Site icon NTV Telugu

Free Bus Journey: సమ్మె వేళ వారికి భారీ ఊరట.. పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం..

Tttttt

Tttttt

తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ (TGSRTC) కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం చేపట్టిన సమ్మె రాష్ట్రవ్యాప్తంగా రవాణా వ్యవస్థను స్తంభింపజేసింది. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో డ్రైవర్లు, కండక్టర్లు విధులకు దూరంగా ఉన్నారు. ఈ క్రమంలో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా కరీంనగర్ డిపోలో టికెట్లు ఇచ్చేవారు లేక పురుషులు కూడా ఉచితంగా ప్రయాణించే అరుదైన పరిస్థితి కనిపిస్తోంది.

కరీంనగర్ డిపోలో ప్రస్తుత పరిస్థితి..

సాధారణంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మహాలక్ష్మి’ పథకం కింద కేవలం మహిళలకు మాత్రమే ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంది. కానీ.. ప్రస్తుత సమ్మె కారణంగా కరీంనగర్ డిపో నుంచి నడిచే ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో పరిస్థితి తలకిందులైంది. రెగ్యులర్ డ్రైవర్లు సమ్మెలో ఉండటంతో అధికారులు ప్రైవేట్ వ్యక్తులతో హైర్ బస్సులు నడుపుతున్నారు. బస్సులను రోడ్లపైకి తెచ్చినప్పటికీ, టికెట్లు జారీ చేసే కండక్టర్లు లేకపోవడంతో అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో టికెట్లు ఇచ్చే నాథుడు లేకపోవడంతో.. మహిళలతో పాటు పురుషులు కూడా పైసా ఖర్చు లేకుండా గమ్యస్థానాలకు చేరుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఎలక్ట్రిక్ బస్సుల మినహాయింపు..

అన్ని బస్సుల్లో ఇదే పరిస్థితి ఉందనుకుంటే పొరపాటే. కరీంనగర్ నుంచి నడిచే ఎలక్ట్రిక్ బస్సుల్లో మాత్రం పాత పద్ధతిలోనే వసూళ్లు సాగుతున్నాయి. ఈ బస్సుల్లో డ్రైవర్లే స్వయంగా టిమ్ (TIM) మిషన్ల ద్వారా టికెట్లు జారీ చేస్తున్నారు. దీనివల్ల ఎలక్ట్రిక్ బస్సుల్లో ప్రయాణించే పురుషులు మాత్రం టికెట్ ధర చెల్లించాల్సి వస్తోంది.

సమ్మె కారణంగా ఆర్టీసీకి భారీగా ఆదాయ గండి పడుతోంది. ఒకవైపు ప్రైవేట్ డ్రైవర్లకు చెల్లింపులు చేస్తూ, మరోవైపు ప్రయాణికుల నుంచి టికెట్ నగదు వసూలు చేయలేకపోవడం సంస్థకు భారంగా మారింది. ఈ గందరగోళం తొలగి రవాణా వ్యవస్థ సాధారణ స్థితికి రావాలంటే ప్రభుత్వం, కార్మిక సంఘాల మధ్య త్వరగా ఒప్పందం కుదరాల్సిన అవసరం ఉంది.

Exit mobile version