జగిత్యాల జిల్లా వెల్గటూర్ లో నిర్మిస్తున్న కాళేశ్వరం లింక్2 పంపు హౌస్ లో భూములు కోల్పోతున్న భూ నిర్వహసితుల అఖిలపక్షం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రొ.కోదండరాం. మనమందరం న్యాయ పరంగా మన భూముల విషయంలో పోరాడాలన్నారు కోదండరాం. భూమికి బదులు భూమి అయిన లేదా మార్కెట్ రేటు ప్రకారం నష్టపరిహారం అయినా చెల్లించాలని డిమాండ్ చేశారు. మనం భయపడేది లేదని భయపడితే ఆనాడు తెలంగాణ రాకపోయేదని, స్వాతంత్రం కూడా రాకపోయేదన్నారు కోదండరాం.
మీరు ధైర్యంగా ఉంటేనే మీకు న్యాయం జరుగుతుంది. మీరు ధైర్యంగా ఉంటేనే మీకు అండగా మేము ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటాం. మీకు ఎల్లవేళలా మా సహాయ సహకారాలు ఉంటాయని భరోసా ఇచ్చారు. మీరు సంతకాలు పెట్టనంత వరకు భూములు ఎవడూ తీసుకోడు. మనం ఐక్యమత్యంగా ఉంటేనే మనం అనుకున్నది సాధించుకోగలం. మీటింగ్ లు పెట్టుకుంటే అరెస్టు చేయడం సబబు కాదన్నారు. ప్రభుత్వం తరఫున మీరు న్యాయం చేయడం లేదు కాబట్టే మేము భూములు ఇవ్వడం లేదన్నారు. కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు స్నేహితులు భూములు ఎక్కడైనా ప్రాజెక్టులో పోయయా చెప్పాలని కోదండరాం ప్రశ్నించారు.
బలిసిన వారి భూములు తీసుకోరు కానీ బలహీనుడి భూములు మాత్రం బలవంతంగా లాక్కొంటున్న ప్రభుత్వం కేవలం కేసీఆర్ ప్రభుత్వమే అని తీవ్రంగా విమర్శించారు. భూముల్ని ఇవ్వనంటే ఎవరుతీసుకునే చట్టం లేదు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాకే తెలంగాణలో రెండు లక్షలకు పైగా ఎకరాలు ప్రభుత్వం లాక్కుందని, పెద్ద ఎత్తున భూములు కోల్పోతున్న మనం భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత వుందన్నారు. మీకు అండగా వుంటాం.. ధైర్యంగా ముందుకు సాగాలని కోదండరాం పిలుపునిచ్చారు.