Site icon NTV Telugu

KTR: ప్రధాని మోడీ, అమిత్‌షాపై కేటీఆర్‌ సెటైర్లు..

Ktr

Ktr

ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాపై మరోసారి సోషల్‌ మీడియా వేదికగా సెటైర్లు వేశారు తెలంగాణ మంత్రి కేటీఆర్.. ఓవైపు పెరిగిపోతున్న పెట్రో ధరలు.. మరోవైపు హిందీ భాషపై చేసిన వ్యాఖ్యలపై వ్యంగాస్త్రాలు విసిరారు.. ప్రధాని మోడీ నాయకత్వంలో ప్రపంచంలో పెట్రోలు, డీజిల్ ధరల్లో దేశం అగ్రస్థానంలోకి దూసుకెళ్లిందంటూ ఎద్దేవా చేసిన ఆయన.. కొనుగోలు శక్తి సమానత్వం అంచనా ఆధారంగా ప్రపంచంలో భారత్‌లో ఎల్‌పీజీ ధరలు అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు.. ఇక, పెట్రోలు ధరలు అధికంగా ఉన్న దేశాల్లో ప్రపంచంలోనే భారత్‌ టాప్‌ 3లో ఉందన్న ఆయన.. డీజిల్ ధరల్లో 8వ స్థానంలో ఉందంటూ దుయ్యబట్టారు.

Read Also: Chandrababu: కరెంట్ పీకుతున్న జగన్‌ను.. పవర్‌ నుంచి పీకేందుకు..!

ఇక, హిందీ భాషపై అమిత్‌షా తాజాగా చేసిన వ్యాఖ్యలను సైతం వదలకుండా ఘాటుగా కౌంటర్‌ ఇచ్చారు కేటీఆర్.. తాను మొదట భారతీయుడ్ని అయినందుకు గర్వపడుతున్నాను.. ఆ తర్వాత తెలుగువాడ్ని… తదుపరి తెలంగాణవాసినంటూ పేర్కొన్న ఆయన.. తాను మాతృభాష తెలుగులో మాట్లాడతాను.. ఆ తర్వాత ఆంగ్లం, హిందీ, కొంచెం ఉర్దు భాషలో కూడా మాట్లాడతానని చెప్పుకొచ్చారు.. అంతే, కానీ… ఆంగ్ల భాషకు ప్రత్యామ్నాయంగా హిందీ మాట్లాడాలంటూ మాపై రుద్దడం ఆపాలంటూ కౌంటర్‌ ఇచ్చారు కేటీఆర్. భారతదేశంలో ఈ తరహా వ్యాఖ్యలు సరికాదని హితవు పలికారు. భిన్న భాషలు, సంస్కృతి, సంప్రదాయాలకు నిలయమైన సువిశాల భారతదేశంలోని వేరువేరు రాష్ట్రాల ప్రజలు హిందీ భాషలోనే మాట్లాడుకోవాలనడం ఆపాలని సూచించిన కేటీఆర్.. తక్షణమే అమిత్‌షా తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు మంత్రి కేటీఆర్.

Exit mobile version