగణం నటించిన ఈ సినిమా తమిళనాట విజయం సాధించినా తెలుగులో మాత్రం ఆదరణ దక్కించుకోలేక పోయింది. ఇప్పుడు ఈ సినిమా రెండో భాగాన్ని ఏప్రిల్ 28, 2023న విడుదల చేయబోతున్నారు. ఎ.ఆర్. రెహ్మాన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాకు కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియిన్ సెల్వన్’ నవల ఆధారం. ఐశ్వర్యలక్ష్మి, శోభిత ధూళిపాళ్ల, ప్రభు, ప్రకాశ్ రాజ్, విక్రమ్ ప్రభు, శరత్ కుమార్, పార్తిబన్, జయరామ్ ఇందులోని ఇతర ముఖ్య పాత్రధారులు.

అత్యధిక వసూళ్ళు సాధించిన తమిళ చిత్రంగా తమిళనాట గుర్తింపు తెచ్చుకున్న ఈ సినిమా రెండో భాగం ఎలాంటి విజయం సాధిస్తుందో అని అందరూ ఎదురు చూస్తున్నారు. మరో విశేషమేమంటే రాజమౌళి మేగ్నమ్ ఓపస్ ‘బాహుబలి-2’ విడుదలైన ఏప్రిల్ 28వ తేదీనే ‘పొన్నియిన్ సెల్వన్-2’ ను రిలీజ్ చేయబోవడం! ‘పొన్నియిన్ సెల్వన్’ ప్రెస్ మీట్ లో మణిరత్నం స్వయంగా తాను ఈ సినిమా తీయడానికి రాజమౌళి ‘బాహుబలి’ సిరీస్ తో చూపిన బాటనే ప్రేరణ అన్నారు. అదే తీరున ‘పొన్నియిన్ సెల్వన్’ రెండో భాగాన్ని, ‘బాహుబలి-2’ రిలీజ్ డేట్ నే ఎంచుకోవడంతో మణి, రాజమౌళిని ఎంత స్ఫూర్తిగా తీసుకున్నారో అర్థమవుతోంది.

బాహుబలిలా బాలయ్యతో ప్రభాస్ ‘అన్‌స్టాపబుల్’ రెండు భాగాలు..?

ఒకరేమో తెలుగునాట ‘గాడ్ ఆఫ్ మాసెస్’ గా సాగుతున్న నటసింహ నందమూరి బాలకృష్ణ. మరొకరేమో ‘ఇంటర్నేషనల్ స్టార్’గా జేజేలు అందుకుంటున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. వీరిద్దరూ ఒకే వేదికపై కొన్ని గంటలపాటు సందడి చేస్తారంటే ఆసక్తి కలగని వారుంటారా!? ‘ఆహా’లో బాలకృష్ణ నిర్వహిస్తోన్న టాక్ షో ‘అన్ స్టాపబుల్’ సీజన్ 2లో ‘బాహుబలి’ స్టార్ ప్రభాస్ పాల్గొంటున్నారని తెలిసిన దగ్గర నుంచీ ఆ ఎపిసోడ్ పై సినీ ఫ్యాన్స్ లో ఓ స్పెషల్ క్రేజ్ నెలకొంది. బాలయ్య హోస్ట్ గా, ప్రభాస్ గెస్ట్ గా సాగిన ‘అన్ స్టాపబుల్’ ఎపిసోడ్ ఈ నెల 30న ప్రసారం కానుంది. ఇప్పటికే ప్రభాస్ ఎపిసోడ్ కు సంబంధించిన గ్లింప్స్ రెండు సార్లు, టీజర్ మరోమారు జనాన్ని కట్టిపడేశాయి. ఈ సమయంలోనే అభిమానులకు మరో తీయటి కబురు అందింది. అదేంటంటే – ఈ ఎపిసోడ్ రెండు భాగాలుగా ప్రసారం కానుందట! ఇప్పటి దాకా ‘అన్ స్టాపబుల్’ షోలో ఏ గెస్ట్ కూ దక్కని విధంగా ప్రభాస్ కు ఈ గౌరవం దక్కిందని చెప్పవచ్చు.

ప్రభాస్ తో రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ సైతం ఆరంభంలో ఒక చిత్రంగానే మొదలయింది. అందులోని కథ, కథనం నిడివి పెరగడంతో తరువాత రెండు భాగాలుగా తెరకెక్కించారు. ఇప్పుడు బాలయ్య టాక్ షోలో ప్రభాస్ పాల్గొన్న ఎపిసోడ్ లోనూ ఏది ట్రిమ్ చేయనంత ఆసక్తికరంగా ఉంటుందట! అందువల్ల ఏ మాత్రం ఎడిట్ చేయకుండా ప్రభాస్ ఎపిసోడ్ ను రెండు భాగాలుగా ప్రసారం చేయనున్నారు. “కంటెంట్ ఎంత బాగుందంటే ఎడిట్ చేయడానికి ఎవరూ ఒప్పుకోలేదు” అని ఆహా బృందం అంటోంది. “మాహిష్మతి ఊపిరి పీల్చుకో… హీ ఈజ్ ఆన్ ద వే…” అంటూ సందడి మొదలు పెట్టారు. మరి డిసెంబర్ 30న ప్రసారం కానున్న ప్రభాస్ తొలి ఎపిసోడ్ లో ఎన్ని ముచ్చట్లు ఉంటాయో? ఆ తరువాత రాబోయే ఎపిసోడ్ లో మరెన్ని ఆసక్తికరమైన అంశాలు చోటు చేసుకుంటాయో? చూడాలని ఫ్యాన్స్ లో మరింత ఆసక్తి నెలకొంది. ‘బాహుబలి’ మొదటి భాగం ముగింపులో ‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?’ అనే ఆసక్తికరమైన ప్రశ్నను జనంలోకి వదిలారు. ఆ ప్రశ్నతోనే రెండో భాగానికి మరింత క్రేజ్ పెరిగింది. అదే తీరున 30న ప్రసారమయ్యే ఎపిసోడ్ 1లోని ఎండింగ్ లో ఏ ఆసక్తికరమైన అంశం చోటు చేసుకుంటుందో చూడాలని బాలయ్య, ప్రభాస్ ఇరువురి ఫ్యాన్స్ తో పాటు ఈ షోను ఎంతగానో ఇష్టపడుతున్నవారు కూడా ఎదురు చూస్తున్నారు.

షేర్ ట్యాక్సీలో మహిళపై సామూహిక అత్యాచారం

భారత్ లో రోజురోజుకు మహిళపై దాడులు ఎక్కువవుతున్నాయి. దేశంలో ప్రతి గంటకు ఏదో ఒక చోట మహిళలు అత్యాచారాలకు గురవుతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా వీటి నియంత్రణ కష్టతరమవుతోంది. ఇలాంటి దాడులకు పాల్పడిన నిందితులకు శిక్షలు వేసినా.. వాటిని చూసైనా కీచకులు మారడంలేదు. ఈ రోజూ మరో విస్తుపోయే ఘటన ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో జరిగింది. షేర్ టాక్సీలో వెళ్తున్న యువతిపై అదే టాక్సీలో ఎక్కిన మరో ముగ్గురు యువకులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను ఎత్మాద్‌పూర్‌ ఏరియాలో వదిలి పారిపోయారు. బాధితురాలు ఎలాగోలా కోలుకుని ఎత్మాద్‌పూర్‌ పోలీసులను ఆశ్రయించింది.

తనపై జరిగిన దాడిపై ఫిర్యాదు చేసింది. తాను షేర్డ్‌ టాక్సీ బుక్‌ చేసుకుని వెళ్తుండగా మార్గమధ్యలో మరో ముగ్గురు యువకులు ఎక్కారని పోలీసులకు తెలిపింది. కొంత దూరం వెళ్లాక, ఆ ముగ్గురూ కలిసి తనపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితులను కనిపెట్టేందుకు దర్యాప్తు మొదలుపెట్టారు. సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా కారును గుర్తించారు పోలీసులు. మహిళలపై దాడికి పాల్పడిన ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని ఆస్పత్రిలో చేర్పించి వైద్య పరీక్షలు చేయించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగానే ఉన్నట్లు సమాచారం.

 

 

Exit mobile version