Site icon NTV Telugu

Telangana Rain: నేడు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ కేంద్రం వెల్లడి

Telangana Rain

Telangana Rain

Telangana Rain: మండుతున్న ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రాష్ట్రానికి పశ్చిమ, నైరుతి దిశల నుంచి గాలులు వీస్తున్నాయని, దీని ప్రభావంతో నేడు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. నైరుతి రుతుపవనాలు రెండు రోజుల్లో దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల్లోని మరికొన్ని ప్రాంతాల మీదుగా విస్తరించేందుకు అనుకూలంగా ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

ఉత్తర-దక్షిణ ద్రోణి ఆగ్నేయ మధ్యప్రదేశ్ నుండి దక్షిణ అంతర్గత కర్ణాటకకు, విదర్భ మరియు ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో కదులుతోంది. ఇవాళ ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 39 డిగ్రీలు, 26 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉంది. ఉపరితల గాలులు వాయువ్య దిశ నుండి గంటకు 4 నుండి 08 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉంది” అని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

శుక్రవారం వాతావరణం పొడిగా ఉండటంతో సాధారణ ఉష్ణోగ్రత 2 నుండి 4 డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది. రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా 41 డిగ్రీల నుంచి 43 డిగ్రీల వరకు గరిష్టంగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించారు. హైదరాబాద్ పరిసర జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు 38 నుంచి 41 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో బుధవారం 40 డిగ్రీలకు పైగా పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా ఆదిలాబాద్‌లో 42.8 డిగ్రీలు, రామగుండం, నిజామాబాద్‌లో 42.2 డిగ్రీలు, నల్గొండ, ఖమ్మం, హనుమకొండ జిల్లాల్లో 42 డిగ్రీలు, మెదక్‌లో 41.2 డిగ్రీలు, మహబూబ్‌నగర్‌లో 39.9, భద్రాచలంలో 39.4, హైదరాబాద్‌లో 39.4, 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
CM KCR: నేడు సచివాలయంలో కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష.. పాల్గొననున్న కలెక్టర్లు, ఎస్పీ, సీపీలు

Exit mobile version