TG SAFE : పండుగ సీజన్ సమీపిస్తున్న తరుణంలో నగరవాసుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ (TG SAFE), ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు హైదరాబాద్ వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నగరంలోని ‘సియుఆర్ఇ’ (CURE) జోన్ పరిధిలో ఉన్న 12 పేణీల (Peenilu) తయారీ ఖార్ఖానాలపై అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. పండుగ రోజుల్లో విరివిగా అమ్ముడయ్యే ఈ మిఠాయిలను నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా, అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో తయారు చేస్తున్నట్లు ఈ సోదాల్లో స్పష్టంగా వెల్లడైంది.
కనీస పరిశుభ్రత కరువు.. మురికి దుస్తులతో తయారీ
తనిఖీల సందర్భంగా తయారీ కేంద్రాల్లోని దారుణ పరిస్థితులను చూసి అధికారులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పేణీలను తయారు చేసే కార్మికులు కనీస పరిశుభ్రతా నియమాలను పాటించడం లేదని గుర్తించారు. హెయిర్ క్యాప్స్, గ్లోవ్స్ వంటి రక్షణ పరికరాలు లేకుండానే, మురికి దుస్తులు ధరించి, ఒంటి నిండా పట్టిన చెమటతోనే ఆహార పదార్థాలను తయారు చేస్తున్నట్లు అధికారులు తేల్చారు. మరింత దారుణమైన విషయమేమిటంటే.. పేణీల తయారీకి ఉపయోగించే ముడి పదార్థాలను, తయారైన మిఠాయిలను ఏమాత్రం పరిశుభ్రత లేని నేలపైనే ఉంచి విక్రయాలకు సిద్ధం చేస్తున్నట్లు తనిఖీల్లో బయటపడింది.
ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్సులు లేవు.. ప్రదర్శనలోనూ ఉల్లంఘనలు
ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) నిబంధనల ప్రకారం ప్రతీ ఆహార తయారీ కేంద్రానికి చెల్లుబాటయ్యే లైసెన్స్ తప్పనిసరి. అయితే ఈ 12 కేంద్రాల్లో చాలా ఖార్ఖానాలు ఎలాంటి లైసెన్సులు లేకుండానే అక్రమంగా కొనసాగుతున్నట్లు అధికారులు నిర్ధారించారు. లైసెన్సులు ఉన్న కొన్ని సంస్థలు కూడా నిబంధనల ప్రకారం బోర్డులను ప్రదర్శించకుండా ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ కల్తీ, అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాలు తయారు చేస్తున్న నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఫుడ్ సేఫ్టీ చట్టం ప్రకారం నోటీసులు జారీ చేసి భారీ జరిమానాలు విధిస్తామని TG SAFE అధికారులు స్పష్టం చేశారు.

