TG TET 2026 : టీచర్లకు గుడ్ న్యూస్.. ప్రత్యేక TG TET-2026-II నోటిఫికేషన్.!

  • ఇన్ సర్వీస్ టీచర్ల కోసం ప్రత్యేక టెట్
  • అక్టోబర్ 7 నుంచి దరఖాస్తుల స్వీకరణ
  • అక్టోబర్ 16 వరకు అప్లై చేసుకునే ఛాన్స్
  • నవంబర్ 16 నుంచి CBT పరీక్షలు
Tg Tet

Tg Tet

తెలంగాణలో పనిచేస్తున్న ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల కోసం పాఠశాల విద్యాశాఖ తీపి కబురు అందించింది. విధుల్లో ఉన్న ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా ‘టీజీ టెట్–2026-II’ (TG TET–2026-II) నోటిఫికేషన్‌ను అధికారికంగా విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలు, స్థానిక సంస్థల పరిధిలోని బడులతో పాటు టీజీఆర్‌ఈఐఎస్ (TGREIS), ప్రభుత్వ సంక్షేమ గురుకుల సొసైటీలు, తెలంగాణ మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న ఇన్ సర్వీస్ టీచర్లకు ఈ పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించారు. వీరితో పాటు వివిధ ఇతర ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు కూడా ఈ ప్రత్యేక టెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని అధికారులు స్పష్టం చేశారు.

అక్టోబర్ 7 నుంచి దరఖాస్తుల స్వీకరణ

ఈ ప్రత్యేక టెట్ పరీక్షకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ అక్టోబర్ 7వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 16వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియతో పాటు పూర్తి వివరాలు, సమాచారం తెలంగాణ పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు.

నవంబర్ 16 నుంచి కంప్యూటర్ ఆధారిత పరీక్షలు

దరఖాస్తు చేసుకున్న ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు నవంబర్ 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలను ఆన్‌లైన్ విధానంలో కంప్యూటర్ ఆధారిత పరీక్షగా (CBT) నిర్వహించనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. నిబంధనల ప్రకారం నిర్ణీత తేదీల్లో ఈ పరీక్షలు జరగనున్నందున ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యాశాఖ సూచించింది.