NTV Telugu Site icon

జీఆర్‌ఎంబీకి తెలంగాణ లేఖ.. కాలయాపన చేయొద్దు..!

జల వివాదాల విషయంలో లేఖల పరంపర కొనసాగుతూనే ఉంది.. కృష్ణా నది యాజమాన్య బోర్డుకే కాదు.. గోదావరి నది యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ)కి కూడా లేఖలు రాస్తున్నారు.. తాజాగా, జీఆర్ఎంబీ చైర్మన్‌కు లేఖరాశారు తెలంగాణ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళిధర్.. తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన ప్రాజెక్టుల డీపీ‌ఆర్‌లను ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 ప్రకారమే పరిశీలించి కేంద్ర జల సంఘానికి నివేదించాలని కోరుతూ 26.10.2021న లేఖ రాశామని.. చౌటుపల్లి హన్మంతరెడ్డి ఎత్తిపోతల పథకం, ముక్తేశ్వర (చిన్న కాళేశ్వరం) ఎత్తిపోతల పథకం, తుపాకుల గూడెం, సీతారామ ఎత్తిపోతల పథకం, మోడికుంట వాగు ప్రాజెక్టులు కొత్తవి కావని.. ఉమ్మడి రాష్ట్రం ఆమోదించి ప్రారంభించిన ప్రాజెక్టులు కాబట్టి ఈ ప్రాజెక్టులు విభజన చట్టం క్లాజు 85 (8) (d) పరిధిలోకి కూడా రావని లేఖలో పేర్కొన్నారు.

ఇక, ఈ ప్రాజెక్టులకు కేటాయించిన నీరు ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ ప్రాజెక్టులకు కేటాయించిన 967.94 టీఎంసీలలోనే భాగంగా ఉన్నాయని పేర్కొన్న తెలంగాణ ఈఎన్సీ.. ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో నీటి కేటాయింపులు ఉన్న ప్రాజెక్టులకు ఏవిధమైన ప్రభావాన్ని కలిగించవు అన్నారు.. కేంద్ర ప్రభుత్వం 15.07.2021న జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్ లో పైన పేర్కొన్న ప్రాజెక్టులను ఆమోదం పొందని ప్రాజెక్టుల జాబితాలో చేర్చారని.. వీటికి 6 నెలల్లో కేంద్ర ప్రభుత్వ ఆమోదం పొందాలని నిర్దేశించిందని గుర్తుచేశారు.. ఈ ప్రాజెక్టులన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందే ఉమ్మడి రాష్ట్రం చేపట్టినవి కనుక ఈ ప్రాజెక్టుల డీపీ‌ఆర్‌లలో ఇరిగేషన్ ప్లానింగ్, అంచనా విలువలు, డిజైన్, నీటి లభ్యత తదితర సాంకేతిక అంశాలను పరిశీలించే పరిధి చట్టం ప్రకారం జీఆర్‌ఎంబీకి లేదని లేఖలో పేర్కొన్నారు. ఈ అంశాలను పరిశీలించడానికి కేంద్ర జల సంఘంలో ప్రత్యేకమైన డైరెక్టరేట్లు ఉన్నాయని సూచించారు.. కేఆర్‌ఎంబీ గతంలో రాయలసీమ లిఫ్ట్ పథకాన్ని పరిశీలించటానికి నేరుగా కేంద్ర జల సంఘానికి పంపించింది. డీపీ‌ఆర్ ల పరిశీలనలో రెండు నదీ బోర్డ్ లు భిన్నమైన పద్ధతులను అనుసరిస్తున్నాయని.. పూర్తి అయిన లేదా కొనసాగుతున్న ప్రాజెక్టుల డీపీ‌ఆర్ లకు సాంకేతిక అనుమతులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర జల సంఘానిదే.. కానీ, బోర్డులది కాదన్నారు. రెండవ ఆపేక్స్ కౌన్సిల్ మీటింగ్ లో కూడా కేంద్ర జల శక్తి మంత్రి డీపీ‌ఆర్ లను త్వరితగతిన పరిశీలించి ఆమోదం తెలుపుతామని హామీ ఇచ్చారు.. కాబట్టి గోదావరి ప్రాజెక్టుల డీపీఆర్‌లను కాలయాపన చేయకుండా వెంటనే కేంద్ర జల సంఘానికి నివేధించాల్సిందిగా లేఖలో కోరింది తెలంగాణ ఈఎన్సీ.