NTV Telugu Site icon

Top Headlines@1pm : టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

కొనసాగుతున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

ఎమ్మెల్యే కోటాలోని ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. వెలగపూడి లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మొదటి అంతస్థులో ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఓటును వినియోగించుకున్నారు. శాసనసభలో మొత్తం సభ్యుల సంఖ్య 175 కాగా వైఎస్సార్‌సీపీకి 151 మంది, టీడీపీకి 23 మంది, జనసేనకు ఒక సభ్యుడు ఉన్నారు. అయితే నలుగురు సభ్యులు మాత్రం టీడీపీకి ఏళ్ల తరబడి దూరంగా ఉంటున్నారు. దీంతో టీడీపీకి 19 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. అలాగే జనసేన సభ్యుడు కూడా పార్టీని వీడారు. కాగా, ఒక్కో ఎమ్మెల్సీ గెలుపునకు 22 మంది సభ్యుల ఓట్లు అవసరం. వైఎస్సార్సీపీ స్పష్టమైన ఆధిక్యత నేపథ్యంలో ఏడు స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపింది. మరోవైపు టీడీపీకి ఒక్క సీటు కూడా గెలిచేంత బలం లేదు. అయితే అభ్యర్థిని నిలబెట్టడం చర్చనీయాంశంగా మారింది. వైఎస్సార్‌సీపీలో పనితీరును బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో కొందరు ఎమ్మెల్యేలకు టిక్కెట్లు రాకపోవచ్చని భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో అలాంటి వారి మ‌ద్దతు పొందేందుకు టీడీపీ ప్ర‌య‌త్నిస్తోంద‌ని స‌మాచారం. ఉద‌యం 9 నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు పోలింగ్ జ‌ర‌గ‌డంతో పాటు సాయంత్రం 5 గంట‌ల‌కు కౌంటింగ్ జ‌ర‌గ‌నుంది. ఫలితాలు తర్వాత ప్రకటిస్తారు. అయితే.. ఇప్పటి వరకు 107 మంది ఎమ్మెల్యేలు ఓటు హక్కును వినియోగించుకున్నారు.

దేవుని కడపలో ఉగాది వేడుకలు.. పెద్ద ఎత్తున దర్శించుకున్న ముస్లింలు

తెలుగు వారి తొలి పండుగ ఉగాది ప‌ర్వ‌దినాన్ని ఇక్క‌డ హిందువులే కాదు.. ముస్లీంలు కూడా అత్యంత భ‌క్తి శ్ర‌ద్ద‌ల‌తో జ‌రుపుకుంటారు. శ్రీ‌నివాసునికి కాయ క‌ర్పూరం స‌మ‌ర్పించి, ఇక్క‌డి పూజారి ఆశీర్వాదం తీసుకుంటారు. ఇందుకోసం ముస్లింలు క‌లియుగ‌ ద‌ర్శించుకోవ‌డం దేవుని క‌డ‌పలో ఉగాది పండుగ ప్రత్యేక‌త‌. క‌డ‌ప‌లో అత్యంత భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో జ‌రుపుకున్నారు. ప్ర‌తి ఉగాది రోజున తిరుమ‌ల తొలి గ‌డ‌ప దేవుని క‌డ‌ప‌లో శ్రీ ల‌క్ష్మీ వేంక‌టేశ్వ‌ర స్వామిని భ‌క్తితో పూజించి, కానుక‌లు స‌మ‌ర్పించ‌డం ఇక్క‌డి ముస్లీంల‌కు త‌ర‌తరాలుగా వ‌స్తున్న‌ఆన‌వాయితీ. ఉద‌యాన్నే దేవుని క‌డ‌ప ఆల‌యానికి చేరుకుని, కాయ‌క‌ర్పూరం స‌మ‌ర్పించి, ముడుపులు స‌మ‌ర్పించారు ముస్లిం భ‌క్తులు. ఉగాది రోజున వేంక‌టేశ్వ‌రున్ని ద‌ర్శించి, ఆల‌య పూజారికి బియ్యం బేడ‌లు స‌మ‌ర్పించి, ఆశీర్వాదం తీసుకుంటే ఈ ఏడాదంతా సుఖ సంతోషాల‌తో ఉంటార‌ని ఇక్క‌డి ముస్లింల విశ్వాసం. అందుకే క్ర‌మం త‌ప్ప‌కుండా దేవుని క‌డ‌ప‌ను ముస్లింలు ఉగాది రోజున సంద‌ర్శించి మ‌త సామ‌ర‌స్యాన్ని చాటుతున్నారు. చూసేవారికి కొత్త‌గా అనిపించినా, త‌మ‌ బీబీ నాంచార‌మ్మ‌ను శ్రీ‌నివాసుడు ప‌రిణ‌యం చేసుకున్నాడ‌ర‌న్న కార‌ణంతో క‌డ‌ప ముస్లింలు మాత్రం అత్యంత భ‌క్తితో, ప్రీతి పాత్రంగా ఉగాదిని జ‌రుపుకుంటున్నారు. ఏ ఏడాదైనా ఉగాదిని ఇలా జ‌రుపుకోవ‌డం సాధ్యం కాక‌పోతే ఇబ్బందులు ప‌డ్డామ‌ని, కొంద‌రు ముస్లింలు చెబుతున్నారు.త‌మ పూర్వీకుల నుంచి ఈ సాంప్ర‌దాయం వ‌స్తోంది. పెద్ద‌లు చేసిన‌ట్లే తాము ఇప్పుడు గుడికి వ‌చ్చి ఉగాదిని జ‌రుపుకుంటామ‌ని చెబుతున్నారు.

జర్నలిస్టుల రక్షణకు బిల్లు తీసుకువచ్చిన ఛత్తీస్‌గఢ్

జర్నలిస్టుల రక్షణ కోసం చత్తీస్ గఢ్ ప్రభుత్వం ‘ ఛత్తీస్‌గఢ్ మీడియా పర్సన్స్ ప్రొటెక్షన్ బిల్లు 2023 ’ను తీసుకువచ్చింది. బుధవారం ఆ రాష్ట్ర శాసనసభలో దీన్ని ఆమోదించారు. ఇది చారిత్రాత్మక రోజు అని ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ అభివర్ణించారు. ఈ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపాలని ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేయగా.. స్పీకర్ చరదాస్ మహంత్ తిరస్కరించారు. ఛత్తీస్‌గఢ్‌లో 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో రాష్ట్రంలోని జర్నలిస్టులకు రక్షణ కల్పించే చట్టాన్ని తీసుకువస్తామని హామీ ఇచ్చింది.

మీడియా ప్రతినిధులపై హింసను నిరోధించడం, విధులు నిర్వర్తించడంలో ఈ బిల్లు రక్షణ ఇస్తుందని సీఎం అన్నారు. ఈ చట్టాన్ని అమలు చేయాలని చాలాసార్లు డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి 2019లో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అఫ్తాబ్ ఆలం నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటు చేశారని ఈ చట్టం అందరిని సంప్రదించి చేశామని సీఎం బఘేల్ అన్నారు. ఎడిటర్స్ గిల్డ్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, రాష్ట్రంలోని ప్రెస్ క్లబ్‌లతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరిపిందా అని ప్రతిపక్ష నేత నారాయణ్ చందేల్, అజయ్ చంద్రాకర్ సహా బీజేపీ శాసనసభ్యులు ప్రశ్నించారు. బిల్లును సెలక్ట్ కమిటీకి పంపాలని డిమాండ్ చేశారు.

ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన ఈ ఇద్దరూ ఒకే ఫ్రేమ్ లో…

ఈరోజు పాన్ ఇండియా మొత్తంలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ అంటే ఇద్దరి పేర్లు మాత్రమే వినిపిస్తాయి. ఒకటి ప్రశాంత్ నీల్, ఇంకొకటి రాజమౌళి. ఈ ఇద్దరూ ఇండియన్ బాక్సాఫీస్ ని రఫ్ఫాడించారు. బాహుబలి సినిమాతో రాజమౌళి పాన్ ఇండియా మార్కెట్ ని క్రియేట్ చేస్తే, ప్రశాంత్ నీల్ KGF సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ ని దున్నేసాడు. రాజమౌళి తర్వాత అంతటి దర్శకుడు ప్రశాంత్ నీల్ మాత్రమే అనే ఫీలింగ్ ప్రతి ఒక్కరిలో ఉంది. ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రతి సూపర్ స్టార్ ప్రశాంత్ నీల్, రాజమౌళిలతో సినిమా చెయ్యాలి అనుకుంటున్నాడు. అలాంటి టాప్ డైరెక్టర్స్ ఇద్దరూ ఈరోజు కలిసారు. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సెకండ్ ఔటింగ్ ‘ఎన్టీఆర్ 30’ ఈరోజు గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ఈ ఈవెంట్ కి రాజమౌళి, ప్రశాంత్ నీల్ చీఫ్ గెస్టులుగా వచ్చారు. ఈ లాంచ్ ఈవెంట్ లో రాజమౌళి, ప్రశాంత్ నీల్ కలిసి ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రిషబ్ శెట్టి మొదలు పెట్టాడు… ఈసారి అంతకుమించి

కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి KGF తర్వాత ఆ రేంజులో పాన్ ఇండియా బాక్సాఫీస్ ని కాంకర్ చేసిన సినిమా కాంతార. థియేటర్స్ లో కూర్చున్న ఆడియన్స్ కి బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన కాంతార, కన్నడలో రూపొందిన ఒక చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి అతి తక్కువ సమయంలోనే కల్ట్ క్లాసిక్ గా పేరు తెచ్చుకుంది. రిలీజ్ అయిన సెకండ్ వీక్ నుంచి కన్నడ సరిహద్దులు దాటి మిగిలిన ప్రాంతాలకి వ్యాపించిన కాంతార మ్యాజిక్ పాన్ ఇండియా మొత్తం వ్యాపించింది. కాంతార సినిమాని రిషబ్ శెట్టి అద్భుతంగా నటిస్తూ తెరకెక్కించాడు. హోమ్బెల్ ఫిల్మ్ మేకర్స్ నుంచి వచ్చిన ఈ మాస్టర్ పీస్ కి స్టార్టింగ్ పావు గంట, క్లైమాక్స్ అరగంట పంచ ప్రాణులుగా నిలిచాయి. కాంతార సినిమాని అంత గొప్పగా మార్చిన ఇంకో విషయం ‘వరాహరూపం’ సాంగ్, ఈ పాట వినీ గూస్ బంప్స్ రాని ప్రేక్షకుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు. పర్ఫెక్ట్ క్రాఫ్ట్స్ మెన్ సినిమాగా పేరు తెచ్చుకున్న కాంతార సినిమాకి ప్రీక్వెల్ గా కాంతార 2 స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టాడు రిషబ్ శెట్టి.

రాహుల్ గాంధీకి రెండేళ్లు జైలు శిక్ష విధించిన సూరత్ కోర్టు..

కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీకి రెండేళ్లు జైలు శిక్ష విధిస్తూ సూరత్ కోర్టు తీర్పు చెప్పింది. 2019లో ‘‘మోదీ ఇంటిపేరు’’ వ్యాఖ్యలపై పరువునష్టం కేసులో శిక్షను ఎదుర్కోనున్నారు. శిక్ష విధించిన తర్వాత సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి 30 రోజుల బెయిల్ మంజూరు చేసింది. తీర్పుపై అప్పీల్ చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. అంతకుముందు రోజు సూరత్ కు వచ్చిన రాహుల్ గాంధీకి కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి.

‘షేర్-ఎ-హిందుస్తాన్’ అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 2019లో లోక్ సభ ఎన్నికల ముందు కర్ణాటక కోలార్ లో జరిగిన ర్యాలీలో మోదీ ఇంటిపేరుపై వివాదాస్పద కామెంట్స్ చేశారు. ‘‘ దొంగలందరికి మోదీ అనే ఇంటి పేరు ఎలా వచ్చింది..?’’ అంటూ ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ గుజరాత్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పూర్ణేష్ మోదీ ఫిర్యాదు చేశారు.

జియో, ఎయిర్‌టెల్‌ మధ్య పోటీ. కస్టమర్ల కోసం ఆఫర్ల మీద ఆఫర్లు

జియో, ఎయిర్‌టెల్‌ మధ్య తీవ్రమైన పోటీ నడుస్తోంది. కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఈ 2 సంస్థలు ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్నాయి. 5జీ యూజర్ల కోసం అన్‌లిమిటెడ్‌ డేటాను అందిస్తున్నాయి. జియో ఇప్పటికే ఈ సర్వీసును ప్రారంభించింది. తాజాగా.. ఎయిర్‌టెల్‌ సైతం ఇదే ప్రకటన చేసింది. పోస్ట్‌ పెయిడ్‌ కస్టమర్లు మరియు 239 రూపాయలు అంతకన్నా ఎక్కువ ప్లాన్లతో రీఛార్జ్‌ చేసుకునే ప్రీపెయిడ్‌ కస్టమర్లు ఇకపై అపరిమితంగా డేటా వాడుకోవచ్చని తెలిపింది.

ఇండియాలో అతిపెద్ద టెలికం ఆపరేటర్‌ అయిన జియో ఇటీవల పోస్ట్‌పెయిడ్‌ వినియోగదారుల కోసం ఫ్యామిలీతోపాటు వ్యక్తిగత ప్లాన్లను లాంఛ్‌ చేసింది. ఇందులో భాగంగా అన్‌లిమిటెడ్‌ 5జీ డేటా, వైఫై కాలింగ్‌, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ ప్రయోజనాలు, ఇంటర్నేషనల్‌ రోమింగ్‌ సేవలను కల్పిస్తోంది. ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌-ఐడియా కస్టమర్లను మరియు తన ప్రీపెయిడ్‌ యూజర్లను ఆకర్షించటం ద్వారా ఆదాయం పెంచుకోవాలని ఈ సర్వీసులకు తెర తీసింది. దీంతో జియో పోటీదారులు దిగిరాకతప్పదని విశ్లేషకులు అన్నారు.