Site icon NTV Telugu

ఇంట్లో కూడా మాస్కు ధరించాల్సిందే: తెలంగాణ హెల్త్ డైరెక్టర్

తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో తెలంగాణ ఒమిక్రాన్ కేసుల సంఖ్య 9కి చేరింది. తాజాగా హన్మకొండ, హైదరాబాద్ చార్మినార్ ప్రాంతాలలో కొత్త కేసులు నమోదయ్యాయని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. శంషాబాద్ విమానాశ్రయంలో సేకరించిన నమూనాల్లో 9మందికి ఒమిక్రాన్ నిర్ధారణ అయిందన్నారు. వీరిలో 8 మంది రాష్ట్రంలోకి ప్రవేశించారని, మరో వ్యక్తి పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందినవాడన్నారు. ఇప్పటివరకు సామాజిక వ్యాప్తి జరగలేదని స్పష్టం చేశారు.

Read Also: హ‌న్మ‌కొండ‌లో ఒమిక్రాన్ క‌ల‌క‌లం..ఓ మ‌హిళ‌కు పాజిటివ్‌

ఒమిక్రాన్ సోకడానికి వ్యాక్సిన్ తీసుకోకపోవడం కూడా ఒక కారణమని తెలంగాణ డీహెచ్‌ శ్రీనివాసరావు అన్నారు. యూకేలో టీకా తీసుకోని వారిలో మాత్రమే ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. జ్వరం, తలనొప్పి, ఒళ్లునొప్పులు, దగ్గు, నీరసం లాంటి లక్షణాలు కనిపిస్తే టెస్టులు చేయించుకోవాలన్నారు. కొద్ది వారాల పాటు ఇంట్లో కూడా మాస్కు ధరించాలని సూచించారు. గాలి, వెలుతురు వచ్చేలా తలుపులు, కిటికీలు తెరుచుకోవాలని హితవు పలికారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని… రాష్ట్రంలో ఎలాంటి లాక్‌డౌన్‌లు, ఆంక్షలు ఉండవని స్పష్టం చేశారు. అయితే నిర్లక్ష్యంగా మాత్రం ఉండొద్దన్నారు. ఇంకా తెలంగాణలో 28 లక్షల మంది సెకండ్ డోస్ వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉందన్నారు.

Exit mobile version