హైదరాబాద్ రాజ్‌భవన్‌లో 73వ రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను పబ్లిక్ గార్డెన్స్ నుంచి రాజ్‌భవన్‌కు మార్చారు. ఈ సందర్భంగా రాజ్‌భవన్‌లో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఎస్ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ప్రసంగించారు. ముందుగా రాష్ట్ర ప్రజలకు, ఫ్రంట్ లైన్ వారియర్లకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. రాజ్యాంగ నిర్మాతలకు నివాళి అర్పిస్తున్నట్లు ఆమె తెలిపారు. ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగం మనదని గవర్నర్ తెలిపారు. గణతంత్ర దినోత్సవ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. కరోనా నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియలో ప్రపంచంలోనే భారత్ ముందున్నందుకు తనకు ఎంతో గర్వంగా ఉందని పేర్కొన్నారు. త్వరలోనే భారత్ 200 కోట్ల డోసుల మైలురాయిని చేరుకోనుందని వెల్లడించారు. అటు తెలంగాణ రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా ఎదిగిందని… తెలంగాణను ముందు వరుసలో నిలిపిన రైతులకు గవర్నర్ కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ మెడికల్ హబ్ కావడం ఎంతో సంతోషించదగ్గ విషయమని గవర్నర్ అభిప్రాయపడ్డారు. రాజ్‌భవన్‌లో జాతీయ పతాక ఆవిష్కరణకు ముందు వార్ మెమోరియల్ వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అమరవీరులకు గవర్నర్ తమిళిసై నివాళులు అర్పించారు.
