SHAKTI : తెలంగాణ ప్రభుత్వం పరిపాలనా సంస్కరణల్లో భాగంగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని “కార్మిక, ఉపాధి, శిక్షణ , కర్మాగారాల శాఖ” (Labour, Employment, Training and Factories Department) పేరును మారుస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ఈ విభాగాన్ని “నైపుణ్య మానవ మూలధనం , జ్ఞాన శిక్షణ కార్యక్రమాల శాఖ” (Department of Skill Human Capital and Knowledge Training Initiatives – SHAKTI) గా పిలవనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు జీవో ఎంఎస్ నంబర్ 97 (G.O.Ms.No:97) ద్వారా ఉత్తర్వులు విడుదల చేశారు.
ఒకే గొడుగు కిందికి విద్యా, సాంకేతిక సంస్థలు
నూతనంగా రూపాంతరం చెందిన ఈ ‘శక్తి’ (SHAKTI) శాఖ పరిధిలోకి యువత నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన పలు కీలక విద్యా సంస్థలను ప్రభుత్వం బదలాయించింది. ఇందులో భాగంగా తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలు.. ఇంతవరకు పరిశ్రమలు, వాణిజ్య శాఖ పరిధిలో ఉన్న ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’ (YISU) సబ్జెక్టును ఇకపై నూతనంగా ఏర్పాటైన ‘శక్తి’ శాఖకు బదిలీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్లు (ITIs) , అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు (ATCs) ఇకపై నేరుగా ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’ సంస్థాగత పరిధిలోకి వస్తాయి. రాష్ట్రంలోని అన్ని పాలిటెక్నిక్ కాలేజీలను కూడా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఎకోసిస్టమ్ , ఫ్రేమ్‌వర్క్ పరిధిలోకి తీసుకువస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
అడ్మిషన్లపై ఎలాంటి ప్రభావం ఉండదు
పరిపాలనా సౌలభ్యం, విద్యా విధానంలో నాణ్యత , యువతకు ఉపాధి నైపుణ్యాలను పారదర్శకంగా అందించాలనే ఉద్దేశంతోనే ఈ భారీ మార్పులు చేసినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, ప్రస్తుతం జరుగుతున్న ఈ అడ్మిషన్ల ప్రక్రియపై కొత్త నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపబోదని ప్రభుత్వం హామీ ఇచ్చింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి పాలిటెక్నిక్ కళాశాలలు, స్కిల్ యూనివర్సిటీల్లో కొనసాగుతున్న ప్రవేశాల ప్రక్రియ యథావిధిగా సాగుతుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ నూతన సంస్కరణలకు అనుగుణంగా ‘తెలంగాణ ఎడ్యుకేషన్ యాక్ట్-1982’, ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ యాక్ట్-2024’ చట్టాలకు అవసరమైన సవరణలు చేయాలని సంబంధిత శాఖలను సీఎస్ ఆదేశించారు.

