ఆరునూరైనా.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తాం..
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. బీసీలకు రీజర్వేషన్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. భారత్ జోడో యాత్రలో రాహుల్ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నాం.. ఇతర రాష్ట్రాల్లో వచ్చిన అడ్డంకులు తెలంగాణలో రావొద్దన్నదే మా ఆలోచన.. ఆరునూరైనా 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించాం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లులు చేసి పంపితే గవర్నర్, రాష్ట్రపతి పెండింగ్ లో పెట్టారు.. గత సర్కార్ 50 శాతం రిజర్వేషన్లు దాటొద్దంటూ చట్టం తెచ్చింది.. తెలంగాణ ప్రజల్లో అపోహలు సృష్టించే విధంగా బీఆర్ఎస్ సభ్యులు మాట్లాడుతున్నారు..
పరస్పర విశ్వాసం ఆధారంగా సంబంధాలను ముందుకు తీసుకెళ్లడానికి కట్టుబడి ఉన్నాం..
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చైనాకు చేరుకున్న విషయం తెలిసిందే. ఈరోజు అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌ను కలిశారు. టియాంజిన్‌లో జరగనున్న షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశానికి ముందు ఈ సమావేశం జరిగింది. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు ఉత్తర చైనాలోని టియాంజిన్‌లో జరిగే SCO శిఖరాగ్ర సమావేశానికి ప్రధానమంత్రి హాజరవుతారు. ఇద్దరు నాయకుల సమావేశం స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు (భారత కాలమానం ప్రకారం ఉదయం 9:30 గంటలకు) ప్రారంభమైంది. భారతదేశం, చైనా మధ్య సంబంధాలు కొంతవరకు మెరుగుపడిన సమయంలో మోడీ, జిన్‌పింగ్ మధ్య సమావేశం జరుగుతోంది.
బీసీలకు ఉన్న అనుమానాలను ప్రభుత్వం నివృత్తి చేయాలి
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని స్పష్టంచేశారు. అయితే బీసీలకు ఉన్న అనుమానాలను ప్రభుత్వం నివృత్తి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. కామారెడ్డి డిక్లరేషన్‌పై అసెంబ్లీలో చర్చ జరగాలని డిమాండ్ చేశారు. “బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. మీ చేతిలో ఉన్న అధికారాన్ని పంచిపెట్టడంలో ఏమాత్రం అభ్యంతరం ఉంది?” అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
గంగుల కమలాకర్ పై మంత్రులు సీరియస్..
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. బీసీ రిజర్వేషన్లపై చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో గంగుల కమాలకర్ పై మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు సీరియస్ అయ్యారు. సభలో గంగుల మాట్లాడుతూ.. మంత్రికి వాస్తవాలు తెలియదు.. నేను అడిగిన వాటికి సీఎం క్లారిటీ ఇవ్వాలి అని అన్నారు. గంగులు వ్యాఖ్యలతో హీట్ పెరిగింది. ఆకారాలు పెద్దగ ఉంటే..అవగాహన ఎక్కువ ఉంటది అనుకోవద్దు అని మంత్రి పొన్నం ఫైర్ అయ్యారు. అవగాహన లేదు అంటున్నారు.. ఆయన కంటే ఎక్కువ చదువుకున్నాను. రాజకీయాల్లో విద్యార్థి దశ నుంచి ఉన్నా.. మంత్రికి అవగాహన లేదని మాట్లాడటం పొరపాటు.. గంగుల వ్యాఖ్యలను వెనక్కి తీసీుకోవాలని డిమాండ్ చేశారు.
రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సీలింగ్.. కేంద్రం పరిష్కరించాల్సిందే
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును బీఆర్‌ఎస్ తరఫున స్వాగతిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా బీసీ సబ్‌ప్లాన్‌ను కూడా అమలు చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. బలహీన వర్గాల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడే మాట్లాడుతుందని, కానీ గతంలో బీసీల కోసం కేసీఆర్ గట్టిగా పోరాడిన విషయాన్ని గుర్తు చేశారు. కేంద్రంలో ఓబీసీ సంక్షేమ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లినవారే కేసీఆర్ అని కేటీఆర్ అన్నారు. తమ ప్రభుత్వంలో అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్ పదవులు బీసీలకు ఇచ్చామని చెప్పారు. రాహుల్ గాంధీ కంటే ముందే బీఆర్‌ఎస్ కులగణన అవసరమని ప్రతిపాదించిందని ఆయన గుర్తు చేశారు. రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు ధర్మాసనం సీలింగ్ విధించిందని, అది కేంద్రం పరిష్కరించాల్సిన అంశమని కేటీఆర్ స్పష్టం చేశారు.
దేశవ్యాప్తంగా బీసీ రిజర్వేషన్ల అమలుకు కాంగ్రెస్ కృషి చేస్తుంది
రిజర్వేషన్ ల అమలుకోసం 50 శాతం నిబంధన ఎత్తివేస్తూ బిసి లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసినందుకు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ చర్యలను సమాజం సంపూర్ణంగా స్వాగతించాలని ఆయన ఆకాంక్షించారు.అన్ని రకాలుగా సాంకేతిక, న్యాయ, రాజకీయ అంశాలన్నీ పరిగణలోకి తీస్కొని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో బిసి లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీ లో ఏకగ్రీవంగా బిల్లు చేయడం పట్ల ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు. బిల్లు కోసం అన్ని రకాల చర్యలు తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కు, మంత్రి వర్గ ఉప సంఘానికి బిల్లుకు మద్దతు తెలిపిన ప్రతిపక్ష నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ప్రముఖ నటి కన్నుమూత..
బాలీవుడ్ టీవీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ టెలివిజన్ నటి ప్రియా మరాఠే (38) ఇకలేరు. ఈ వార్త వినగానే సినీ, టీవీ వర్గాలు షాక్‌కు గురయ్యాయి. గత కొన్నాళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ప్రియా, ముంబైలోని తన నివాసంలో ఈరోజు (ఆగస్టు 31) ఉదయం తుదిశ్వాస విడిచారు. 2006లో చిన్న తెరపై అడుగుపెట్టిన ప్రియా, ఇప్పటివరకు 20కి పైగా సీరియల్స్‌లో నటించారు. తన సహజమైన నటనతో టెలివిజన్ ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అదే విధంగా రెండు సినిమాల్లో కూడా నటించి తన ప్రతిభను చాటుకున్నారు.
సీఎం రేవంత్ వ్యాఖ్యలకు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్..
శాసనసభలో పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లు సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. బీసీల కోసం గతంలో కేసీఆర్ అనేక పోరాటాలు చేశారు.. నేను ఆంధ్రప్రదేశ్ నుంచి పోతున్న ఢిల్లీకి.. తిరిగి తెలంగాణలోనే అడుగు పెడతా అని చెప్పిపోయిండు సాధించిండు కేసీఆర్.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిత్తశుద్ది ఉంటే.. బీసీ బిల్లు సాధించుడో.. లేకపోతే ఢీల్లీ నుంచి తెలంగాణకు రాను అని అక్కడే జంతర్ మంతర్ లో కూర్చుని ఆమరణ నిరాహార దీక్ష చేయమనండి అని తెలిపారు. ప్రధానమంత్రి అపాయింట్ మెంట్ ఇస్తలేరు అని సీఎం రేవంత్ అంటున్నారు.. ఎందుకు ఇస్తలేరు.. సీఎం స్వయంగా చెప్తున్నరు అపాయింట్ మెంట్ ఇస్తే చెప్పులెత్తుకపోతరేమోనని ఇస్తలేరని అంటున్నడు.
