Cold in Adilabad: తుపాను ప్రభావంతో తెలంగాణలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. గత వారం రోజులుగా నిలకడగా ఉన్న చలిగాలులు గత మూడు రోజుల నుంచి గణనీయంగా పెరగాయి. మంగళ, బుధ,గురువారాలతో పోలిస్తే శుక్రవారం ఉదయం ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. సాయంత్రం 5 గంటల నుంచి చలి క్రమంగా పెరుగుతుండడంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో దీని ప్రభావం తీవ్రంగా ఉంది. ఉదయాన్నే పొగమంచు ప్రధాన రహదారులపై కమ్ముకోవడంతో రాజధానిలోనూ అదే పరిస్థితి నెలకొంది.
హైదరాబాద్‌లో సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు మాండౌస్ తుపాను ప్రభావంతో హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఆదిలాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, కామారెడ్డిలో రానున్న రోజుల్లో చలి తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వృద్ధులు, చిన్న పిల్లలు, ఆస్తమా రోగులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Read also: Himanta Biswa Sarma: ముస్లిం పురుషులకు బహుళ భార్యలు ఉండడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోంది..
తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ రీడింగుల ప్రకారం, కామారెడ్డిలోని డోంగ్లిలో గత 24 గంటల్లో రాష్ట్రంలో అత్యల్ప ఉష్ణోగ్రత 5.9 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఆదిలాబాద్‌లోని పొచ్చెర, బేలలో వరుసగా 7 డిగ్రీల సెల్సియస్, 7.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా.. నిర్మల్ జిల్లాలో 7.7 డిగ్రీలు గా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైంది. కొమురం భీం జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు 8.2 డిగ్రీలుగా నమోదయ్యాయి. మంచిర్యాల జిల్లాలో 9.6గా నమోదు కాగా.. ఇక ఉమ్మడి మెదక్ జిల్లాపై చలి పంజా విసిరుతోంది. సింగిల్ డిజిట్ కి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ లో 6.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అన్నసాగర్ లో 8, సిర్గాపూర్ లో 8.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యాయి. సిద్దిపేట జిల్లా హబ్సిపూర్ లో 7.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా.. మెదక్ జిల్లా చిట్కుల్ లో 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
నిన్న గురువారం ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండలో 10.3 డిగ్రీలు, కొమురంభీం జిల్లా సిర్పూర్‌లో 10.6 డిగ్రీలు, కెరిమెరిలో 10.7 డిగ్రీలు, ఉట్నూర్‌లో 10.8 డిగ్రీలు, బోరాజ్‌లో 11.1 డిగ్రీలు, తిర్యానీలో 11.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మంచిర్యాల జిల్లాలో 11.2 డిగ్రీలు నమోదైంది. అయితే నిన్నటితో పోలిస్తే ఇవాళ భారీగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలితో ప్రజలు వణికిపోతున్నారు. బటకు రావాలంటేనే బాబోయ్ చలి అంటున్నారు.
Mandous : మాండుస్ ఎఫెక్ట్.. విద్యా సంస్థలకు సెలవు..