NTV Telugu Site icon

MIT: తెలంగాణ అమ్మాయి సుచరిత.. కొత్త చరిత్ర..

Sucharitha Manyala

Sucharitha Manyala

తెలంగాణ అమ్మాయి సుచరిత మన్యాల కొత్త చరిత్ర సృష్టించింది. మహబూబ్‌ నగర్‌ నుంచి మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ టెక్నాలజీ (మిట్‌) వరకు ప్రస్థానం కొనసాగించింది. కేంబ్రిడ్జ్‌(అమెరికా)లోని ఆ సంస్థలో సీటు సంపాదించటమే గొప్ప అనుకుంటే అందులోనూ ‘సిస్టమ్‌ డిజైన్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌’ కోర్సును ఇటీవలే సక్సెస్‌ఫుల్‌గా పూర్తిచేయటం విశేషం. ఈ రెండింటినీ సాధించటం ద్వారా ఆమె లింగ వివక్షను విజయవంతంగా అధిగమించారు. మహిళా సాధికారతకు వారధిగానూ నిలిచారు.

Read Also: KCR: శ్రీలంక విషయంలో మాట్లాడకపోతే.. దోషిగా పరిగణిస్తాం

‘సిస్టమ్‌ డిజైన్ అండ్‌ మేనేజ్‌మెంట్‌’ను సహజంగా మేల్‌ డామినేటెడ్‌ కోర్సుగా భావిస్తుంటారు. అంటే ఎక్కువగా అబ్బాయిలే దీన్ని ఎంచుకుంటారు. ఈ కోర్సును పూర్తిచేయాలంటే అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. ఆ కష్టాన్ని సుచరిత ఇష్టంగా మలచుకుంది. కోర్సులో చేరకముందు ఆమె మొఫిట్‌ అనే ఎన్జీవోలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా చేసేది. మొఫిట్‌.. అమెరికాలోని ఒక క్యాన్సర్‌ సెంటర్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌. అందులో సుచరిత క్యాన్సర్‌ రీసెర్చర్లు, ప్రొఫెషనల్స్‌, పేషెంట్స్‌ కోసం క్రిటికల్‌ హెల్త్‌కేర్‌ సిస్టమ్స్‌ డిజైనింగ్‌, డెవలప్‌మెంట్‌ పనులు చూసుకునేది.

ఈ స్కిల్స్‌కి మరింత పదును పెట్టుకునేందుకు, హెల్త్‌ కేర్‌ రంగంలో సొంత టెక్నాలజీ కంపెనీ పెట్టేందుకు మిట్‌లో చేరింది. ఇంజనీరింగ్, టెక్నాలజీ కోర్సులకు ఎక్స్‌లెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ మిట్ కావటంతో ఫస్ట్‌ ఛాయిస్‌ని ఆ సంస్థకే ఇచ్చింది. కోర్సు పూర్తి చేయటానికి 16 నెలల లాంగ్ జర్నీ చేసింది. ఈ సుదీర్ఘ సమయం తనకు జీవితకాల అనుభవాన్ని మిగిల్చిందని సుచరిత పేర్కొంది. ‘సిస్టమ్‌ డిజైన్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సును ముఖ్యంగా ఇంజనీరింగ్‌ లీడర్లను తయారుచేసే లక్ష్యంతో రూపొందించారు. క్లిష్టమైన సవాళ్లను ఈజీగా, కొత్తగా పరిష్కరించగలిగేలా ఈ కోర్సు ఇంజనీరింగ్‌ లీడర్లను తీర్చిదిద్దుతుంది.

ప్రపంచంలోనే ది బెస్ట్‌ అనబడే ఇంజనీర్లలో కొంత మంది మాత్రమే ఈ కోర్సుకి అప్లై చేస్తారు. అడ్మిషన్‌ పొందటం ఒక ఛాలెంజ్‌ లాంటిది. సీటొచ్చిన విద్యార్థి కోర్సు పూర్తయ్యాక ప్రపంచానికి తన వంతు సర్వీసు అందించేలా మిట్‌ ఎంతో ఆశించి ప్రవేశం కల్పిస్తుంది. నా అనుభవం, మిట్‌ లక్ష్యం ఒకటే కావటంతో నేను సీటు సంపాదించా. అయితే అసలు సవాల్‌ సీటొచ్చాకే ఎదురైంది. ఒక వైపు కోర్సు, మరో వైపు వర్క్‌, ఇంకో వైపు ఫ్యామిలీ. ఈ మూడింటిని కోఆర్డినేట్‌ చేసుకోవటం కొంచెం ఇబ్బంది అయింది.

మిట్‌ ప్రొఫెసర్లు ప్రతి సెమిస్టర్‌లో, చివరి నిమిషం వరకు నా నుంచి అత్యుత్తమ ఔట్‌పుట్‌ రాబట్టారు. ఈ విషయంలో నా భర్త శశాంక్‌ పాండెం ఎంతో సహకరించారు. నేను లేకపోవటాన్ని మా అబ్బాయి అంత త్వరగా అడ్జస్ట్‌ చేసుకోలేకపోయాడు. నేను నా కొడుకుని ఎంతో మిస్సయ్యాను. చివరికి అర్థంచేసుకున్నాడు. స్కూల్లోని తన ఫ్రెండ్స్‌ అందరికీ మిట్‌ గురించి చెప్పేవాడు. మొత్తానికి నా కోర్సు పూర్తయింది. కానీ ఇప్పటికీ ఇంజనీరింగ్ అనేది పురుషాధిక్య రంగమేనని గట్టిగా చెప్పగలను. ఈ ఫీల్డ్‌లో లేడీస్‌ లీడర్‌ లెవల్‌కి చేరటం ఇంకా కష్టసాధ్యం.

టెక్నాలజీ ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లను మిట్‌ గుర్తిస్తోంది. ప్రశంసిస్తోంది. కానీ బయటి ప్రపంచమే ఇంకా ఆ పనిచేయలేకపోతోందనిపిస్తోంది. టెక్నాలజీ, ఇంజనీరింగ్‌ రంగంలో మహిళలు తమనుతాము నిరూపించుకోవటానికి, నాయకత్వ స్థాయికి చేరుకోవటానికి పురుషుల కన్నా ఎక్కువ శ్రమించాలి. ఈ దిశలో వివిధ సంస్థల్లోని మహిళా ఇంజనీర్లను గుర్తించి, తగిన శిక్షణ ఇప్పించటం ప్రధానం’ అని సుచరిత మన్యాల అన్నారు