Health director srinivasrao: ప్రభుత్వ అధికారి ఏది మాట్లాడినా ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. అయితే ఈ విషయాన్ని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు మరిచిపోతున్నారా? ఏ మీటింగ్ లో పాల్గొన్నా ఆయన మాటలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. తాజాగా ఆయన మాట్లాడిన మాటలు మరోసారి చిక్కుల్లో పడేశాయి. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ఆయన మరోసారి అలాంటి పనే చేశారు. తాయత్తు వల్లే తాను బతికి ఉన్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక అధికారిక హోదాలో ఉండి.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై అభ్యంతరాలు వస్తున్నాయి.
ఖమ్మం జిల్లాలో జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న శ్రీనివాస్ రావు… ఆపై మైక్ అందుకున్నారు. చిన్నతనంలో తాయత్తు వల్లే తాను బతికి ఉన్నానని, ఈస్థాయికి వచ్చానని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు చేస్తూ… ఇఫ్తార్ విందులో చాలా సంతోషంగా కనిపించారు. కాగా ఆయన మూఢనమ్మకాలను ఎందుకు ప్రోత్సహిస్తున్నారని హేతువాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హెల్త్ డైరెక్టర్ హోదాలో ఉంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తారా? అని హేతువాదులు మండిపడుతున్నారు. అంతేకాకుండా.. శ్రీనివాసరావు రాజకీయాల్లోకి వస్తారని గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ ఎపిసోడ్‌లో పొలిటికల్ ఎంట్రీపై ఆయన చేసిన వ్యాఖ్యలు.. ప్రజా సేవే నిజమైన రాజకీయం అని తెలిపారు. కేసీఆర్, కొత్తగూడెం ప్రజలు ఆశీర్వదిస్తే వచ్చే ఎన్నికల్లో కొత్తగూడెంలో పోటీ చేస్తానన్నారు.
శ్రీనివాస్ రావు గతంలో కూడా కరోనా విషయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డారు. గతేడాది డిసెంబర్‌లో కొత్తగూడెంలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఆయన.. ఏసుక్రీస్తు దయ వల్లే కరోనా మహమ్మారి ప్రభావం తగ్గిందని అన్నారు. మనం చేసిన సేవల వల్ల కరోనా తగ్గలేదని… ఏసు ప్రభువు దయ వల్లనే కరోనా తగ్గుముఖం పట్టిందని అన్నారు. మన దేశానికి ఆధునిక వైద్యం, విద్యను తీసుకొచ్చింది క్రైస్తవులేనని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో కొందరు ఆయనపై మండిపడ్డారు. ఒక హెల్త్ డైరెక్టర్ అయివుండి ఇలాంటి మాటలు మాట్లాడటం ఏంటని ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు తాజాగా అంతా తాబీజ్ మహిమ అంటూ మాట్లాడిన మాటలు దుమారం రేపుతున్నాయి.
Karimnagar Farmer: నీకు దండం పెడతా దిగన్నా.. రైతుని ప్రాధేయపడ్డ కానిస్టేబుల్