TG SAFE: పెద్ద బ్రాండ్లే కదా అని సేఫ్ అనుకుంటున్నారా? డొమినోస్, కేఎఫ్‌సీ స్టోర్లలో తనిఖీలతో కలకలం!

Telangana Food Safety Raids

Telangana Food Safety Raids

TG SAFE: బయట దొరికే స్ట్రీట్ ఫుడ్ కంటే ఇంటర్నేషనల్ ఫుడ్ చైన్స్‌లో దొరికే ఆహారం చాలా సురక్షితమని, పరిశుభ్రంగా ఉంటుందని చాలామంది నమ్ముతుంటారు. అందుకే ధర ఎక్కువైనా సరే, పెద్ద బ్రాండ్లే కదా అన్న ధీమాతో పిజ్జాలు, ఫ్రైడ్ చికెన్ ఆర్డర్ చేస్తుంటారు. అయితే, ఈ బ్రాండెడ్ రెస్టారెంట్లలోనూ ఆహార నాణ్యత ఎంతవరకు ఉందన్న అనుమానాలకు తెరతీస్తూ తెలంగాణ ఫుడ్ సేఫ్టీ (TG SAFE) విభాగం రంగంలోకి దిగింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రముఖ ఫుడ్ చైన్ అవుట్‌లెట్లైన డొమినోస్ (Domino’s), కేఎఫ్‌సీ (KFC) స్టోర్లపై అధికారులు ఈ రోజు మెరుపు దాడులు చేపట్టడం సంచలనంగా మారింది.

ఈ స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా హైదరాబాద్‌లోని మాసాబ్ ట్యాంక్ డొమినోస్ పిజ్జా అవుట్‌లెట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. లోపల కిచెన్ పరిసరాలు ఎలా ఉన్నాయి, ఆహార పదార్థాల తయారీలో ఎలాంటి ప్రమాణాలు పాటిస్తున్నారనే విషయాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ముఖ్యంగా పిజ్జాల తయారీకి కాలం చెల్లిన (ఎక్స్‌పైరీ డేట్ దాటిన) ముడిసరుకులు ఏమైనా వాడుతున్నారా అన్న కోణంలో తనిఖీలు చేశారు. సరుకుల నిల్వ విధానం, పరిశుభ్రతతో పాటు ఆయా అవుట్‌లెట్లకు సరైన లైసెన్సులు, FSSAI అనుమతులు ఉన్నాయా లేదా అన్న వివరాలను అధికారులు తనిఖీ చేశారు.

కేవలం హైదరాబాద్ మాత్రమే కాకుండా రాష్ట్రంలోని ఇతర ప్రధాన ప్రాంతాల్లో ఉన్న డొమినోస్, కేఎఫ్‌సీ స్టోర్లలోనూ ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. పెద్ద బ్రాండ్ల ముసుగులో ఆహార భద్రతా ప్రమాణాలను గాలికొదిలేస్తే సామాన్యుల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతుందని TG SAFE అధికారులు స్పష్టం చేస్తున్నారు. రూల్స్ ఉల్లంఘించినట్లు తేలితే ఎంతటి పేరున్న సంస్థలైనా సరే కఠిన చర్యలు తప్పవని అధికారులు గట్టిగా హెచ్చరించారు.