DA Release : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. సచివాలయంలో సీఎస్ తో ఉద్యోగ జేఏసీ నేతలు జరిపిన చర్చలు విజయవంతమయ్యాయి. ఉద్యోగులు కోరుతున్న పెండింగ్ డీఏలో రెండింటిని వెంటనే విడుదల చేసేందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ నిర్ణయానికి ఉద్యోగ సంఘాలు కూడా అంగీకారం తెలిపాయి. రాబోయే కేబినెట్ సమావేశంలో ఈ రెండు డీఏల విడుదలకు అధికారికంగా ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
ఐదు డీఏలు అడిగితే రెండింటికి అంగీకారం.. శాతం వివరాలు ఇవే
జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో భాగంగా ఉద్యోగ జేఏసీ నాయకులు సీఎస్‌తో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏల విడుదల, రెండో పీఆర్సీ (PRC) సమర్థవంతమైన అమలు, సీపీఎస్ (CPS) రద్దు మరియు దీర్ఘకాలంగా పేరుకుపోయిన పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు. ముందుగా ప్రభుత్వం ఒక డీఏ ఇస్తామని ప్రతిపాదించినప్పటికీ, నేతల వినతితో సీఎస్ రెండు డీఏలకు ఒప్పుకున్నారు. ఇందులో మొదటి డీఏ 3.64 శాతం, రెండో డీఏ 2.74 శాతం చొప్పున చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే పీఆర్సీ కమిషన్ చైర్మన్‌తో సీఎస్ సమావేశమై నివేదికపై చర్చించినట్లు తెలుస్తోంది.
చర్చలతోనే పరిష్కారం సాధ్యం.. ప్రజా ప్రభుత్వానికి జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి ధన్యవాదాలు
చర్చల అనంతరం ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి మాట్లాడుతూ, ఎలాంటి సమస్యనైనా పట్టింపులకు పోకుండా చర్చల ద్వారానే పరిష్కరించుకోవచ్చని మరోసారి రుజువైందని హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు, ఇతర ప్రయోజనాల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. కానీ ప్రస్తుతం ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నెలా ఒకటో తేదీనే క్రమం తప్పకుండా జీతాలు అందుకుంటున్నామని తెలిపారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం ఎంతో సానుకూల ధోరణితో స్పందిస్తోందని, మిగిలిన సమస్యలకు కూడా సీఎస్ పరిష్కార మార్గాలు చూపించారని ఆయన వెల్లడించారు.

