రాష్ట్రంలో భవిష్యత్ నీటి ఎద్దడిని నివారించేందుకు , తాగునీటి వృధాను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్టీపీలు (మురుగునీటి శుద్ధి కేంద్రాలు), ట్రీటెడ్ వాటర్ వినియోగంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జల వనరుల పరిరక్షణ, ట్రీటెడ్ వాటర్ వినియోగంపై పలు కఠిన మార్గదర్శకాలను జారీ చేశారు. నవంబర్ 1 నుంచి డిసెంబర్ నాటికి ఈ ఆదేశాలన్నీ క్షేత్రస్థాయిలో కచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మంచి నీటి సమస్య తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, పర్యవేక్షణలో ఎలాంటి నిర్లక్ష్యం వహించొద్దని హెచ్చరించారు.
ప్లాంట్లలో ఏఐ టెక్నాలజీ.. కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానం
ట్రీటెడ్ వాటర్ శుద్ధి ప్రక్రియలో నాణ్యతపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దని సీఎం రేవంత్ రెడ్డి తేల్చిచెప్పేశారు. ట్రీటెడ్ వాటర్ ప్లాంట్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీని విధిగా వినియోగించాలని ఆదేశించారు. ప్రతి ప్లాంట్ దగ్గర ఒక ప్రత్యేక అధికారిని నియమించడంతో పాటు, అన్ని ప్లాంట్లను సమర్థవంతమైన పర్యవేక్షణ కోసం కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానించాలని సూచించారు. అంతేకాకుండా ఈ ప్లాంట్ల నిర్వహణపై హైడ్రా (HYDRAA) మానిటరింగ్ ఉండాలని స్పష్టం చేశారు. ప్లాంట్ల నిర్వహణ వ్యయాన్ని తగ్గించేలా సోలార్ పవర్‌తో వాటిని నడిపే అవకాశాలను కూడా పరిశీలించాలని అధికారులను కోరారు.
ప్రభుత్వ కార్యాలయాలు, ఓఆర్ఆర్ పరిధిలో ట్రీటెడ్ వాటర్ విధిగా వాడాలి
భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని తాగునీటిని కేవలం తాగునీటి అవసరాలకే పరిమితం చేయాలని సీఎం ఆదేశించారు. ఔటర్ రింగ్ రోడ్డుతో (ORR) పాటు వివిధ ప్రాంతాల్లోని ల్యాండ్‌స్కేప్‌లు, రోడ్ల క్లీనింగ్‌కు కేవలం ట్రీటెడ్ వాటర్‌ను మాత్రమే ఉపయోగించాలని స్పష్టం చేశారు. సచివాలయం, సీఎం కార్యాలయ ల్యాండ్స్కేప్లతో పాటు ప్రభుత్వ పబ్లిక్ పార్కుల్లోనూ ఇదే నీటిని వాడాలి. రైల్వే శాఖ, మెట్రో రైల్ విభాగాలను కూడా ఈ పరిధిలోకి తీసుకురావాలని, ప్రభుత్వ కార్యాలయాల్లో ఇతర అవసరాల కోసం వంద శాతం ట్రీటెడ్ వాటర్‌ను వాడటాన్ని తప్పనిసరి చేస్తూ తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించారు.
భవన నిర్మాణ అనుమతుల్లో నిబంధనలు.. ట్యాంకర్ల ట్రాకింగ్
ట్రీటెడ్ వాటర్ వినియోగాన్ని మరింత విస్తృతం చేసేందుకు భవన నిర్మాణ అనుమతులు (బిల్డింగ్ పర్మిషన్స్) మంజూరు చేసే సమయంలోనే ఈ నీటిని వాడాలనే నిబంధన విధించాలని సీఎం సూచించారు. ప్రైవేట్ ఎస్టీపీలను ప్రోత్సహించడంతో పాటు, భారీగా నీటిని వినియోగించే డేటా సెంటర్లకు కూడా ట్రీటెడ్ వాటర్ అందించాలని తెలిపారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచారం నిర్వహించాలని, ట్రీటెడ్ వాటర్ ట్యాంకర్లను ఎప్పటికప్పుడు ట్రాక్ చేసేలా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. అలాగే ట్రీటెడ్ వాటర్ కొనుగోలు లేదా సరఫరా కోసం ప్రత్యేకంగా ఒక టోల్ ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

