Site icon NTV Telugu

గెజిట్ అమలు వాయిదా వేయాలి.. తెలంగాణ డిమాండ్..

Rajat Kumar

Rajat Kumar

తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలకు తెరదించాలన్న ఉద్దేశంతో కృష్ణానది యాజమాన్యబోర్డు, గోదావరి నది యాజమాన్య బోర్డుల పరిధిని నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం.. దీనిపై గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.. ఈ నెల 14వ తేదీ నుంచి అమలు చేయాలని నిర్ణయించింది.. ఇప్పటికే రెండు బోర్డులు దీనిపై కసరత్తు చేస్తున్నాయి.. అయితే.. ఈ నెల 14వ తేదీ నుంచి అమల్లోకి రానున్న గెజిట్ నోటిఫికేషన్ అమలు వాయిదా వేయాలని కోరుతోంది తెలంగాణ ప్రభుత్వం… గోదావరి నదిపై ఉన్న పెద్దవాగు బోర్డ్ పరిధిలోకి వెళ్తుందని.. జీఆర్‌ఎంబీ సమావేశంలో ఈ రోజు చర్చిస్తామని తెలిపారు తెలంగాణ ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్.. పెద్దవాగు పరిధిలో 2 వేల ఎకరాలు తెలంగాణకు, 13 వేల ఎకరాల ఆయకట్టు ఏపీకి ఉందన్న ఆయన.. ఏపీ కోరుతున్నట్టుగా మిగతా ప్రాజెక్టులు బోర్డ్ పరిధిలోకి ఇప్పట్లో కుదరదు అన్నారు.

ఇక, ప్రాజెక్టులకు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయన్నారు రజత్‌ కుమార్… రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వీటిపై కేంద్రాన్ని స్వయంగా కలిసి గడువు కావాలని విన్నవించారని తెలిపిన ఆయన.. ప్రస్తుతం గోదావరి బోర్డ్ పరిధిలోకి ఒక్క పెద్దవాగు మాత్రమే వెళ్తుందని వెల్లడించారు.. ఇక, సబ్ కమిటీ నివేదికలపై ఈ రోజు జరిగే సమావేశంలో చర్చిస్తామని తెలిపారు. కాగా, ఇవాళ గోదావరి నది యాజమాన్య బోర్డు సమావేశంలో జరగనున్న సంగతి తెలిసిందే.. ఈ నెల 14 నుంచి గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలులోకి తేవాలన్న ప్రయత్నాలకు ప్రాధాన్యత సంతరించుకుంది.

Exit mobile version