Phone Tapping : తెలంగాణను కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాష్ట్ర స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (SIB) మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇవాళ ఆరోసారి సిట్ విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే ఐదుసార్లు విచారణకు లోనైన ఆయన, ఈసారి కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. గత ప్రభుత్వ హయాంలో పలువురు రాజకీయ నాయకులు, జర్నలిస్టుల ఫోన్‌లను ట్యాప్ చేసినట్లు ప్రస్తుత ప్రభుత్వం స్పష్టమైన ఆధారాలతో నిర్ధారించింది. ఈ వ్యవహారంపై అధికారులు ప్రశ్నిస్తే ప్రభాకర్ రావు పూర్తిగా సహకరించట్లేదని సమాచారం. ఆయన నుంచి వచ్చే సమాచారంపై రాజకీయ పార్టీల నేతల ప్రమేయంపై స్పష్టత రావచ్చని అధికారులు భావిస్తున్నారు.
ఇప్పటి వరకు జరిగిన ఐదు విచారణల్లో ప్రభాకర్ రావు సూటిగా సమాధానాలు ఇవ్వకుండానే తప్పించుకుంటున్నారని తెలుస్తోంది. మావోయిస్టులతో సంబంధాల పేరుతో వందల మంది రాజకీయ నాయకులు, పాత్రికేయుల ఫోన్‌లు ఒకేసారి ట్యాప్ చేయడం వెనుక ఉన్న కారణాలను ప్రశ్నించినప్పటికీ, ఆయన క్లారిటీ ఇవ్వలేదని సమాచారం. అందుకే ఈ వ్యవహారాన్ని సిట్ బృందం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లే అవకాశముంది. ఈ కేసులో ప్రస్తుతం మరికొంతమంది రాజకీయ నాయకుల స్టేట్‌మెంట్లను సిట్ అధికారులు ఇవాళ రికార్డ్ చేయనున్నారు. మొత్తంగా చూస్తే, తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు ఇంకా అనేక మలుపులతో ముందుకు సాగుతోంది.
