NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్ న్యూస్

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

బోనస్ ఇచ్చి కొనడానికి మీకు బాధ ఏంటి.. కిషన్ రెడ్డి ఫైర్

బోనస్ ఇచ్చి కొనడానికి మీకు బాధ ఏంటి.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణ రైతులను మరో సారి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. వంద రోజుల్లో రుణమాఫీ చేస్తామని చెప్పి రైతుల్ని దగా చేసిందన్నారు. కౌలు రైతులకు 15 వేలు ఇస్తామని చెప్పారు… వరికి క్వింటాల్ కు 500 బోనస్ ఇస్తామని చెప్పి యే ఒకటి కూడా అమలు చేసేలా లేదన్నారు. రైతులను నయవంచన చేసి అధికారం లోకి కాంగ్రెస్ వచ్చిందన్నారు. దేవుడి పేరుతో ఓట్లు పెడుతూ ప్రజలకి మాత్రం పంగనామాలు పెడుతుంది ఈ ప్రభుత్వం అని మండిపడ్డారు. సన్న వడ్లకు మాత్రమే బోనస్ అని సన్నాయి నొక్కులు నొక్కుతుందన్నారు. చెయ్యి గుర్తుకు ఓటు వేసినందుకు రైతులకు చేయి ఇస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దొడ్డు బియ్యం కొనడం కోసం కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. బోనస్ ఇచ్చి కొనడంలో మీకు వచ్చిన బాధ ఏంటి? అని ప్రశ్నించారు.

ఈనెల 29, 30 తేదీల్లో ధర్నా చేస్తాం.. మేడారం పూజార్ల హెచ్చరిక..

వరంగల్‌లో మేడారం పూజారులు ఆందోళనకు సిద్ధమవడం హాట్ టాపిక్‌గా మారింది. వరంగల్‌లో ధార్మిక భవనం స్థలం విషయంలో మేడారం పూజారులు, దేవాదాయ వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మేడారం పూజారులు నిరసనలకు పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. మేడారం జాతర భవిష్యత్తు అవసరాల కోసం 1993లో అప్పటి ప్రభుత్వం వరంగల్‌లోని రంగంపేటలో 1000 గజాల స్థలాన్ని కేటాయించింది. అయితే.. ఈ స్థలంలో ఏడాది క్రితం భద్రకాళి, మెట్టుగుట్ట, మేడారం జాతర నిధులతో ధార్మిక భవనాన్ని నిర్మించారు. అనంతరం వివిధ ఆలయాల కార్యనిర్వహణాధికారుల కార్యాలయాల వారు ఏర్పాట్లు చేశారు.

ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్టుకు రంగం సిద్ధం.. లుకౌట్‌ నోటీసులు జారీ

మాచర్ల ఈవీఎం ధ్వంసం ఘటనపై సీరియస్ అయిన సీఈసీ.. ఎమ్మెల్యే పిన్నెల్లిని అరెస్ట్‌ చేయాలని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఆయనను అరెస్ట్‌ చేసేందుకు ప్రత్యేక బృందాలు హైదరాబాద్‌కు వెళ్లాయి. పల్నాడు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఈ బృందాలను ఏర్పాటు చేశారు. ఏపీ పోలీసులు, తెలంగాణ స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఈ గాలింపు చర్యల్లో పాల్గొంటున్నారు. సంగారెడ్డి జిల్లా కంది వద్ద పిన్నెల్లి కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అందులోని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం మూడు చట్టాల పరిధిలో పది సెక్షన్లతో పిన్నెల్లి మీద కేసులు నమోదు చేశారు. ఐపీసీ, ఆర్పీ, పీడీపీపీ చట్టాల పరిధిలో సెక్షన్ల నమోదు చేశారు పోలీసులు. ఐపీసీ కింద 143, 147, 448 427, 353, 452, 120b సెక్షన్లతో కేసు నమోద చేయగా.. పీడీపీపీ చట్టం కింద మరో కేసు నమోదైంది. ఆర్పీ యాక్ట్ కింద 131, 135 సెక్షన్లను నమోదు చేశారు. ఈ నెల 20వ తేదీనే పిన్నెల్లిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

రెండ్రోజుల్లో అందరి సంగతి తేలుస్తా.. రేవ్ పార్టీపై హేమ కీలక వ్యాఖ్యలు

గత రెండు మూడు రోజులుగా చర్చనీయాంశం అవుతున్న బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారం మీద తాజాగా హేమ స్పందించింది. నిజానికి బెంగళూరు రేవ్ పార్టీలో ఆమె పాల్గొన్నట్లు వార్తలు వచ్చిన కొద్దిసేపటికే ఆమె తాను హైదరాబాద్ ఫామ్ హౌస్ లో ఉన్నానని ఒక వీడియో రిలీజ్ చేసింది. అది చూసిన బెంగళూరు పోలీసులు ఆమె తప్పుతోవ పట్టిస్తోంది అంటూ ఆమె బెంగళూరులోనే ఉన్నట్లు కొన్ని ఫోటోలు, వీడియోలు రిలీజ్ చేశారు. దీంతో హేమ అడ్డంగా బుక్ అయిందంటూ మీడియాలో, సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. అయితే ఇంత జరుగుతున్న సమయంలో హేమ తన సోషల్ మీడియాలో బిర్యాని వండుతున్న వీడియో షేర్ చేయడం మరింత చర్చనీయాంశమైంది.

ఏ1 నిందితుడిగా పిన్నెల్లి.. పది సెక్షన్ల కింద కేసులు

పోలింగ్‌ రోజు మాచర్లలో 7 ఘటనలు జరిగాయని.. ఈవీఎంలు ధ్వంసం చేశారని ఏపీ సీఈవో ఎంకే మీనా వెల్లడించారు. ఘటనలన్నీ వెబ్‌కాస్టింగ్‌ ద్వారా పరిశీలించామన్నారు. ఈవీఎం ధ్వంసం చేసినా డేటా భద్రంగా ఉందన్నారు. డేటా భద్రంగా ఉండటం వల్ల కొత్త ఈవీఎంలతో పోలింగ్‌ కొనసాగించామన్నారు. డేటా భద్రంగా ఉండటం వల్లే రీపోలింగ్‌ నిర్వహించలేదని.. ధ్వంసం ఘటనలపై తర్వాత విచారణ ప్రారంభించామని చెప్పారు. సిట్‌కు పోలీసులు అన్ని వివరాలు అందించారని సీఈవో పేర్కొన్నారు. ఈనెల 20న కోర్టులో రెంటచింతల ఎస్‌ఐ మెమో దాఖలు చేశారని.. ఏ-1 నిందితుడిగా పిన్నెల్లిని ఎస్సై పేర్కొన్నారన్నారు. పది సెక్షన్ల కింద పిన్నెల్లిపై కేసులు పెట్టారని.. ఏడేళ్ల వరకూ శిక్షలు పడే అవకాశం ఉందన్నారు.

అంగట్లో ఆడబిడ్డ.. ఖరీదు 4,50 లక్షలు… ఆర్ఎంపీతో సహా ముఠా అరెస్ట్…

3 నెలల పసికందును అమ్ముతున్న ముఠా ని పోలీసులు అరెస్ట్ చేసిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సభ్యసమాజం తల దించుకునేలా చేసారు కొందరు మహిళలు. వీరు ఆడబిడ్డలే అన్నది మరిచారో ఏమో, అంగట్లో ఆడబిడ్డను అమ్మకానికి బేరం పెట్టారు. ఓ స్వచ్చంద సంస్థ ద్వారా వీరి గుట్టు రాట్టయ్యింది. అక్షర జ్యోతి ఫౌండేషన్ కి చెందిన మహిళలు తమకు ఆడిపిల్ల కావాలని స్ట్రింగ్ ఆపరేషన్ చేయగా మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిరామకృష్ణ నగర్ లో శోభా రాణి ఫస్ట్ ఎయిడ్ సెంటర్ లో ఆర్ ఎం పీ వైద్యురాలు శోభా రాణి ఈ పని చేస్తుందని  ఆమెని సంప్రదించగా, అమ్మాయి ని 4.50( నాలుగున్నర) లక్షలకు ఇప్పిస్తానని ఫోన్ ద్వారా చెప్పింది.

దీంతో.. ముందుగా 10 వేలు అడ్వాన్స్ గా చెల్లించి, బుధవారం నాడు పాపకోసం వారు క్లినిక్ కు రాగ వేరే మహిళా అక్కడకు ఓ పాపతో వచ్చి వీరికి అప్పగించారు. దీంతో సంస్థ మహిళలు పోలీసులకు, మీడియా కు ఇన్ఫర్మేషన్ ఇవ్వగా, పోలీసులు చేరుకొని వీరందరిని పోలీస్ స్టేషనకు విచారణ కోసం తరలించారు. పేద కుటుంబం పిల్లలను పోషించడం భారమణి తల్లి చెప్పడంతో మానవత్వంతో అమ్మాయిని పిల్లలు లేనివారికి అమ్మానని శోభరాణి చెప్పడం కోసమెరుపు. శోభారాణి ఇంకా కొన్ని హాస్పిటల్ పేర్లు, చిలకనగర్ లో మరో మహిళా ఆర్ ఏం పీ, మ్యారేజ్ బ్యూరో మహిళా పేర్లను వారి వివరాలను కూడా తెలియజేసినట్టు సమాచారం. వీరందరు కలిసి ఈ పని చేసినట్టు తెలియజేసింది.

బీఆర్‌ఎస్‌ కంటే.. కాంగ్రెస్ పాలనలో వ్యవసాయం, ధాన్యం సేకరణ వెయ్యి పాళ్లు నయం

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతో పోలిస్తే కాంగ్రెస్ పాలనలో వ్యవసాయం, ధాన్యం సేకరణ వేయి పాల్లు నయమని, ఇది తెలంగాణ రైతుల అభిప్రాయం అని గౌరవ వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలియజేసారు. గతంతో పోలిస్తే ముందస్తుగానే కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేసాం. ఐకేపీ సెంటర్ల పెంపు గత ఏడాదితో పోలిస్తే నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అదనంగా కొనుగోలు చేసామని, ధాన్యం కొనుగోళ్ల పర్యవేక్షణకు జిల్లాకొక ఐఏఎస్ ను నియమించి ఎప్పటికప్పుడు సమీక్ష చేయిస్తున్నామన్నారు. తరుగు, తాలు పేరుతో కోతలు లేవు.. గతంలో ప్రతి క్వింటాకు 7 నుంచి 10 కేజీల వరకు తరుగు పేరుతో మిల్లర్ల దోపిడీ.. ఈ దఫా మిల్లర్ల దోపిడీ పై ప్రభుత్వం ఉక్కు పాదం మోపడంతో కోతలకు మిల్లర్ల స్వస్తి..దీంతో ప్రతి కింటా పై రైతుకు 150 నుంచి 200 రూపాయల వరకు అదనపు లబ్ధి చేకూర్చామన్నారు. రైతులు పంట అమ్ముకున్న ఐదు రోజుల్లోనే రైతుల ఖాతాల్లోకి నగదు.. గతంలో 45 రోజులు పెట్టేది. రైతు ఎంతో వడ్డీ నష్ట పోయేవాడు. కానీ ఇప్పుడు కేవలం 5 రోజుల్లోనే రైతు ఖాతాల్లో నగదు జమ అవుతుంది దీంతో రైతుకు వడ్డీ వ్యాపారుల వేధింపులు లేవు. వడ్డీలు కట్టాల్సిన అవసరం లేదు. ఆత్మగౌరవంతో ఇప్పుడు రైతు బతుకుతున్నాడని, కేసీఆర్ ప్రభుత్వంలో ఫసల్ బీమా యోజన లేదు. ఉంటే కనీసం పంట నష్టపరిహారం వచ్చేది. అయినప్పటికీ కాంగ్రెస్, రైతు ప్రభుత్వం కాబట్టి పంట నష్టపోయిన రైతాంగానికి పంట నష్టపరిహారాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ అందిస్తోంది. అంతే గాక, ఇక ముందు ఏ ఒక్క రైతు కూడా ఇలా నష్టపోకుండా, ప్రభుత్వమే రైతుల ప్రీమియం చెల్లించి పంట భీమా పథకాన్ని ౩,౦౦౦ కోట్ల రూపాయలు వెచ్చించి వానాకాలం నుండి అమలు చేస్తున్నామన్నారు.

జూన్ 2 తెలంగాణకు సోనియా రాక.. రాష్ట్ర గీతం ఆవిష్కరణ!

కాంగ్రెస్ అగ్ర నేత సోనియాగాంధీ జూన్ 2న తెలంగాణకు రానున్నారు. యూపీఏ హయాంలో తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అనంతరం జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పరాజయం పాలైంది. దాదాపు 10 ఏళ్లు తెలంగాణలో కాంగ్రెస్‌కు అధికారం లేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో జరిగిన కేబినెట్ సమావేశంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.