హిమాచల్‌ను ముంచెత్తిన వరదలు.. 150 కి.మీ దూరంలో మృతదేహాలు లభ్యం
హిమాచల్‌ప్రదేశ్‌ను ఆకస్మిక వరదలు హడలెత్తించాయి. దీంతో మండి జిల్లాలో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. ఇప్పటి వరకు 91 మంది చనిపోయారు. ఇక కొండచరియలు విరిగిపడడంతో గ్రామాలకు గ్రామాలే దెబ్బతిన్నాయి. ఆకస్మాత్తుగా వరదలు సంభవించడంతో చాలా మంది ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఇక పంగ్లుయెడ్ గ్రామంలో రెండు కుటుంబాలకు చెందిన తొమ్మిది మంది గల్లంతయ్యారు. వారికి సంబంధించిన నలుగురి మృతదేహాలు దాదాపు 150 కి.మీ. దూరంలో లభ్యమయ్యాయి. మరో ఐదుగురి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. మృతదేహాలు చాలాదూరం కొట్టుకుపోతుండడంతో గుర్తించడం కష్టంగా మారింది. డీఎన్ఏ పరీక్షల ద్వారా మృతదేహాలను గుర్తిస్తామని అధికారులు పేర్కొన్నారు.
జనాభా భారం కాదు.. జనమే ఆస్తి.. అదే అతి పెద్ద పెట్టుబడి..
జనాభా భారం కాదు.. జనమే ఆస్తి.. అదే అతి పెద్ద పెట్టుబడిగా అభివర్ణించారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ సచివాలయం దగ్గర నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మొదటి సారి ఆంధ్రప్రదేశ్ లో జనాభా దినోత్సవం ఫోకస్ తో జరుగుతోంది.. దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్.. అని గురజాడ అప్పారావు చెప్పారు. దేశమంటే మనుషులు.. కష్టాలు.. సమస్యలు.. పరిష్కారం అన్నీ ఉంటాయి.. గురజాడ స్ఫూర్తితో ముందుకు వెళ్లాలి.. ఇద్దరు పిల్లలు ఉంటే స్థానిక ఎన్నికల్లో పోటీకి అనర్హులు అని నేనే చట్టం తీసుకొచ్చా.. కానీ, ఒక్కోసారి పాలసీలు మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.. ఇప్పుడు జనాభా భారం కాదు.. జనమే ఆస్తి అన్నారు చంద్రబాబు.
రాజాసింగ్ రాజీనామాను ఆమోదించిన బీజేపీ..!
తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీకి రాజీనామాను తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదించారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి సంబంధించిన విషయంలో నొచ్చుకున్న ఆయన పార్టీకి రాజీనామా చేశారు. ఆ సమయంలో రాజాసింగ్ తన రాజీనామా లేఖను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి అందజేశారు. లేఖను స్పీకర్ కు పంపించాలని కూడా సూచించారు. తెలంగాణ బీజేపీలో చాలా లోపాలు ఉన్నాయని.. కొంతమంది పార్టీలో ఎదగకుండా చేస్తున్నారని ఆయన ఆ సమయంలో వ్యాఖ్యానించారు. అలాగే కొందరు పార్టీ ప్రగతికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తనకు మద్దతు ప్రకటించిన ముగ్గురు కౌన్సిల్ మెంబర్స్‌ను బెదిరించారని ఆయన అప్పట్లో ఆరోపించారు. తనను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేట్ చేయనివ్వలేదని.. ప్రెసిడెంట్ ను ఎవరిని చేయాలో ముందే నిర్ణయించుకున్నప్పుడు ఎన్నికలు ఎందుకు..? అని తీవ్ర స్థాయిలో ప్రశ్నించారు.
నితీశ్ కుమార్ రెడ్డిపై అనిల్ కుంబ్లే కీలక వ్యాఖ్యలు.. అలా మాత్రం చేయొద్దు..!
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో తొలి రోజు టీమిండియా తరపున ఆడుతున్న తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి హీరో అనడంలో ఎలాంటి సందేహమే లేదని భారత క్రికెట్ దిగ్గజం అనిల్ కుంబ్లే ప్రశంసించారు. జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్, ఆకాశ్ దీప్ ఎంత ప్రయత్నించినప్పటికీ ఆరంభంలో వికెట్లు తీయలేకపోయారు.. కానీ, బౌలింగ్ కు రావడంతోనే ఒకే ఓవర్‌లో ఇంగ్లాండ్ ఓపెనర్లను నితీశ్ వెనక్కి పంపాడని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఆతిథ్య జట్టు బ్యాటింగ్ నెమ్మదిగా కొనసాగిందన్నారు. జో రూట్, బెన్ స్టోక్స్ లాంటి టాప్ బ్యాటర్లను కూడా నితీశ్ తన బౌలింగ్‌తో చాలా ఇబ్బంది పెట్టాడని కొనియాడారు. అలాగే, నితీశ్ కుమార్ విషయంలో వేటు వేయడం, మార్పులు చేయడం చేయొద్దని బీసీసీఐకి అనిల్ కుంబ్లే కీలక సూచనలు చేశారు.
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ఇకపై ఆ ఇబ్బంది ఉండదు
రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ తెలిపింది. రైలు ప్రయాణాల్లో ఏవైనా ఇబ్బందులు తలెత్తినప్పుడు ఫిర్యాదు చేయడానికి ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి సమస్యల పరిష్కారం కోసం రైల్ మదద్, 139 వంటి హెల్ప్ లైన్ నంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ సౌకర్యాన్ని మరింత సులభతరం చేయడానికి భారతీయ రైల్వే చర్యలు చేపట్టింది. ప్రయాణీకులు ఇప్పుడు WhatsApp ద్వారా కూడా ఫిర్యాదు చేసే విధంగా రైల్వే ప్రయాణికుల కోసం రైల్‌మదద్ వాట్సాప్ చాట్‌బాట్ సౌకర్యాన్ని ప్రారంభించింది. ప్రయాణికులు 7982139139 ద్వారా వాట్సాప్‌లో ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చు. రిజర్వ్డ్ క్లాస్ ప్రయాణికులతో పాటు జనరల్ టిక్కెట్లపై ప్రయాణించే ప్రయాణికులు కూడా వాట్సాప్‌లో తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చు. ధన్‌బాద్ రైల్వే డివిజన్ దీనికి సంబంధించిన సమాచారాన్ని Xలో వెల్లడించింది. అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్ తన X హ్యాండిల్‌లో Xలోని వాట్సాప్ చాట్‌బాట్ నంబర్‌ను కూడా షేర్ చేశారు. ప్రయాణ సమయంలో ఏదైనా సహాయం కోసం, మీరు రైల్ మదద్ వాట్సాప్ చాట్‌బాట్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని అధికారులు తెలిపారు.
మీరు పట్టించుకోరు.. వైఎస్ జగన్ వెళ్తే ఏడుస్తారు!
రాష్ట్రంలో రైతులను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, గిట్టుబాటు ఇవ్వడం లేదని వైసీపీ మాజీమంత్రి పేర్ని నాని మండిపడ్డారు. రైతుల వద్దకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ వెళ్తే ఏడుస్తారు అని కూటమి ప్రభుత్వంను విమర్శించారు. ఏపీలో రైతుల పరిస్థితులు దయనీయంగా ఉండటం సమాజానికి విచారకరం అని పేర్కొన్నారు. పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నట్లుగా కూటమి ప్రభుత్వ వ్యవహారం ఉందని ఎద్దేవా చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి జగన్ గారిని తిట్టడానికి తప్ప ఎక్కడైనా తిరిగారా? అని పేర్ని నాని ప్రశ్నించారు. శుక్రవారం అమరావతిలో మాజీమంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. ‘ఏపీలో రైతుల పరిస్థితులు దయనీయంగా ఉండటం సమాజానికి విచారకరం. ధాన్యం, పత్తి, మిర్చి, పొగాకు, కోకో.. తాజాగా మామిడి పంటలు పండుతున్న రైతుల కడగండ్లు ప్రభుత్వానికి కనిపించటం లేదు. పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నట్లుగా కూటమి ప్రభుత్వ వ్యవహారం. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే అర్థం ఏంటి?. ముందు నుంచి ఒకరు.. వెనుక నుంచి మరొకరు కోస్తారని అర్థమా?. రైతుల గోడు పట్టించుకునే నాధుడు లేడు. వ్యవసాయ శాఖ మంత్రి జగన్‌ను తిట్టడానికి తప్ప ఎక్కడైనా తిరిగారా?. హామీలు ఇచ్చిన మూడు పార్టీల్లో ఇద్దరు అవునంటారు.. మరొకరు తెలియదు అంటారు. వ్యవసాయ శాఖ మంత్రి రైతుల బాధలు పట్టించుకుంటున్నారా?. మిర్చి, పొగాకు రైతుల బాధలు చూడటానికి వెళ్తే సినిమా సెట్టింగుల యాత్రలు అంటారు. జగన్ వెళ్తుంటే విమర్శిస్తారు.. మీరు వెళ్ళి చూస్తుంటారు. మిర్చి యార్డు ఉన్న కేంద్ర మంత్రి రైతుల కోసం వెళ్లారా?. ఒక్క ఎమ్మెల్యే అయినా రైతుల కోసం వెళ్లారా?. మీరు పట్టించుకోరు, రైతులకు గిట్టుబాటు ఇవ్వరు.. జగన్ వెళ్తే ఏడుస్తారు’ అని పేర్ని నాని మండిపడ్డారు.
అణుబాంబు కన్నా ప్రమాదమే.. ఆర్.నారాయణ మూర్తి షాకింగ్ కామెంట్స్..
మన దేశంలో విద్యను జాతీయం చేయడం, కాపీయింగ్ ను అరికట్టడమే ‘యూనివర్సిటీ (పేపర్ లీక్)’ మూవీ ఉద్దేశం అన్నారు ఆర్.నారాయణ మూర్తి. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను ఆయనే నిర్మిస్తూ డైరెక్ట్ చేశారు. ఈ మూవీ ఆగస్టు 22న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఆయన మీడియాతో మూవీ విశేషాలను పంచుకున్నారు. మన దేశంలో విద్యను ప్రైవేట్ పరం నుంచి తప్పించి జాతీయం చేయాలన్నదే తన సినిమాలో చూపించానన్నారు. విద్యను పేద విద్యార్థులకు దగ్గర చేయడానికి.. దాని అవసరాన్ని చూపించేందుకు ఈ మూవీ తీస్తున్నట్టు తెలిపారు నారాయణ మూర్తి. మన దేశంలో చాలా ఎగ్జామ్స్ లో కాపీయింగ్ జరుగుతోందన్నారు మూర్తి. కాపీయింగ్ అనేది అణుబాంబు కన్నా ప్రమాదం. కొన్నేళ్లుగా మన రాష్ట్రంలోనూ పేపర్ లీకులు జరుగుతున్నాయి. గ్రూప్-1 స్థాయి ఎగ్జామ్స్ కూడా లీక్ అయితుంటే మన విద్య ఏ స్థాయిలో ఉందో మనకు అర్థం అవుతోంది. ఈ కాపీయింగ్ అనేది చాలా ప్రమాదం. దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది. దీని వల్ల ఎంతో మంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి. చూసి రాసిన వాళ్లు డాక్టర్లయితే రోగులు బతుకుతారా.. ఒకవేళ కాపీ కొట్టిన వాల్లు ఇంజినీర్లు అయితే వాల్లు కట్టిన బిల్డింగులు కూలిపోకుండా ఉంటాయా.. కాబట్టి దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్తే ఎంతో కొంత అవగామన వస్తుందనేది నా అభిప్రాయం అంటూ చెప్పారు నారాయణ మూర్తి.
మరీ ఇంత దారుణమా..? 6 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకున్న 45 ఏళ్ల వ్యక్తి..
ఆఫ్ఘనిస్తాన్ వంటి కొన్ని దేశాలలో బాల్య వివాహాలు కొత్తేం కాదు. అయితే, ఇటీవల ఇక్కడ ఓ బాల్య వివాహ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇది మానవత్వాన్ని సిగ్గుపడేలా చేసింది. ఆఫ్ఘనిస్తాన్‌లోని హెల్మండ్ ప్రావిన్స్‌లో 45 ఏళ్ల వ్యక్తి ఆరేళ్ల బాలికను వివాహం చేసుకున్నాడు. ఆ బాలిక పెళ్లికూతురుగా మారిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఆఫ్ఘాన్ ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. విషయం పెద్ద ఎత్తున వ్యాపించడంతో బాలిక తండ్రి, వరుడిని అరెస్టు చేశారు. అయితే.. వారిపై ఎటువంటి కేసు నమోదు కాలేదు. తాలిబన్ ప్రభుత్వం ఇప్పటి వరకు బాల్య వివాహాలకు సంబంధించి ఎటువంటి చట్టాన్ని రూపొందించలేదు. వివాహానికి చట్టబద్ధమైన కనీస వయస్సు నిర్ణయించలేదు. కానీ.. ప్రస్తుతం ఆ బాలికను అతడి వెంట తీసుకెళ్లకుండా ఆపారు. అయితే.. తొమ్మిది సంవత్సరాల వయసు దాటిన తరువాత ఆ బాలికను ఆ వ్యక్తి వద్దకు పంపవచ్చని ప్రభుత్వం చెప్పింది. స్థానిక మీడియా నివేదికల ప్రకారం.. ఆ వ్యక్తి ఇప్పటికే రెండుసార్లు వివాహం చేసుకున్నాడు. బాలిక కుటుంబీకులకు నగదు ఇచ్చి మూడో వివాహానికి ఒప్పించాడు. ఇదిలా ఉండగా.. 2021లో తాలిబన్లు తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బాల్య వివాహాల కేసులు వేగంగా పెరిగాయని ఓ నివేదిక తెలిపింది. తాలిబన్ పాలనలో బాల్య వివాహాలు 25 శాతం వరకు పెరిగాయని యూఎన్ మహిళలు నివేదించారు. అదే సమయంలో.. UNICEF అంచనా ప్రకారం, ఆఫ్ఘనిస్తాన్ ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో బాల వధువులను కలిగిన దేశంగా ఉంది.
ఇందిరమ్మ క్యాంటీన్లలో అల్పాహారం.. మెనూ అదిరిందిగా
తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఇందిరమ్మ క్యాంటీన్లలో రూ.5కే అల్పాహారాన్ని అందించే పథకాన్ని అమలు చేయడానికి సిద్ధమైంది. ఇందిరమ్మ క్యాంటీన్లలో ఇవ్వబోయే బ్రేక్‌ఫాస్ట్ మెనూ గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) సిద్ధం చేసింది. జీహెచ్ఎంసీ నిర్ణయం మేరకు ప్రజల నుంచి ఒక్కో టిఫిన్‌కు కేవలం రూ.5 మాత్రమే వసూలు చేయనుంది. మిగతా రూ.14 ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. ఒక టిఫిన్‌కు మొత్తం ఖర్చు రూ.19గా అంచనా వేయగా, ప్రజలపై ఆర్ధిక భారం పడకుండా దీన్ని అమలు చేయాలని భావిస్తోంది. GHMC రూపొందించిన మెనూను హరే కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అమలు చేయనున్నారు. ఆరోగ్యకరంగా ఉండేలా మిల్లెట్ ఫుడ్‌ను ప్రాధాన్యతనిస్తూ రోజుకో రకం అల్పాహారాన్ని అందించనున్నారు.
హైదరాబాద్‌లో నాలాల ఆక్రమణల తొలగింపు.. వరదల నివారణకు హైడ్రా చర్యలు
హైదరాబాద్‌లో వర్షాకాలంలో వరదలు ముంచెత్తకుండా నాలాలపై ఉన్న ఆక్రమణలను తొలగించేందుకు హైడ్రా చర్యలు ముమ్మరం చేసింది. కూకట్‌పల్లి, ఖైరతాబాద్ పరిసరాల్లో శుక్రవారం ఉదయం ప్రారంభమైన ఆపరేషన్‌లో హైడ్రా అధికారులు తొలుత బుల్కాపూర్ నాలా, ఐడీఎల్ నాలాల ఆక్రమణలను తొలగించే పనులను చేపట్టారు. బుల్కాపూర్ చెరువు నుంచి ప్రారంభమై, హైటెక్ సిటీ ప్రాంతాల గుండా హుస్సేన్ సాగర్‌లో కలిసే ఈ నాలా, గత కొన్నేళ్లుగా అనేక చోట్ల ఆక్రమణలకు గురైంది. ముఖ్యంగా తుమ్మలబస్తీ.. ఆనందనగర్ మధ్య నాలా వెడల్పు 8 మీటర్లుండాల్సిన చోట 5 మీటర్లకు మాత్రమే పరిమితమైంది. దీంతో వర్షాకాలంలో వరదనీరు కాలనీల్లోకి చేరుతున్నట్టు స్థానికులు ఫిర్యాదు చేశారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ నేతృత్వంలో అధికారులు పర్యటన నిర్వహించి, శ్రీధర్ ఫంక్షన్ హాల్ నిర్మించిన ఆక్రమణను తొలగించారు. కొన్ని చోట్ల నివాసితులు స్వయంగా నిర్మాణాలను తొలగిస్తామని హామీ ఇవ్వడంతో వారికి కొంత గడువు ఇచ్చారు. ఖైరతాబాద్ చౌరస్తా వద్ద నాలా ముఖద్వారాన్ని మూసివేసిన ధర్మాకోల్ వ్యర్థాలను కూడా హైడ్రా తొలగించింది.
