ఇరాన్ అణు కేంద్రాలు ధ్వంసం చేశాం.. తాజా ఇంటర్వ్యూలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు
ఇరాన్‌లోని ఫోర్డో అణు కేంద్రంపై అమెరికా బాంబులు దూసుకుపోయాయని తాజాగా డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడారు. ఇరాన్‌లోని అత్యంత శక్తివంతమైన భూగర్భ కేంద్రం ఫోర్డోపై అమెరికా ప్రయోగించిన బంకర్-బస్టర్ బాంబులు దూసుకుపోయాయని.. ప్రస్తుతం అక్కడ వేల టన్నుల రాత్రి మాత్రమే మిగిలి ఉందని స్పష్టం చేశారు. ఇరాన్ అణు కేంద్రాలు పూర్తిగా తుడుచుకుపెట్టుకుపోయాయని పేర్కొన్నారు. ఇక ఇస్లామిక్ రిపబ్లిక్ అణ్వాయుధాలను అనుసరించే స్థితిలో లేదని, కనీసం ప్రస్తుతానికైతే లేదని ట్రంప్ తేల్చి చెప్పారు.
15 రోజుల క్రితమే ఆడ శిశువుకు జన్మనిచ్చిన మహిళా పోలీస్.. ఇంతలోనే..
ఆదోని పట్టణంలోని 34 వ వార్డు సచివాలయ మహిళ పోలీసుగా దివ్య (26) విధులు నిర్వహిస్తోంది. కాగా దివ్య ఈ నెల 15న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సిజేరియన్ కాన్పు కావడంతో అనారోగ్యానికి గురైంది. 15 రోజులు గడవకముందే దివ్య ప్రాణాలు కోల్పోయింది. దివ్య మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అయితే దివ్య మృతికి బదిలీల కౌన్సెలింగ్‌లో తీవ్ర జాప్యం జరగడమే కారణమని తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బదిలీల కౌన్సెలింగ్ ఉండటంతో శనివారం ఉదయం 8.30కు జిల్లా ఎస్పీ కార్యాలయానికి కారులో వెళ్లారు. కౌన్సెలింగ్ ఆలస్యం అవుతుండడంతో త్వరగా పంపాలని అధికారులను వేడుకున్నా పట్టించుకోలేదని దివ్య తండ్రి తిరుమల శ్రీనివాసులు తెలిపారు. శనివారం అర్ధరాత్రి ఒంటి గంట దాటాక కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసిందని.. ఆస్పరి మండలం హలిగేర గ్రామ సచివాలయానికి బదిలీ అయిందన్నారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచందర్‌రావు
తెలంగాణ బీజేపీలో కీలక మార్పు చోటుచేసుకుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావును అధిష్ఠానం ఎంపిక చేసింది. ఈ మేరకు ఆయన నామినేషన్ దాఖలు చేయాల్సిందిగా రాష్ట్ర నాయకత్వానికి కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్టు తెలిసింది. రామచందర్‌రావు ఈరోజు (సోమవారం) మధ్యాహ్నం 2 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు.ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఇప్పటికే పార్టీ కార్యకర్తలు, నాయకులు రామచందర్‌రావుకు అభినందనలు తెలుపుతూ సోషల్ మీడియాలో హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జూలై 8న భారత్-యూఎస్ మధ్య భారీ వాణిజ్య ఒప్పందం జరిగే ఛాన్స్!
అమెరికా-భారతదేశం మధ్య భారీ వాణిజ్య ఒప్పందం జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రకటన జూలై 8న వెలువడే అవకాశం ఉంది. త్వరలోనే భారత్-అమెరికా మధ్య కీలక ఒప్పందం జరగబోతున్నట్లు ఇప్పటికే ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు జరిగినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ప్రకటన జూలై 8న వెలువడే ఛాన్సుంది. రెండోసారి అధికారంలోకి వచ్చాక ట్రంప్.. ఆయా దేశాలపై భారీగా సుంకాలు విధించారు. దీంతో దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అనంతరం ఏప్రిల్ 2న సుంకాలను మూడు నెలల పాటు వాయిదా వేస్తు్న్నట్లు ప్రకటించారు. ఆ గడువు జూలై 9తో ముగుస్తోంది. ఈ గడువు పొడిగించే అవకాశం లేదని తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ తేల్చి చెప్పారు. ఇక భారత్-అమెరికా మధ్య వాణిజ్యంపై కీలక ఒప్పందాలు జరిగినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రకటనను జూలై 8న అధికారికంగా ప్రకటించనున్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేయనున్న పీవీఎన్ మాధవ్..
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్ష పదవికి పీవీఎన్ మాధవ్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. అధ్యక్ష పదవికి సింగిల్ నామినేషన్ వేయాలని పార్టీ నిర్ణయించినట్లు సమాచారం. దీంతో మాధవ్ ఎన్నిక లాంఛనమే అంటున్నాయి పార్టీ వర్గాలు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ తో ఐదు దశాబ్దాల పైగా మాధవ్ కుటుంబానికి అనుబంధం ఉంది. మాధవ్ ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పనిచేశారు. తండ్రి కొడుకులు ఇద్దరు పార్టీ అధ్యక్షులు అయిన అరుదైన రాజకీయ నేపథ్యం చోటుచేసుకోనున్నది. ఉమ్మడి రాష్ట్రానికి బీజేపీ తొలి అధ్యక్షు డు గా పనిచేసిన మాధవ్ తండ్రి చలపతి రావు పనిచేశారు. ఏపీ బిజెపి రాష్ట్ర కార్యాలయానికి ప్రస్తుత అధ్యక్షురాలు పురంధేశ్వరి చేరుకున్నారు. మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది. విజయవాడలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం అధ్యక్ష ఎన్నిక నిర్వహించనున్నారు. కర్ణాటక ఎంపీ మోహన్ ఎన్నికల పరిశీలకుడిగా వ్యవహరించనున్నారు.
వేధింపులు భరించలేకపోతున్నా.. తండ్రికి మెసేజ్ పెట్టి తనువు చాలించిన నవ వధువు
వరకట్న పిశాచికి మరో అబల బలైపోయింది. కూతురు జీవితం సుఖంగా ఉండాలని భారీగా కట్న, కానుకలు ఇచ్చి ఎంతో గ్రాండ్‌గా వివాహం జరిపించాడు ఆ తండ్రి. అయినా కూడా అత్తింటి వారికి ధనదాహం తీరలేదు. పెళ్లైన దగ్గర నుంచి భర్త, అత్తమామలు నిత్యం వరకట్న వేధింపులు చేస్తూనే ఉన్నారు. అటు తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టలేక.. ఇటు మనసు చంపుకుని బ్రతకలేక నవ వధువు తనువు చాలించింది. ఈ ఘోర విషాద ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.
గురుకులాల పతనానికి కారణం రేవంత్ పాలనా వైఫల్యమే
తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యావ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. లక్షలాది ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు భవిష్యత్తు నిర్మాణంగా నిలిచిన గురుకులాలు, ప్రస్తుతం నిర్వీర్యం అవుతుండటం దురదృష్టకరమని ఆయన ట్విటర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘రాష్ట్రంలో గురుకులాల పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. విద్యావ్యవస్థ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చూపిస్తున్న ఉదాసీనత లక్షల మంది బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల ఆశలను పాతాళానికి నెట్టేసింది’’ అని హరీష్ రావు విమర్శించారు. గతంలో ఆదర్శంగా నడిచిన గురుకుల పాఠశాలలు, కళాశాలలు ఇప్పుడు నాణ్యత కోల్పోయిన స్థితిలో ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
క్వాంటమ్ వ్యాలీపై వర్క్ షాప్ ను ప్రారంభించిన సీఎం చంద్రబాబునాయుడు
క్వాంటమ్ వ్యాలీపై విజయవాడలోని నోవాటెల్ లో వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు. క్వాంటమ్ వ్యాలీపై వర్క్ షాప్ ను సీఎం చంద్రబాబునాయుడు ప్రారంభించారు. వివిధ బహుళ జాతి ఐటీ కంపెనీలు ఏర్పాటు చేసిన స్టాల్స్ సీఎం చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పరిశీలించారు. ఐటీ, ఫార్మా, వాణిజ్య రంగాలకు చెందిన కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. దేశంలోనే తొలిసారిగా IBM, TCS, L&T సహకారంతో అమరావతి లో క్వాంటం వ్యాలీ ఏర్పాటు చేశారు. జనవరి నుంచి ఏపీలో క్వాంటమ్ వ్యాలీ కార్యకలాపాలు జరుగనున్నాయి. అమరావతిలో టెక్ వ్యాలీ పార్కులోనే లక్షల మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి.. ఇతర రాష్ట్రాలూ సేవలు వినియోగించుకునే వెసులుబాటు కల్పించనున్నారు. అమరావతిలో 50 ఎకరాల్లో క్వాంటమ్ వ్యాలి ఏర్పాటు కానున్నది. రూ. 4 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
పాశమైలారం పేలుడు ఘటన.. 10కి చేరిన మృతుల సంఖ్య
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు సమీపంలోని పాశమైలారం పారిశ్రామిక వాడలో ఉన్న సీగాచి కెమికల్స్ పరిశ్రమలో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. రియాక్టర్ ఒక్కసారిగా పేలిపోవడంతో భారీ పేలుడు సంభవించడంతో పరిశ్రమ తునాతునకలైపోయింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 10 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
ఉదయం 9 గంటల సమయంలో సీగాచి కెమికల్స్‌లో పని సాగుతున్న సమయంలో రియాక్టర్ ఒక్కసారిగా పేలిపోవడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. పేలుడు ధాటికి కంపెనీ షెడ్డు పూర్తిగా కూలిపోయింది. మంటలు తక్కువ సమయంలోనే పరిశ్రమ మొత్తం వ్యాపించడంతో కార్మికులు బయటకు పరుగులు పెట్టారు. అయినప్పటికీ, పలువురు కార్మికులు మంటల్లో చిక్కుకుపోయారు.
ఏవేవో ఆలోచనలు.. కాళ్లు, చేతులు ఆడలేదు!
దక్షిణాఫ్రికాతో టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్‌కు ముందు రోజు తీవ్ర ఒత్తిడికి గురయ్యానని అప్పటి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. ఏవేవో ఆలోచనలతో తన కాళ్లు, చేతులు ఆడలేదని.. ఆ రోజు రాత్రి నిద్రపోలేదని చెప్పాడు. చివరి ఓవర్లో డేవిడ్ మిల్లర్ కొట్టిన షాట్ కచ్చితంగా సిక్స్ పోతుందనుకున్నా అని, సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా క్యాచ్‌ను అందుకున్నాడని ప్రశంసించాడు. కీలక సమయంలో రిషబ్ పంత్‌కు గాయం అయిందని కంగారు పడ్డా అని, అయితే బ్యాటర్ల లయను దెబ్బ తీసేందుకు అలా చేశాడని తర్వాత అర్థమైందని రోహిత్ చెప్పుకొచ్చాడు. బార్బడోస్‌లో ఉత్కంఠ భరితంగా సాగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి కప్ కైవసం చేసుకుంది.
