కృష్ణా, గోదావరి జలాల విషయంలో తెలంగాణ హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఏ పోరాటానికైనా, త్యాగానికైనా సిద్ధమని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సూర్యాపేట జిల్లాలో మాట్లాడిన ఆయన.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1.8 టీఎంసీల నీటిని తరలించుకుపోయేందుకు ప్రయత్నిస్తున్న మాట వాస్తవమేనని, కానీ ఒక్క చుక్క నీటిని కూడా తీసుకెళ్లనివ్వబోమని తేల్చి చెప్పారు.
కేఆర్ఎంబీ, కేంద్రానికి ఫిర్యాదులు
ఆంధ్రప్రదేశ్ జలదోపిడి యత్నాలను అడ్డుకునేందుకు ఇప్పటికే కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)తో పాటు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్లు మంత్రి తెలిపారు. నదీ జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన వాటా కోసం పూర్తిస్థాయిలో పోరాడుతున్నామని, ఒక్క చుక్క జలాన్ని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే కృష్ణా, గోదావరి జలాల్లో మన వాటాను సమర్థవంతంగా వినియోగించుకోగలుగుతున్నామని పేర్కొన్నారు.
ఎల్ నినో ప్రభావం.. తాగునీటి నిల్వలకే ప్రాధాన్యం
ప్రస్తుత ఎల్ నినో పరిస్థితుల నేపథ్యంలో నీటి వినియోగంపై రైతులకు, ప్రజలకు ఉత్తమ్ కీలక సూచనలు చేశారు. ఎల్ నినో కారణంగా యాసంగి సీజన్‌లో వరి సాగు వద్దని సూచిస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకే రిజర్వాయర్లలో నీటిని నిల్వ ఉంచుతున్నామని స్పష్టం చేశారు.
సైనికుడి నిబద్ధతతోనే పనిచేస్తున్నా
గతంలో చైనా సరిహద్దులో సైనికుడిగా పనిచేసిన అనుభవాన్ని గుర్తుచేసుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి.. సరిహద్దులో దేశం కోసం ఎలా పనిచేశానో, ఇప్పుడూ అదే నిబద్ధత, అంకితభావంతో పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నానని అన్నారు. ప్రజల ప్రయోజనాలే పరమావధిగా ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు.

