ఉపాధ్యాయులకు ఆటోమేటిక్ పదోన్నతులు ఉండకూడదని తెలంగాణ విద్యా కమిషన్ అభిప్రాయపడింది.. వారి పని తీరు ఆధారంగానే ప్రమోషన్లు ఉండాలని సూచించింది. తెలంగాణ విద్యా కమిషన్ తన నివేదికను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డికి గురువారం సమర్పించింది. విద్యా విధానం పూర్తిగా విద్యార్థి కేంద్రంగా ఉండాలని కమిషన్ సిఫార్సు చేసింది.
కమిషన్ నివేదికలోని ముఖ్యాంశాలు…
ఉపాధ్యాయుల పని తీరును ప్రతి అయిదేళ్లకోసారి అంచనా వేయాలి. దాని ఆధారంగా ఆ ఉపాధ్యాయునికి ఒక నివేదిక అందజేయాలి. పని తీరు మెరుగుపర్చుకోవడానికి అతనికి రెండేళ్లు సమయం ఇవ్వాలి. అప్పటికీ పని తీరు మెరుగుపడకపోతే అతనిని సర్వీసు నుంచి తొలగించాలి. పని తీరు మెరుగ్గా ఉంటే ప్రమోషన్లు ఇవ్వాలి.. అయితే ఇప్పటికే సర్వీసులో ఉన్న వారికి వీటిని వర్తింపచేయకూడదు. ఇక నుంచి నియమించే ఉపాధ్యాయులకు వర్తింపజేయాలి. డిప్లమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యకేషన్ (D.EI.ED)ను రద్దు చేయాలి.. బీఎడ్‌ను పునర్వ్యవస్థీకరించి నర్సరీ నుంచి అయిదో తరగతి వరకు బీఎడ్ (ప్రైమరీ), 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు బీఎడ్ (సెకండరీ) ఉంచాలి. ఇందుకు ఎన్‌సీటీఈతో సంప్రదించాలి.. బీఎడ్ విద్యార్థులకు పాఠశాలల్లో 150 రోజుల బోధనాభ్యసం తప్పని సరి చేయాలి..
బోధనా మాధ్యమంగా ఇంగ్లీష్ ఉండాలి.. నర్సరీ నుంచి యూనివర్సిటీల వరకు బోధన మాధ్యమం ఇంగ్లీష్ ఉండాలి. త్రిభాష విధానం ఒకటో తరగతి నుంచే అమలు చేయాలి. తెలుగు/ఉర్దూ, ఇంగ్లీష్, హిందీ బోధించాలి.. పూర్వ ప్రాథమిక విద్యను (నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ) ప్రాథమిక పాఠశాలల్లో అందజేయాలి. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వచ్చిన బలమైన డిమాండ్ ఇది. పాఠశాల్లలో విద్యా ప్రమాణాలు, సిబ్బంది నియామకం, వసతుల కల్పన, నాణ్యతా ప్రమాణాల పర్యవేక్షణకు స్కూల్ డిస్ట్రిక్‌లను ఏర్పాటు చేయాలి. పాఠశాలల్లో వంట వండే మహిళలకు వారానికి ఒకసారి చెల్లింపులు చేయాలి.. మధ్యాహ్న భోజన అంచనాలు, ప్రతిపాదనలు, చెల్లింపుల కోసం సమగ్ర సాఫ్ట్‌వేర్ వాడాలి..
IIT-JEE/ NEET కోచింగ్ సెంటర్లు, హాస్టళ్లను నియంత్రించేందుకు చట్ట సవరణ చేయాలి.. ఫీజులు, మౌలిక సదుపాయాలు, అధ్యాపకులు, పాఠ్య ప్రణాళిక, విద్యార్థుల మానసిక ఆరోగ్యం, తప్పుదారి పట్టించే ప్రకటనలపై నియంత్రణ అవసరం.. ప్రైవేటు జూనియర్ కళాశాలల నుంచి వేరుగా పోటీ పరీక్షల కోచింగ్‌ను వేరు చేయాలి. 12వ తరగతిలో మాత్రమే బోర్డు ఎగ్జామ్స్ నిర్వహించాలి.. EAPCET రద్దు చేసి ఇంజినీరింగ్, వ్యవసాయం, ఫార్మసీ ప్రవేశాలు 12వ తరగతి మార్కుల ఆధారంగా కేటాయించాలి. ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్ బోర్డులను విలీనం చేయాలి. విద్యా ప్రమాణాలు మెరుగుపర్చడానికి కనిష్ట ఉత్తీర్ణత శాతాన్ని 45 శాతానికి పెంచాలి..
విశ్వ విద్యాలయాల కార్యనిర్వాహక మండలిని పునర్నిర్మించాలి.. దానికి వైస్ ఛాన్సలర్ ఛైర్మన్‌గా ఉండాలి.. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ల నియామకం రిటైర్డ్ ఛీప్ సెక్రటరీ, యూజీసీ నామిని, ముగ్గురు రిటైర్డ్ వైస్ చాన్సలర్లతో కూడిన సెర్చ్ కమిటీ ద్వారా పారదర్శకంగా జరగాలి.. యూనివర్సిటీల్లో సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని రద్దు చేయాలి… విద్యార్థుల నుంచి డిమాండ్ ఉన్న సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను రెగ్యులర్ కోర్సులుగా మార్చాలి. లింగ్డో కమిటీ సిఫార్సుల మేరకు విద్యార్థుల ఎన్నికలు నిర్వహించాలి. మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వ విద్యాలయం తరహాలో సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వ విద్యాలయాన్ని బహుళ-విభాగ విశ్వ విద్యాలయంగా అభివృద్ధి చేయాలి.. ప్రతి డిగ్రీ కాలేజీకి అనుబంధంగా 200 మంది అతి పేద విద్యార్థులకు హాస్టల్‌ను ఏర్పాటు చేయాలి.
