NTV Telugu Site icon

పోడు భూముల సమస్యకు పరిష్కారం లభించేనా..

పోడు రైతులకు భూమి హక్కు పత్రాలు ఇవ్వాలని తెలంగాణ వచ్చినప్పటి నుంచి గిరిజనులు కోట్లాడుతున్న ప్రభుత్వం ఆదిశగా అడుగులు వేయలేదు. ఎన్నో సార్లు పోడు భూములపై ఇటు ఫారెస్ట్‌ అధికారులకు, గిరిజనులకు మధ్య వాగ్వివాదం నడిచింది. కొన్ని సార్లైతే జైలుకు వెళ్లాల్సి వచ్చింది. గత కొన్ని రోజుల కిందట ఖమ్మంలోని కారేపల్లిలో పోడు సాగు చేస్తున్నందుకు అడ్డుకున్న బాలింత మహిళలపై అధికారులు కేసులు పెట్టి జైలుకు పంపించారు. దీనిపై హ్యుమన్‌రైట్‌ కమిషన్‌, పలు మహిళా సంఘాలు సీరియస్‌ అయ్యాయి. దీంతో వెంటనే వారిని జైలు నుంచి విడుదల చేశారు. హైకోర్టు ఈ ఘటనపై సీరియస్‌ అయింది.

ఇదంతా ఒక ఎత్తయితే ఇప్పుడు తాజాగా కేసీఆర్‌ ప్రభుత్వం రేపు పోడు భూములపై సమీక్షా సమావేశాలు నిర్వహించి ఈ సమస్యను ఒక కొలిక్కి తీసుకు రావాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్ర కరణ్‌ రెడ్డి నేతృత్వంలో శనివారం నిర్మల్‌, ఆదిలాబాద్‌ జిల్లాలో గిరిజనులు, అఖిల పక్ష నేతలతో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలను ప్రభుత్వం సేకరించనుంది. క‌లెక్టర్ కార్యాల‌యంలో నిర్వహించే ఈ స‌మావేశానికి అఖిల ప‌క్ష నేత‌ల‌తో పాటు అట‌వీ, గిరిజ‌న‌, రెవెన్యూ శాఖ‌ల అధికారులు హాజరు కానున్నారు.

ఇప్పటివరకు పోడు భూములను సాగు చేసుకుంటున్న గిరిజనులు తదితరులకు ఆర్వోఎఫ్ఆర్ హక్కులు కల్పిండంతో పాటు, అడ‌వులు అన్యాక్రాంతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ సమావేశంలోనైనా దీనికి శాశ్వత పరిష్కారం లభిస్తే బాగుంటుందని గిరిజనులు కోరుకుంటున్నారు.