ఇటీవల తెలంగాణలో వర్షాలు వందేళ్ల చరిత్రలో ఎప్పుడూ లేనంత విధ్వంసం సృష్టించాయి. రహదారులు, పంటలు, ప్రజల ఆస్తులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రాథమిక లెక్కల ప్రకారం 5,018 కోట్ల మేర నష్టం జరిగిందని అంచనా. ఈ నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వాన్ని నిధుల కోసం ఒత్తిడి చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
తెలంగాణలో వరద నష్టంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ప్రాథమిక నివేదిక ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. దేశరాజధాని ఢిల్లీలో అమిత్ షాతో తెలంగాణ డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావులు భేటీ అయ్యారు. రాష్ట్రంలో వర్షాలు, వరదలు మిగిల్చిన నష్టాన్ని ఆయనకు వివరించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణలోని 7 జిల్లాల్లో విపరీతంగా వర్షాలు కురవడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ప్రాథమిక నివేదికలో పేర్కొన్నారు.
2025 ఆగస్టు 25–28 మధ్య తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా కామారెడ్డి, మెదక్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో వరదలు సంభవించి భారీ విధ్వంసం సృష్టించాయి. ఈ జిల్లాల్లో మౌలిక సదుపాయాలకు తీవ్రమైన నష్టం వాటిల్లింది. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన వర్షపాతం సాధారణం కంటే 25 శాతం అధికంగా ఉంది. ఎనిమిది జిల్లాల్లో 65 నుంచి 95 శాతం అదనపు వర్షపాతం నమోదైంది. వర్షాలు కొనసాగుతూనే ఉండటంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులు, పంటలు, పశువులు, మానవ ప్రాణాలు నష్టపోయాయని అమిత్ షా కు వివరించారు.
భారీగా కురిసిన వర్షాల తీవ్రతతో రోడ్లు, రైల్వే ట్రాక్‌లు, కల్వర్టులు, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు వంటి మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, రాష్ట్రవ్యాప్తంగా సాధారణ జీవన విధానానికి అంతరాయం ఏర్పడిందని స్పష్టంచేశారు. ఈ పరిస్థితిని జాతీయ విపత్తుగా పరిగణించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కోరారు.
తెలంగాణలో భారీ వర్షాల వల్ల పంట నష్టం తో పాటు, ఆస్తి నష్టం జరిగిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాక్ తెలిపారు. చెరువులు కుంటలు తెగిపోవడం, రోడ్లు ధ్వంసం అయ్యాయని కేంద్రానికి నివేదించారు. ప్రాథమిక నివేదిక ప్రకారం దాదాపు 5వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని, కేంద్రం ఎన్డీఏ పాలిత రాష్ట్రాలకు ప్రత్యేక నిధులు ఇస్తున్నట్లుగానే తెలంగాణకు నిధులు ఇవ్వాలని కోరారు.
గత ఏడాది ఖమ్మం, పరిసర జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా రూ.11,713 కోట్ల సహాయం కోరినా, ఇప్పటివరకు నిధులు విడుదల కాలేదని. అందువల్ల గతంలో కోరిన రూ.11,713 కోట్లతో పాటు తాజా అంచనా రూ.5,018 కోట్లు — మొత్తం రూ.16,732 కోట్లను కేంద్రం తక్షణమే విడుదల చేయాలని బృందం విజ్ఞప్తి చేసింది.
తెలంగాణలో కురిసిన వర్షాల వల్ల జరిగిన నష్టం పై ప్రభుత్వ ప్రాథమిక అంచనా
1. రోడ్లు (ఆర్&బీ) – ₹785.59 కోట్లు
2. ఇంధన శాఖ (విద్యుత్) – ₹40.73 కోట్లు.
3. పంట నష్టం – ₹236 కోట్లు
4. నీటిపారుదల – ₹655.70 కోట్లు
5. పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి – ₹377.43 కోట్లు
6. వైద్య & ఆరోగ్య శాఖ – ₹14.84 కోట్లు
7. పశుసంవర్ధక శాఖ – ₹10 కోట్లు
8. మున్సిపల్ పరిపాలన – ₹1025 కోట్లు
9. అత్యవసర మరమ్మతులకు తక్షణ నిధుల అవసరం – ₹1500 కోట్లు
10. ఇతర శాఖలు / ప్రభుత్వ ఆస్తులు – ₹300 కోట్లు
11. గృహనిర్మాణ శాఖ – ₹25 కోట్లు
12. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమం – ₹23.43 కోట్లు.
మొత్తం (ప్రాథమిక అంచనాలు): ₹5018.72 కోట్లు
