MeeSeva : మీసేవ సర్టిఫికెట్లలో కొత్త మార్పు.. ఇక లామినేషన్ అవసరం లేదు

  • 15 భద్రతా ఫీచర్లతో కొత్త సర్టిఫికెట్ల రూపకల్పన
  • తడిసినా, చినిగిపోకుండా ఉండేలా ప్రత్యేక పేపర్
  • ప్రజాభవన్‌లో కొత్త విధానాన్ని ప్రారంభించిన శ్రీధర్‌బాబు
  • నకిలీ సర్టిఫికెట్లకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యం
Meeseva

Meeseva

ప్రజాప్రయోజనాల దృష్ట్యా పౌరులకు అందించే సేవలను మరింత సులభతరం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు ముందుకు వేసింది. మీసేవ కేంద్రాల ద్వారా జారీ చేసే వివిధ రకాల ధ్రువపత్రాలను (సర్టిఫికెట్లు) ఇకపై మరింత పటిష్టంగా , ఎక్కువ కాలం మన్నేలా ప్రత్యేకమైన నాణ్యతతో అందించనున్నారు. ఎంతో భద్రంగా, ఏళ్ల తరబడి భద్రపరుచుకునేలా రూపొందించిన ఈ కొత్త పేపర్ విధానాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ప్రజాభవన్‌లో లాంఛనంగా ప్రారంభించారు.

15 అత్యాధునిక భద్రతా ఫీచర్లు.. లామినేషన్ అవసరం లేని ప్రత్యేకత

సాధారణంగా ప్రజలు తమ ముఖ్యమైన ధ్రువపత్రాలు పాడవకుండా ఉండటానికి వాటిని లామినేషన్ చేయించుకోవడం పరిపాటి. అయితే ఈ కొత్త విధానం ద్వారా జారీ చేసే సర్టిఫికెట్లకు ఇకపై ఎలాంటి లామినేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉండదని అధికారులు స్పష్టం చేశారు. సుమారు 15 రకాల అత్యాధునిక భద్రతా ఫీచర్లతో ఈ కొత్త పేపర్‌ను ప్రత్యేకంగా తయారు చేశారు. దీనివల్ల ఈ సర్టిఫికెట్లు ఎంతకాలమైనా చినిగిపోకుండా, ఒకవేళ నీటిలో తడిసినా కూడా ఎలాంటి చెరుపుకు గురికాకుండా అత్యంత సురక్షితంగా ఉంటాయి. పౌరులకు అందించే సేవల్లో నాణ్యతను పెంచడంతో పాటు నకిలీ సర్టిఫికెట్లకు అడ్డుకట్ట వేయడంలో ఈ కొత్త భద్రతా ప్రమాగాలు ఎంతగానో దోహదపడతాయని ప్రభుత్వం భావిస్తోంది.