గత మూడేళ్లలో తెలంగాణ నుంచి జరిగే వస్తువుల ఎగుమతులు 68 శాతం మేర పెరిగాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ప్రజా ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం వల్లే తయారీ రంగం, ఎగుమతుల్లో ఈ అద్భుత ప్రగతి సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రానికి ఉన్న వ్యాపార అనుకూల వాతావరణం, పారదర్శక పాలనకు ఇది నిదర్శనమని తెలిపారు.
ఏరోస్పేస్, ఇంజనీరింగ్ జోరు.. జిల్లాలకు విస్తరిస్తున్న ప్రగతి
తెలంగాణ నుంచి ఏరోస్పేస్, ఇంజనీరింగ్ రంగాల ఎగుమతులు గణనీయంగా వృద్ధి చెందాయని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. కేవలం ఒకే ప్రాంతానికి పరిమితం కాకుండా, మహబూబ్నగర్ వంటి జిల్లాల పురోగతితో అభివృద్ధి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు విస్తరిస్తోందని అన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్లోని క్యూర్–ప్యూర్–రేర్ విధానంతో రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు మరింత వేగవంతం కానున్నాయని సీఎం తెలిపారు. 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ ఎదగడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

