Site icon NTV Telugu

రీజినల్‌ రింగ్‌రోడ్డు నిర్మాణానికి మరో ముందడుగు

హైద్రాబాద్‌ నగరం చుట్టూ రీజీనల్ రింగురోడ్డు (RRR) నిర్మాణానికి మరో ముందడుగు పడింది. తొలిదశ నిర్మాణం కోసం భూ సేకరణను ప్రారంభించింది. దీనిపై కేంద్రం భూసేకరణ ప్రక్రియను చేపట్టాల్సిందిగా కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ తెలంగాణ ప్రభుత్వానికి తాజాగా లేఖ రాసింది. సంగారెడ్డి, నర్సాపూర్‌, తూఫ్రాన్‌, గజ్వేల్‌, యాదాద్రి భువనగిరి, చౌటుప్పల్‌ మీదుగా నిర్మించే ఈ మార్గానికి కేంద్రం ఇటీవల ఆమోదం తెలిపింది.

వచ్చే 25-30 ఏళ్ల ట్రాఫిక్‌ అంచనాల మేరకు దీన్ని నిర్మించ నున్నారు. హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌రోడ్డుకు అవతల 338 కిలోమీటర్ల మేర ప్రాంతీయ రింగురోడ్డు నిర్మాణానికి కేంద్రం ఓకే చెప్పింది. వివిధ ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వద్ద ఆయా మార్గాల్లో మార్పులు చేపట్టడానికి కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు అంగీకరించడంతో 157 కిలోమీటర్ల మేర ఉత్తర రహదారి నిర్మాణానికి మార్గం సుగమైంది. దక్షిణ భాగంలో రోడ్డు మార్గాలను ఖరారు చేసేందుకు అధ్యయనానికి అనుమతి లభించాల్సిఉంది.

చౌటుప్పల్‌, చేవేళ్ల, శంకర్‌పల్లి, ఆమన్‌గల్‌, సంగారెడ్డి మీదుగా 181 కిలోమీటర్ల మార్గానకి జాతీయ హోదా లభించాల్సిఉంది. ఇదిలా ఉంటే తొలిదశలో నిర్మాణానికి భూసేకరణకు కేంద్రం అనుమతిచ్చిన నేపథ్యంలో రాష్ర్టంలో ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసి భూసేకరణ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రహదారి మార్గం వెళ్లే ప్రాంతాల్లో ఒక్కో జిల్లాను ఒక్కో యూనిట్‌గా తీసుకోవాలా? లేక నిర్ధారిత కిలోమీటర్లకు ఒక యూనిట్‌ను ఏర్పాటు చేయాలా? అన్న అంశంపై అధికారులు చర్చిస్తున్నారు. సంగారెడ్డి, మెదక్‌, సిద్ధిపేట, యాదాద్రి-భువనగిరి జిల్లాల మీదుగా వెళ్లే ప్రాంతీయ రింగు రోడ్డు నిర్మాణం జరగనుంది. దీనికోసం సుమారు నాలుగు వేల ఎకరాల వరకు భూమిని సేకరించాలని అంచనా.

భూసేకరణ విభాగం ఏర్పాటు తరువాత ఈ మార్గంలో భూమిని కోల్పేయే వారికి ఎంత మొత్తంలో పరిహారం చెల్లించాలన్నది ఆయా జిల్లాల రెవెన్యూ అధికారులతో సంప్రదింపులు నిర్వహించిన తరువాత అధికారులు ఖరారు చేయనున్నారు. భూసేకరణకు అయ్యే వ్యయాన్ని కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు చెరిసమానంగా భరించాలని ఒప్పందం చేసుకున్నాయి. రీజినల్‌ రింగ్‌ రోడ్డు కోసం భూసేకరణను రాష్ర్ట ప్రభుత్వం చేపట్టినప్పటికీ రహదారి నిర్మాణ వ్యవహారాలను కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ పర్యవేక్షించనుంది. భూసేకరణ తర్వాత నిర్మాణ పనుల కోసం టెండర్లను ఆహ్వానించనుంది.

Exit mobile version