NTV Telugu Site icon

వరంగల్‌ భద్రకాళి బండ్‌ అందాలు అదరహో..

వరంగల్ నగరంలో అభివృద్ధి చేసిన ఉద్యానవనం భద్రకాళి ఫోర్‌షోర్ బండ్ అందాలు నగరవాసులనే కాకుండా హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చే సందర్శకులను తన అందాలతో అదరహో అంటూ కట్టిపడేస్తుంది. వారాంతాలు, సెలవులు మరియు పండుగల సమయంలో, భద్రకాళి సరస్సు పరిసర ప్రాంతాలు సందర్శకులతో కిటకిటలాడుతున్నాయి. చారిత్రక భద్రకాళి సరస్సు వద్ద అభివృద్ధి చేసిన థీమ్ పార్క్ అందాలను చూసి సందర్శకులు మంత్ర ముగ్ధులలవుతున్నారు. ఇక్కడ కొలువు దీరిన భద్రకాళీ అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ బండ్‌ అందాలను చూసి తీరాల్సిందే…

కాకతీయ కళా నైపుణ్యం ఉట్టిపడేలా నిర్మాణం..
1.1 కి.మీ పొడవున్న ఈ ఫోర్‌షోర్ బండ్ గ్రీన్ కోలనేడ్‌లు, ఓపెన్-ఎయిర్ జిమ్, ఇథిలీన్ ప్రొపైలిన్ డైన్ మోనోమర్ (EPDM)తో వాకింగ్ ట్రాక్, ప్లేయింగ్ ఏరియా, ఇంటిగ్రేటెడ్ ల్యాండ్‌స్కేప్ లైటింగ్, పార్కింగ్ వంటి సౌకర్యాలతో నిర్మించారు. సుందరమైన లేక్ ఫ్రంట్ ద్వారా KUDA అధికారులు పార్క్‌ నిర్మాణంలో కాకతీయ యుగపు గేట్‌వేలు, శిల్పకళా ఉట్టిపడేలా ఇతర నిర్మాణ సొగబులను ప్రతిబింబించేలా పూర్తి జాగ్రత్తలు తీసుకున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన రబ్బరైజ్డ్ వాకింగ్ ట్రాక్ అందరినీ విశేషంగా ఆకట్టుకుంటుంది. ఆట స్థలాలు చిన్నారులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. తెలంగాణలో హైదరాబాద్‌ తర్వాత రెండో అతిపెద్ద నగరంలో ఇలాంటి థీమ్‌ పార్క్‌ను నిర్మించడంతో వరంగల్‌ నరగర వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రాత్రి పూట దీపాల కాంతుల్లో..
రాత్రిపూట దీపాలంకరణ కట్ట అందాన్ని రెట్టింపు చేస్తుంది. పూల మొక్కలు మహిళలు, చిన్నారులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఈ పార్క్ ఇప్పుడు సెల్ఫీలు, ఫోటో షూట్‌లకు వేదికగా మారింది. ప్రజలు కుటుంబ సభ్యులతో కలిసి పార్కును సందర్శిస్తున్నారు. అంతేకాకుండా చిన్న చిన్న సినిమా షూట్‌లకు ఈ బండ్‌ ఇప్పుడు వేదిక అయింది. భూపాలపల్లికి చెందిన నేహ అనే యువతి మాట్లాడుతూ.. పార్కు చూసేందుకు తన స్నేహితులతో కలిసి స్వగ్రామం నుంచి పార్కుకు వచ్చామని గతంలో వచ్చినప్పుడు ఈ బండ్‌ నిర్మాణ దశలో ఉందని, ఇప్పుడు పూర్తయిన తర్వాత చూసేందుకు వచ్చానని ఇప్పుడు ఎంతో బాగుందని తెలిపింది.రాత్రి పూట విద్యుత్‌ లైట్ల వెలుగులో పక్కనే ఉన్న భద్రకాళీ అమ్మవారి చెరువు ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో అద్భుతంగా ఉందని చెప్పింది.

రూ. 31 కోట్లతో పార్క్‌ అభివృద్ధి..
కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ (కుడా) ఈ పార్కును రూ. 31 కోట్ల నిధులతో అభివృద్ధి చేసినప్పటికీ, కేంద్రం ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్, హెరిటేజ్ సిటీ డెవలప్‌మెంట్ అండ్ ఆగ్మెంటేషన్ యోజన (హృదయ్) హృదయ్‌తోపాటు ఇతర నిధుల కింద ఈ ప్రాజెక్టు కోసం ఖర్చు చేసింది. ఈ ఏడాది సెప్టెంబరు 27నుంచి దీన్ని అందుబాటులోకి తెచ్చినప్పటి నుంచి ఇది ఎంతో మందిని ఆకర్షిస్తుంది.రోజుకు సుమారు 800 నుండి 1,000 మంది సందర్శకులు సందర్శిస్తారని అధికారులు అంచనా వేసినప్పటికీ.. సందర్శకుల సంఖ్య వారం రోజుల్లో సగటున 3000 మందికి పైగా ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. వారంతాల్లో ఈ సంఖ్య రెట్టింపు అవుతుందని తెలిపారు.

కూడా(KUDA) సందర్శకులకు అందుబాటులో రుసుము వసూలు చేస్తుంది. పెద్దలకు రూ.30, చిన్న పిల్లలకు రూ.20గా ప్రవేశ రుసుమును నిర్ణయించారు. దీని నిర్మాణానికి అయిన ఖర్చులో దాదాపుగా రాబట్టుకుంటుందని అధికారులు తెలిపారు. సరస్సులో బోటింగ్‌ను తీసుకువచ్చేందుకు KUDA అధికారులు కృషి చేస్తున్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ ) స్మార్ట్ సిటీ మిషన్ (ఎస్‌సీఎం) ప్రాజెక్టు కింద మరో 2.2 కి.మీ పొడవున బండ్‌ను అభివృద్ధి చేసేందుకు జీడబ్ల్యూఎంసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.