Site icon NTV Telugu

Telangana : మీ వాహనానికి కొత్త నంబర్ ప్లేట్ లేకపోతే ఏమవుతుందో తెలుసా.?

Hsrp

Hsrp

Telangana : తెలంగాణ రవాణా శాఖ రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమైన నిబంధనను అమల్లోకి తెచ్చింది. ఏప్రిల్ 1, 2019కి ముందు రిజిస్ట్రేషన్ పొందిన అన్ని వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు (HSRP) తప్పనిసరిగా అమర్చుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు తాజాగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తూ సెప్టెంబర్ 30ని తుది గడువుగా ప్రకటించింది. గడువు లోపు నంబర్ ప్లేట్లు మార్చుకోకపోతే వాహన యజమానులపై కేసులు నమోదు చేయడమే కాకుండా, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికేట్ వంటి సేవలు కూడా నిలిపివేయబడతాయని రవాణాశాఖ హెచ్చరించింది.

కొత్త నంబర్ ప్లేట్ అమర్చే బాధ్యత పూర్తిగా వాహన యజమానిదేనని నిబంధనలో పేర్కొన్నారు. ఇకపై HSRP లేని వాహనాలను అమ్మడం, కొనుగోలు చేయడం చట్టరీత్యా అనుమతించబడదు. ప్లేట్ల ధర వాహనం రకాన్నిబట్టి మారుతుంది. ఉదాహరణకు, టూ వీలర్లకు సుమారు రూ.320 నుంచి రూ.380 వరకు, ఫోర్ వీలర్లకు రూ.590 నుంచి రూ.700 వరకు ఖర్చవుతుంది. ఆటో రిక్షాలకు రూ.450 నుంచి రూ.550, కమర్షియల్ వాహనాలకు రూ.1,100 నుంచి రూ.1,500 వరకు చార్జీలు ఉంటాయి. అదనంగా హోమ్ ఇన్‌స్టలేషన్ లేదా డోర్ స్టెప్ సర్వీస్ కోరుకుంటే వేరుగా ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. కలర్ స్టిక్కర్ రూ.50 నుంచి రూ.100 వరకు ఉంటుంది.

ఈ హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ల అమలుకు ముఖ్య కారణాలు నకిలీ నంబర్ ప్లేట్లను నిరోధించడం, వాహన దొంగతనాలను అరికట్టడం, రోడ్డు భద్రతను పెంపొందించడం. ఈ ప్లేట్లలో ప్రత్యేకమైన హోలోగ్రామ్, IND మార్కింగ్ ఉండటంతో వాటిని కాపీ చేయడం అసాధ్యం. అంతేకాకుండా ఇవి కేంద్ర డేటాబేస్‌కు అనుసంధానమై ఉండటంతో వాహనాలను ట్రాక్ చేయడం సులభమవుతుంది. దీని వల్ల ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ల్లో సమస్యలు రాకుండా ఉంటాయి.

HSRP ప్లేట్ల కోసం వాహన యజమానులు డీలర్‌షిప్‌లు లేదా ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోవచ్చు. అయితే సెప్టెంబర్ 30 గడువు లోపు తప్పనిసరిగా కొత్త నంబర్ ప్లేట్ అమర్చుకోవాలని రవాణాశాఖ స్పష్టంచేసింది.

CM Chandrababu: టీటీడీ భక్తులకు గుడ్‌స్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు.. 13 ఎకరాల విస్తీర్ణంలో…

Exit mobile version