NTV Telugu Site icon

KTR on Development: కేటీఆర్ సెటైర్లు.. అక్కడ రోడ్లు, విద్యుత్, నీళ్లు లేవు

Ktr

Ktr

హైదరాబాద్‌లోని మాదాపూర్ హైటెక్స్‌లో క్రెడాయ్ ప్రాపర్టీ షోను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  పక్క రాష్ట్రాలపై సెటైర్లు వేశారు. కొద్దిరోజుల క్రితం తన మిత్రుడు పండగకు పక్క రాష్ట్రం వెళ్లి వచ్చారని.. వచ్చిన తర్వాత తనకు ఫోన్ చేశారని.. అక్కడ నాలుగు రోజులు ఉండగా కరెంట్ లేదని.. నీళ్లు లేవని.. రోడ్లు సరిగ్గా లేవని చెప్పారని కేటీఆర్ వెల్లడించారు. తెలంగాణలోని వాళ్లను నాలుగురోజులు బస్సుల్లో పక్క రాష్ట్రానికి పంపాలని.. అప్పుడు తెలంగాణ ప్రభుత్వం విలువ ఏంటో తెలుస్తుందని కేటీఆర్ అన్నారు. తాను చెప్పడం కాదని.. మన వాళ్లు కూడా ఒకసారి పక్కరాష్ట్రం వెళ్లి చూస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు.

మరోవైపు తెలంగాణను అప్పుల రాష్ట్రం అని ప్రతిపక్షాలు విమర్శిస్తుండటంపైనా కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. అప్పుల తెలంగాణ అని కొందరు అంటున్నారని.. కేసీఆర్ అప్పు చేసిన డబ్బులను నీటి ప్రాజెక్టులు, విద్యుత్ రంగం కోసం ఖర్చు చేశామని.. తాము చేసే అప్పు భవిష్యత్ తరాల మీద పెట్టుబడి అవుతుందని వివరించారు. అప్పుచేసి పప్పు బెల్లాలను పంచితే తప్పు అవుతుందని.. అప్పు చేసి పునరుత్పాదక రంగాల మీద పెట్టుబడి పెడితే తప్పేంటని ప్రశ్నించారు.

111 జీవో ఎత్తివేస్తే ఏదేదో మాట్లాడుతున్నారని.. తన కోసమే 111 జీవో ఎత్తివేశారని ఓ పిచ్చోడు మాట్లాడుతున్నారని.. ఈ జీవోను ఎత్తివేయాలని వైఎస్ఆర్ హయాంలోనే ప్రయత్నించారని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రతి పార్టీ తాము అధికారంలోకి వస్తే 111 జీవోను ఎత్తివేస్తామని ప్రజలకు హామీ ఇచ్చినట్లు కేటీఆర్ గుర్తుచేశారు. గతంలో ఎండాకాలం వస్తే జలమండలి ముందు ధర్నాలు జరిగేవని, ఇప్పుడు హైదరాబాద్‌లో తాగునీటి సమస్య లేకుండా చేశామని కేటీఆర్ వెల్లడించారు. గతంలో ఏ పండుగ వచ్చినా అల్లర్లు జరిగేవి, తెలంగాణ వచ్చిన తర్వాత కుల, మత అల్లర్లు లేవని పేర్కొన్నారు.