Site icon NTV Telugu

ఏప్రిల్‌లోనే పరీక్షలు ..ఇంటర్‌బోర్టు నిర్ణయం

తెలంగాణ ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ ఫలితాలకు సంబంధించి విద్యార్థులలో ఆందోళన నెలకొన్నది. ఇప్పటికే విద్యార్థి సంఘాలు ఇంటర్‌ బోర్డును ముట్టడించి నిరసన వ్యక్తం చేస్తున్న వేళ తెలంగాణ ఇంటర్‌ బోర్డ్‌ కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల్లో ఫెయిల్‌ అయినవారికి వచ్చే ఏడాది ఏప్రిల్‌లోనే మరోసారి పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు కార్యదర్శి జలీల్‌ ప్రకటించారు. ఏప్రిల్‌ వార్షిక పరీక్షల్లో మరోసారి పరీక్ష రాయొచ్చని స్పష్టం చేశారు. ఫలితాలపై ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని జలీల్‌ తెలిపారు. అనుమానం ఉంటే ఫీజు చెల్లించి జవాబు పత్రాలు పొందవచ్చని చెప్పారు.

Read Also :రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ కాలేజీల బంద్ కి పిలుపు…

పరీక్షల్లో సిలబస్‌ 70 శాతానికి తగ్గించి, ప్రశ్నల్లో ఛాయిస్‌ పెంచామని చెప్పారు. ఇదిలా ఉంటే తాజాగా విడుదలైన ఫస్ట్‌ ఇయర్‌ ఫలితాల్లో జనరల్‌, ఒకేషనల్‌ కలిపి 49 శాతం మంది విద్యార్థులు మాత్రమే పాసయ్యారు. కరోనా నేపథ్యంలో నేరుగా తరగతులు జరగకపోవడం, ఆన్‌లైన్‌ తరగతులతో విద్యార్థుల్లో గందరగోళం నెలకొనడం, మొదట్లో పరీక్షలను రద్దు చేసి విద్యార్థులను సెకండ్‌ ఇయర్‌కు ప్రమోట్‌ చేయడం, మళ్లీ తిరిగి పరీక్షలను నిర్వహించిన నేపథ్యంలో విద్యార్థులు అయోమయానికి గురయ్యారని, హాజరు శాతం తగ్గడానికి అదే కారణమని వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో తాజాగా ఇంటర్‌ బోర్డ్‌ తీసుకున్న నిర్ణయం విద్యార్థులకు ఊరటనిచ్చింది. గతేడాదితో పోలిస్తే ఏకంగా 11 శాతం ఉత్తీర్ణత తగ్గడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. మొత్తం జనరల్‌, ఒకేషనల్‌ విద్యార్థులు 5.59 లక్షల మందికి 2.24 లక్షల మంది ఉత్తీర్ణులయ్యారు.

Exit mobile version