తెలంగాణలో వరుసగా నోటిఫికేషన్లు రాబోతున్నాయి.. ఇప్పటికే ఏ జిల్లాలో.. ఏ విభాగంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.. ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసేది కూడా అసెంబ్లీ వేదికగా ప్రకటించారు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. దీంతో విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్నారు.. ఇక కొందరు ప్రజా ప్రతినిధులు ఆయా ప్రాంతాల్లో ఫ్రీ కోచింగ్ సెంటర్లను కూడా ప్రారంభిస్తున్నారు.. ఇవాళ పీర్జాదిగూడ మున్సిపాలిటీలో నిరుద్యోగుల కోసం మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత కోచింగ్ సెంటర్‌ను ప్రారంభించారు మంత్రి కేటీఆర్.. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు కీలక సూచనలు చేశారు. 6 నెలలు సినిమాలకు దూరంగా ఉండండని సూచించిన ఆయన.. క్రికెట్ కూడా తక్కువ చూడండి.. ఫోన్లో వాట్సాప్, ఫేస్బుక్, ఇన్‌స్టాలను కూడా బంద్ చేయండి.. చదువుపై దృష్టి పెట్టాలన్నారు.. ఫోన్ తక్కువగా వాడితేనే లాభం ఉంటుందన్న ఆయన.. మీ తల్లిదండ్రులను సంతోషపెట్టే విధంగా భవిష్యత్‌కు ప్రణాళికలు వేసుకోవాలంటూ సూచనలు చేశారు మంత్రి కేటీఆర్.
Read Also: Vaccination: గుడ్‌న్యూస్.. 12 నుంచి 14 ఏళ్ల పిల్లలకు ఎల్లుండి నుంచే..
ఇక, కేంద్రంలో 15,62,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, వాళ్ళు కూడా నింపక తప్పదన్నారు కేటీఆర్.. ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగం ఒకటే కాదన్న ఆయన.. ప్రభుత్వం ఇవన్నీ మీ కోసమే చేస్తుంది.. పోటీతత్వంతో కష్టపడితే కచ్చితంగా ఉద్యోగం వస్తుందన్నారు.. రాష్ట్రంలో 19 వేలు పరిశ్రమలు వచ్చాయి.. స్థానికులకు ఉద్యోగాలు ఇస్తే సంస్థలకు రాయితీలు ఇస్తున్నామన్న ఆయన.. 90 వేలు ఉద్యోగాలకు సీఎం కేసీఆర్ ప్రకటన చేసిన నాలుగు రోజుల్లోనే కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు.. కోచింగ్ సెంటర్లో ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయన్న ఆయన.. 3 నుంచి 4 నెలల పాటు ఈ కోచింగ్ సెంటర్ కొనసాగుతుంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు క్లాసులు కొనసాగుతాయి. మధ్యాహ్న భోజనంతో పాటు స్నాక్స్ కూడా ఇవ్వనున్నారని తెలిపారు.. ఇదే సమయంలో.. ఒక లైబ్రరీని ఏర్పాటు చేయాలని నిర్వాహకులకు సూచించారు కేటీఆర్.. తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో కరోనా కంటే ముందు టీ శాట్ ద్వారా విద్య, నిపుణ చానెల్‌ను ప్రారంభించామని గుర్తుచేసిన ఆయన.. యూట్యూబ్‌లో కూడా ఈ చానెల్స్ అందుబాటులో ఉన్నాయి. మంచి కంటెంట్ ఈ చానెల్లో లభ్యమవుతుందన్నారు. ఈ చానెల్‌ను వాడుకోవాలని సూచిస్తున్నాను. మీ కోసమే ప్రభుత్వం ఇన్ని రకాల కార్యక్రమాలు తీసుకుంటుందని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్.