High Court of Telangana: హైకోర్టులో ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలకు స్వల్ప ఊరట

  • ప్రైవేట్ కాలేజీలకు తాత్కాలిక ఉపశమనం
  • ఫీజు రీఇంబర్స్‌మెంట్ బకాయిలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కోర్టు
  • ఆగస్ట్ 15లోపు బకాయిలు చెల్లిస్తామని హామీ
  • విద్యార్థుల ప్రయోజనాలపై హైకోర్టు దృష్టి
Highcourt Telangana

Highcourt Telangana

High Court of Telangana: తెలంగాణలోని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం (హైకోర్టు)లో స్వల్ప ఊరట లభించింది. విద్యార్థుల నుండి ఫీజులు వసూలు చేయవద్దంటూ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘జీవో నంబర్ 9’ (GO 9) లోని కొన్ని మార్గదర్శకాలపై హైకోర్టు స్టే విధించింది. ఈ వివాదంపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. వచ్చే మంగళవారం వరకు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు

విచారణ సందర్భంగా ఫీజ్ రీఇంబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపులపై హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నించింది. “మీరు కాలేజీలకు ఇవ్వాల్సిన బకాయిలను చెల్లించరు.. అటు విద్యార్థుల నుండి ఫీజులు వసూలు చేయవద్దని కాలేజీలను ఆదేశిస్తే, ఇక వారు విద్యాసంస్థలను ఎలా నడుపుతారు?” అని కోర్టు నిలదీసింది. ఫీజ్ రీఇంబర్స్‌మెంట్ కోసం బడ్జెట్‌లో ఎంత మొత్తాన్ని కేటాయించారో చెప్పాలని ఆదేశించింది. బడ్జెట్ సమావేశాలు ముగిసినా బకాయిలను ఎందుకు విడుదల చేయలేదని, పెండింగ్ నిధులను ఎప్పటిలోగా చెల్లిస్తారో స్పష్టం చేయాలని ప్రభుత్వాన్ని కోరింది.

ఆగస్ట్ 15 లోపు క్లియర్ చేస్తాం: ప్రభుత్వ న్యాయవాది

హైకోర్టు ప్రశ్నలకు ప్రభుత్వ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. రాబోయే ఆగస్ట్ 15 లోపు ఫీజ్ రీఇంబర్స్‌మెంట్‌కు సంబంధించిన బకాయిలన్నీ క్లియర్ చేస్తామని కోర్టుకు వివరించారు. దీనిపై ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు స్పందిస్తూ.. ప్రభుత్వం అన్నట్లుగా ఆగస్ట్ 15 లోపు బకాయిలన్నీ పూర్తిగా చెల్లిస్తే, తాము దాఖలు చేసిన పిటిషన్లన్నింటినీ అదే రోజున వెనక్కి (విత్ డ్రా) తీసుకుంటామని న్యాయస్థానానికి తెలిపారు.

నలిగిపోతున్న విద్యార్థులు.. కోర్టును ఆశ్రయించిన బాధితులు

ఈ వివాదంలో తాము కూడా భాగస్వామ్యులవుతామంటూ (ఇంప్లీడ్) పలువురు విద్యార్థులు కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. విద్యార్థుల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. అటు ప్రభుత్వం, ఇటు కాలేజీ యాజమాన్యాల మధ్య అసలు తప్పు లేని విద్యార్థులు నలిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చే బకాయిల ఆలస్యం కారణంగా ప్రస్తుతం 2, 3, 4వ సంవత్సరాలు చదువుతున్న విద్యార్థులు నష్టపోకుండా చూడాలని కోరారు. అలాగే ప్రభుత్వ నిబంధనలు లేదా ఉత్తర్వులు ఏవైనా ఉంటే, అవి ఈ ఏడాది కొత్తగా జాయిన్ అయ్యే విద్యార్థులకే వర్తించేలా చూడాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఈ కేసులో తదుపరి వాదనలను మంగళవారం అడ్వకేట్ జనరల్ స్వయంగా వినిపిస్తారని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలపడంతో, హైకోర్టు తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.