Site icon NTV Telugu

Local Body Elections : నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది.. 395 గ్రామాల్లో ఏకగ్రీవం..

Local Body Elections

Local Body Elections

Local Body Elections : తెలంగాణలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో, బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితాను ఎన్నికల అధికారులు విడుదల చేశారు. మొత్తం 4,236 గ్రామాలకు నోటిఫికేషన్ ఇవ్వగా, 22,330 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఉపసంహరణలు, బుజ్జగింపుల తరువాత 395 గ్రామాలు ఏకగ్రీవం అయినట్టుగా అధికారులు ప్రకటించారు. వీటిలో వికారాబాద్ జిల్లా 39 గ్రామాలతో అత్యధిక ఏకగ్రీవాలు నమోదు చేసింది. ఆదిలాబాద్ జిల్లాలో 33 గ్రామాలు ఏకగ్రీవం కాగా, ఇది రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచింది.

అత్యల్ప ఏకగ్రీవాలు నమోదైన జిల్లాలుగా కరీంనగర్ (3 గ్రామాలు), అలాగే హనుమకొండ, జగిత్యాల, పెద్దపల్లి (ప్రతి జిల్లా 4 గ్రామాలు) నిలిచాయి. మరోవైపు ఐదు గ్రామాల్లో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాకపోవడంతో, ఆ గ్రామాలపై ఎన్నికల కమిషన్ త్వరలో నిర్ణయం తీసుకోనుంది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాక, మొదటి విడతలో 3,836 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో.. సర్పంచ్ పదవికి 13,127 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 37,440 వార్డులకు ఎన్నిక నిర్వహించాల్సి ఉండగా, 27,960 వార్డులకు మాత్రమే ఎన్నిక జరగనుంది.

మిగిలిన 9,331 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. సర్పంచ్ పదవికి దాదాపు 22,000 నామినేషన్లు దాఖలు కాగా, 8,095 మంది అభ్యర్థులు ఉపసంహరణ దాఖలు చేశారు. మొత్తం 4,236 గ్రామాలకు నోటిఫికేషన్ జారీ చేసిన మొదటి విడతలో, 395 ఏకగ్రీవాలు, మిగిలిన 3,836 గ్రామాలకు ఈ నెల 11న ఎన్నికలు జరగనున్నాయి. ఇలా ఎన్నికల ప్రక్రియ సక్రమంగా పూర్తికావడంతో, రాబోయే వారం రోజులపాటు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగనుంది.

Airtel Annual Plan: ఏడాది వ్యాలిడిటీతో ఎయిర్‌టెల్ వార్షిక ప్లాన్.. రూ. 2,249కే.. బెనిఫిట్స్ ఇవే

Exit mobile version