NTV Telugu Site icon

Minister KTR: నేడు ఐదు విప్లవాలను తీసుకొచ్చిన రాష్ట్రం తెలంగాణ

Minister Ktr

Minister Ktr

Minister KTR: తెలంగాణ రాష్ట్రం నేడు ఐదు విప్లవాలను తీసుకొచ్చిందని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో పెట్టుబడులకు అపార అవకాశాలున్నాయని తెలిపారు. తొమ్మిదేళ్లలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలను ఇతర రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయన్నారు. హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీలో ఫుడ్‌ కాన్‌క్లేవ్‌-2023 ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు నిరంజన్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో కలిసి మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ సీడ్ బాల్ ఆఫ్ ఇండియాగా ఎదుగుతుందన్నారు. మత్స్య సంపదలో దేశంలోనే నెంబర్‌వన్‌గా ఉన్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం పౌల్ట్రీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని మంత్రి కేటీఆర్ అన్నారు. ఉద్యాన, డెయిరీ రంగాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఉద్యాన విశ్వవిద్యాలయం, వెటర్నరీ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ ప్రభుత్వం గత ఐదేళ్లుగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోందని వెల్లడించారు. దేశ, విదేశాల నుంచి పారిశ్రామికవేత్తలు ఈ రంగంలో పెట్టుబడులు పెడుతున్నారన్నారు.

Read also: Vellampalli Srinivas: ఎంతమంది రజనీకాంత్‌లు వచ్చినా ప్రజలు నమ్మరు..

గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తాము తీసుకొచ్చిన పారిశ్రామిక విధానం టీఎస్ ఐపాస్ పనితీరు చాలా బాగుందని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు నేరుగా ఎవరినీ కలవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకుంటే 15 రోజుల్లో కంపెనీ ఏర్పాటుకు అనుమతులు వస్తాయని తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తే గ్రామీణ ప్రాంతాల నుంచి అవసరమైన ముడిసరుకును అందించేందుకు అధికారులు సహకరిస్తారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సంఘాలు అద్భుతంగా పనిచేస్తున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు.

దళిత బంధు పథకం కింద ఇస్తున్న రూ.10 లక్షలతో నలుగురితో కలిసి రూ.40 లక్షలతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో చిన్న మధ్యతరగతి పారిశ్రామికవేత్తలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని వెల్లడించారు. తెలంగాణలో ఉత్తర, దక్షిణ భారతదేశానికి చెందిన వారు పనిచేస్తున్నారని తెలిపారు. దేశంలోనే అత్యధికంగా వరి పండించే రాష్ట్రం తెలంగాణ అని, పత్తి పండించే రాష్ట్రం కూడా తమదేనని పేర్కొన్నారు. టెక్స్‌టైల్ పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన ముడిసరుకును రాష్ట్రం నుంచే తీసుకుంటామన్నారు. విజయ డైరీ కూడా లాభాల బాటలో కొనసాగుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు.
Vellampalli Srinivas: ఎంతమంది రజనీకాంత్‌లు వచ్చినా ప్రజలు నమ్మరు..