CM Revanth Reddy : ఎస్సీ, ఎస్టీల సంక్షేమంలో ముందున్నాం

  • ఎస్సీ వర్గీకరణను అమలు చేసి చూపించాం
  • రాజకీయంగా అత్యధిక అవకాశాలు కల్పించాం
  • పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
Cm Revanth Reddy

Cm Revanth Reddy

ఎస్సీ, ఎస్టీలకు తెలంగాణ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం కల్పిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం MCRHRD లో ఎస్సీ, ఎస్టీల సంక్షేమంపై పార్లమెంటరీ కమిటీ చైర్మన్ డాక్టర్ ఫగ్గన్ సింగ్ కులస్తే గారు, కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు విద్య, ఉపాధి, ఆర్థిక, రాజకీయ రంగాల్లో సముచిత స్థానం కల్పిస్తున్నామని సీఎం కమిటీకి వివరించారు. శాసన సభ స్పీకర్ గా, మంత్రులుగా దళితులకు రాజకీయంగా సముచిత అవకాశం కల్పించామన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ తో పాటు వివిధ కార్పొరేషన్లలో అనేక అవకాశాలు కల్పించామని తెలిపారు. వందేళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఉస్మానియా యూనివర్సిటీ వీసీగా దళితుడికి అవకాశం కల్పించామన్నారు. ఉస్మానియాతో పాటు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, రాజీవ్ గాంధీ ఐఐటీ లలో ఎస్సీ, ఎస్టీలకు వీసీలుగా అవకాశాలు ఇచ్చామని వివరించారు.

అర్హత, అవకాశం ఉన్న ప్రతీచోట ఎస్సీ, ఎస్టీలకు స్థానం కల్పించామని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు విషయంలోనూ వారినే ప్రాధాన్యతగా తీసుకున్నామని వివరించారు. సీఎంఆర్ఎఫ్, ఆరోగ్యశ్రీ నిధులకు సంబంధించి 50 శాతం పైగా ఎస్సీ, ఎస్టీల కోసం ఖర్చు చేస్తున్నట్లు సిఎం తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్సీ వర్గీకరణను అమలు చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ అని గుర్తు చేశారు. వర్గీకరణ అమలు చేయడం, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుపై ముఖ్యమంత్రిని కమిటీ సభ్యులు అభినందించారు. ఈ సమావేశంలో ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీగణేశ్, కమిటీ సభ్యులు తాపీర్ గావ్, హరీశ్చంద్ర మీనా, అనిల్ ఫిరోజియా, అరుణ్ కుమార్, ప్రసాద రావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.